2016 నవంబరు 8… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోజు. ఒక్క ప్రకటనతో 120కోట్లకు పైగా ఉన్న జనాన్ని ఒక్క కుదుపు కుదిపిన రోజు. ఆ రోజు మోడీ చేసిన ప్రకటన అనంతరం సామాన్యుడు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అయినా కూడా ఎక్కడో ఏదో ఒక మూల చిన్న ఆశ.. మోడీ చెప్పినట్లుగా డిశెంబరు 31 వరకూ ఆగితే నూతన సంవత్సరంలో మామూలుగా ఉండదని! మరీ ఒక రేంజ్ లో మార్పులు జరగకపోయినా కనీసం నిత్యావసర వస్తువుల ధరలైనా కాస్త తగ్గుతాయేమోనని చిన్న ఆశ!! అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం… నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేయడంవల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ప్రధాని ప్రసంగం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మరి ఫలితాల సంగతి?
నాడు మోడీ తీసుకున్న నిర్ణయం, అనంతరం చేసిన ప్రకటనపట్ల మెజారిటీ ప్రజలు నమ్మకం ఉంచారనే చెప్పుకోవాలి! ఎందుకంటే నిన్న మొన్నటివరకూ కూడా బ్యాంకుల్లో ఎప్పుడూ చూడనన్ని క్యూలు, ఏటీఎం లలో నగదు లేక ప్రత్యక్ష నరకం… అయినా కూడా మోడీపైనా, ఆయన మాటపైనా ప్రజలకు ఉన్న నమ్మకం వాటన్నింటినీ భరించేలా చేసింది. మోడీ చెప్పినట్లుగా నల్లధనం పోతే ధరలు తగ్గుతాయనే మాటతో చాలా మంది ఏకీభవించారు. అయితే.. ఆ కార్యక్రమం పూర్తయ్యింది, రెండు వారాలపైన గడిచింది.. మరి నాడు మోడీ చెప్పిన ఆ మాటల ఫలితం సంగతి ఏమిటి? నిత్యవసర ధరల తగ్గుదల మాటేమిటి? సరే.. మిగిలిన నిత్యావసర ధరల తగ్గుదల మాట అటుంచి వాటన్నింటినీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసే పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఏమిటి? అనేవి తాజాగా సామాన్యుడి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు!
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేటప్పుడు పైసల్లో తగ్గించటం, పెంచేటప్పుడు మాత్రం రూపాయిల్లో పెంచే వ్యవహారం భారతదేశంలో నిత్యకృత్యం. ఈ పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే… గడిచిన ఆరు వారాల్లో సుమారు నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు కనిష్ఠానికి చేరుకున్నా.. ఇండియాలో లీటరు పెట్రోల్ రూ.60కి దిగింది లేదు. అదే సమయంలో ముడిచమురు ధరలు కాస్త పెరిగితే చాలు లీటరు పెట్రోలు ఒకేసారి రూ.75కు పెరిగిపోతుంటుంది. అయితే… పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం పోగానే ధరలు తగ్గిపోతాయన్న ప్రధానిమోడీ మాటలతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. అయితే.. ఆ అంచనాలు తప్పన్న విషయం తాజాగా తేలిపోయింది.
నాడు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రకటించిన సమయంలో లీటరు పెట్రోల్ ధర రూ.72.25, లీటరు డీజిల్ ధర రూ.61.55 పైసలు ఉంది. నాటినుంచి దఫ దఫాలుగా ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో తాజాగా లీటరు పెట్రోల్ రూ.75.91 కాగా.. డీజిల్ ధర రూ.64.34గా నిర్ణయించారు. అంటే… మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం, దాని గడువు తేదీ దాటిపోయిన అనంతరం.. పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా పెరుగుతున్నాయన్న మాట. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం మిగిలిన రంగాలపై భారీగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పటికీ సామాన్యుడి కోణంలో మిలియన్ డాలర్ల ప్రశ్నే! ఫైనల్ గా… ఏడాది మారినా, మోడీ నిర్ణయాన్ని గౌరవించి సామాన్యుడు అన్నీ భరించినా, ఏదో జరగబోతుందని అంతా ఆశించినా… బాదుడులో మార్పు లేదు!