రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ని పాలించడానికి, గాడిన పెట్టడానికి తానుమాత్రమే సమర్ధుడిని అని ప్రజలు తనపై నమ్మకం పెట్టుకున్నారని, ఆ విషయాన్ని తాను జీవితంలో మరిచిపోనని, అలాగే తాను కూడా నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నాని చెబుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెట్టుకుంటున్నారు.. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ప్రజలు మాత్రం బాబుని ఇంకెంతకాలం నమ్ముతారు వంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది!
గత ఏడాది జనవరిలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయ్యిందని, ఈ సదస్సువల్ల రాష్ట్రంతో సుమారు రూ.4.37లక్షల కోట్లకు వ్యాపార అవగాహన ఒప్పందాలు జరిగాయని బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2016 ఏడాది పూర్తయ్యింది.. మరి ఆ ఏడాది ఒప్పందాల్లో ఎన్ని కార్యాచరణలోకి వచ్చాయి? ఈ విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 భాగస్వామ్య సదస్సు అనంతరం చంద్రబాబు ప్రకటించిన రూ.4.37లక్షల కోట్లలో కనీసం కోటి రూపాయిల ఒప్పందం కూడా పూర్తిస్థాయిలో ఇప్పటివరకూ పూర్తి కాలేదట! సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన ఈ పచ్చి నిజంతో.. నాడు విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో బాబు చెప్పినవన్నీ బడాయి కబుర్లే అనిపించకమానదు! ఆ సంగతులు అలా ఉంటే మరోసారి ఆ సదస్సు ఏర్పాటుచేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
ఈ నెల 27 నుంచి విశాఖవేదికగా మరోసారి భాగస్వామ్య సదస్సును భారీగా నిర్వహిస్తున్నట్లుగా ఏపీ సర్కారు ప్రకటించింది. గత ఏడాది సాధించిన దాని కంటే భారీగా, ఇంకా గట్టిగా మాట్లాడితే రెట్టింపు స్థాయిలో ఒప్పందాలు చేసుకోనున్నట్లు చెబుతోంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నవారంతా… గత ఏడాది కుదుర్చుకున్న రూ.4.37 లక్షలకు ఇప్పటికీ దిక్కు మొక్కూ లేదంటే, వాటి గురించి వదిలేసి క్యాలెండర్ మారింది కదా అని మరలా కొత్త ఒప్పందాల మీద దృష్టి అని, పైగా గతేడాది కంటే రెట్టింపు అని చెప్పడం చూస్తుంటే ప్రజలను వెర్రి వాళ్లు అనుకుంటున్నారనుకోవాలా లేక బడాయి మాటలకు, మభ్య పెట్టే పనులకు బాబు అలవాటుపడిపోయారని భావించాలా? ఇదేనా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బాబుపై ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రతిఫలం అని పలువురు ప్రశ్నిస్తున్నారు!