‘చంద్రబాబేమన్నా దేవుడా, గాంధీనా…ఆయన్ను చూసి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు……ఎన్నికల టైంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. చంద్రబాబు బాగానే కష్టపడుతున్నా స్థానికంగా పార్టీ పరిస్థితులు బాగా లేవు….’ అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు జెసీ దివాకర్‌రెడ్డి. అలాగే ప్రత్యేక హోదా, నోట్ల రద్దు గురించి కూడా చిత్తం వచ్చినట్టుగా, చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాట్లాడాడు. జెసీ వ్యాఖ్యలపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జెసీకి చంద్రబాబు ఏం చెప్పాడో? ఏం వార్నింగ్ ఇచ్చాడో? లేక ఏదైనా పదవి ఆశ చూపెట్టాడో తెలియదు కానీ దెబ్బకు స్టాండ్ మార్చేశాడు. చంద్రబాబుని అపర భగీరథుడు అని పొగిడేశాడు. ఇంకా ఎన్నో అద్భుతమైన మాటలతో చంద్రబాబుని ఆకాశానికెత్తేశాడు. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరూ మాట్లాడనంత వల్గర్ మాటలతో జగన్ ఇమేజ్‌ని పాతాళానికి తొక్కేసే లాంటి వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఫుల్ ఖుషీ. ఆయన ఆనందం మొత్తం కూడా బహిరంగ వేదికపైన జెసీ మాటలు వింటున్నప్పుడే ఆయన మొహంలో కనిపించింది.
అయితే రాయలసీమ నేత జెసి తలనొప్పి తప్పిపోయిందని చంద్రబాబు అనుకునేలోపే ఉత్తరాంధ్ర నేత అయ్యన్నపాత్రుడు రెడీ అయిపోయాడు. చంద్రబాబు కూడా మమ్మల్ని సాక్షి పేపర్ చదవొద్దు అని చెప్తాడు కానీ నేను మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిల కంటే సాక్షి పత్రిక చదవడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. సాక్షి పత్రిక చదివితే మా తప్పులు తెలుస్తూ ఉంటాయని, సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని మాట్లాడేశాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు మావే. మాకు అనుకూలంగానే వార్తలతు రాస్తాయి అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా రోజుకో బాంబు పేలుస్తూ ఉన్నాడు అయ్యన్న. భూముల ఆక్రమణలతో పాటు స్థానికంగా టిడిపి చేస్తున్న తప్పులు గురించి మాట్లాడేస్తున్నాడు. అన్నింటికీ మించి చంద్రన్న ఉచిత పథకాల వళ్ళ రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టేశాడు. ఆ పథకాలకంటే కూడా ఏవైనా నీటి పారుదల ప్రాజెక్టులు, లేకపోత ఉపాధి కల్పించే పరిశ్రమలు చేపడితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
మొత్తంగా చూస్తే జెసీ మాటలకంటే కూడా అయ్యన్న మాటలకే ఎక్కువ డ్యామేజ్ జరిగేలా కనిపిస్తోంది. అతి త్వరలోనే జివిఎంసి ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో జెసీకి వేసిన మంత్రం లాంటిదేదో అయ్యన్నకు కూడా వేసి….ఆయన నోటి నుంచి వస్తున్న విమర్శల వర్షానికి బ్రేక్ వేసి పొగడ్తల కుండపోత కురిపించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.