క్రైస్తవ జనాభా నిష్పత్తి 2001 నాటితో పోల్చినప్పుడు 2011లో కూడా యధాతథంగా 2.3 శాతమే వుండటం ఆశ్చర్యకరం .మతాల వారీగా భారతదేశంలో 96. 63 కోట్ల మంది (79.8 % )హిందువులు, 17.22 కోట్ల మంది(14.2 %) ముస్లింలున్నారని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఈ మధ్యే విడుదల విడుదల చేసిన వివరాలు చెబుతున్నాయి. 2.78 కోట్ల మంది (2.3 %) క్రైస్తవులు, 2.08 కోట్ల మంది (1.7%) సిక్కులు, 0.84 బౌద్ధులు (0.7%), 0.45 కోట్ల మంది (0.4%) జైనులున్నారని తెలిపింది. హిందువుల జనాభా 0.7 శాతం తగ్గారని, ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగారని అంకెలు వెల్లడిస్తున్నాయి. .
ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణాలో రాష్ట్రాల్లో మాత్రమే చూసినా కూడా ఈ పదేళ్లలో అన్ని చర్చిల సంఖ్య భారీగా పెరిగింది. సోనియాగాంధీ , వైఎస్ రాజశేఖరరెడ్డిల వ్యక్తిగత మతవిశ్వాసాల కారణంగా వారు అధికారంలో వున్నసమయంలో క్రైస్తవ మతసంస్ధల విస్తరణ కార్యక్రమాలు జోరుగా పెరిగాయి. అలాంటప్పుడు జనాభాలో 2001 నాటి వలెనే క్రైస్తవుల సంఖ్య, జనాభాలో వారి దామాషా దాదాపు 2.3 శాతమే ఉందన్న నిర్ధారణ మీద ఎవరికైనా అనుమానమే వస్తుంది.
క్రైస్తవులుగా మారిన వారిలో అత్యధికులు హిందువులుగానే నమోదయ్యారన్నది అసలు వాస్తవం! మత నిష్ఠతో ఉత్తమ పౌరులుగా జీవించే ఈదేశంలోని అన్ని మతాలవారికీ ఉందన్నది రాజ్యాంగ వాస్తవం మాత్రమే కాదు, ఇదొక సాంప్రదాయికమైన సామాజిక సత్యం! మతాన్ని దుర్వినియోగం చేసుకుని అక్రమ ప్రయోజనాలను పొందడం సామాజిక నేరం! క్రైస్తవులుగా మారిన వారిలో అధికాధికులు దళితులుగా నమోదవుతుండడం కూడా నిజం. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేయడం, ఇళ్లలో క్రైస్తవ పద్ధతులు పాటించడం మత నిష్ఠకు చిహ్నం. ఈ మత నిష్ఠ కల క్రైస్తవులు క్రైస్తవులుగానే జనగణనలో నమోదు కావడం న్యాయం! దళితులుగా నమోదు కావడం సామాజిక అన్యాయం! దళితులకు రాజ్యాంగపరంగా లభిస్తున్న సదుపాయాలను, ఆరక్షణలను అక్రమంగా కాజేయడానికై అనేకమంది క్రైస్తవులు ఆధికారికంగా దళితులుగా చెలామణి అవుతున్నారన్న ఆరోపణలు దేశమంతటా వినబడుతున్నాయి. ఇలా లక్షలాది క్రైస్తవులు అక్రమంగా దళితులుగా చెలామణి అవుతుండడంవల్లనే క్రైస్తవుల నిష్పత్తి యథాతథంగా ఉందన్న ఆరోపణ సహేతుకమే అవుతుంది!
దళితులకు రాజ్యాంగం ఇచ్చిన సదుపాయాలలోకి ఆసదుపాయాలు వర్తించని క్రైస్తవులు చొరబడిపోతూండటమే అక్కడక్కడా ఉద్రిక్తతలకు కారణమౌతోంది. క్రైస్తవులకు సైతం దళితులకు లభిస్తున్న రాజ్యాంగ సదుపాయాలను ఇవ్వాలన్న డిమాండు నానాటికీ విస్తరించిపోతూండటం ఈ సందర్భంగా గమనార్హం.
రాజకీయాల్లోకి ఏదో ఒకవైపునుంచి, మతం ప్రవేశించాక ప్రత్యర్ధి పక్షాలనుంచి ప్రతి చర్యలు కూడా వుంటాయి. సోనియా ప్రాబల్యం వెలుగుతున్నప్పుడు క్రైస్తవ ప్రచార సంస్ధల ఉత్సుకత మాదిరిగానే, బిజెపి అధికారంలోకి వచ్చాక హిందుత్వ ప్రచార సంస్ధల హుహారు కూడా పెరిగిపోయింది. నాలుగేళ్ళుగా పెండింగ్ లో వుంచిన ఈ గణాంకాలను – కుటుంబనియంత్రణ వల్ల తగ్గిపోతున్న హిందువుల జనాభాను పెంచకోడానికి హెచ్చుమంది పిల్లల్ని కనాలని హిందూ సంస్ధలు పిలుపు ఇస్తున్న నేపధ్యంలో, బీహార్ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం విడుదల చేయడంలో ఇమిడి వున్న ఓట్ల రాజకీయాలు ఏమాత్రం ఆలోచించినా అర్ధమైపోతాయి.