హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్ళించి నదుల అనుసంధానం చేస్తున్నామంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బోగస్‌గా అభివర్ణించారు. ఆయన ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తాటిపూడి ఎత్తిపోతల పథకంనుంచి కొన్ని పైపులద్వారా గోదావరినీటిని పోలవరం కాలువలోకలిపి దానినే అనుసంధానమంటున్నారని మండిపడ్డారు. రు.50 లక్షలుకూడా కాని ఈ పనులకు నదుల అనుసంధానమని పేరుపెట్టారని ఎద్దేవా చేశారు. దీనికి బదులుగా ఒక ప్లాస్టిక్ బాటిల్లో గోదావరి నీళ్ళను పట్టి, వాటిని తీసుకుని వెళ్ళి కృష్ణలో కలిపితే సరిపోయేదని అన్నారు. రు.1300 కోట్ల పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చివరికి ఇలా భ్రష్టుపట్టించారని విమర్శించారు. పనులు పూర్తికాకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. పట్టిసీమను జాతికి అంకితం చేస్తున్నారంటే, దీనినే పర్మినెంట్ చేస్తారేమోనని, పోలవరం ప్రాజెక్టును నిర్మించటంలేదేమోనని ప్రజలు అనుమానిస్తున్నారని చెప్పారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన దుర్ఘటనకు చంద్రబాబే కారణమని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారేమోనని అనిపిస్తోందని చెప్పారు.