సాదారణంగా వేగంగా నడవని ఎద్దును, ఆ బండిపై కుర్చున్న వ్యక్తి ముళ్లకర్రతో వెనక పొడుస్తూ ఉంటాడు. పరిగెత్తగలిగి కూడా బద్దకించే ఆ ఎద్దు, ఉన్నట్లుండి మరింత వేగంగా నడుస్తుంది, పరుగు లంకించుకుంటుంది! అందుకే… పల్లెటూర్లలో ముళ్లకర్ర అనే మాట బాగా ఫేమస్!! సరే ఆ కర్ర సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు ఏపీ ప్రభుత్వాన్ని మేలుకొలపడమే కాకుండా, వేగంగా కదిలించగలుగుతుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ చెప్పిన అనంతరం ప్రభుత్వ స్పందన చూస్తుంటే… ఇంతకాలం ఆ సమస్య గురించి నిజంగానే ప్రభుత్వానికి తెలియదా, లేక పవన్ చెప్పాడు కాబట్టి ఉరుకులు పరుగులు పెడుతున్నారా? అంటే… సమాధానం చెప్పడం కాస్త కష్టమే!!
వివరాళ్లోకి వస్తే… పవన్ మాటల విషయంలో ఏపీ సర్కారు సీరియస్ గానే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదైనా సమస్యపై పవన్ స్పందిస్తే.. వెంటనే ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది. దీనివెనకున్న రాజకీయ పథకాలు, ముందస్థు జాగ్రత్తల సంగతి కాసేపు అలా ఉంచితే… దీర్ఘకాలంగా పరిష్కారం కాని ప్రజాసమస్యల్ని పవన్ తెర మీదకు తీసుకొస్తున్న వెంటనే సర్కారు స్పందిస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యను తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన పవన్… కేవలం నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది మరణించటంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వెంటనే స్పందించింది ఏపీ ప్రభుత్వం!
పవన్ స్పందన కారణంగా… ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల మూలాల్లోకి వెళ్లాలని భావిస్తోంది ఏపీ సర్కారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సమగ్రసర్వే నిర్వహించటం ద్వారా మరింత స్పష్టమైన సమాచారాన్ని సేకరించే వీలుంటుందన్న ఆలోచనలో ఉందట. అదే సమయంలో ఈ నెల 19న మంత్రుల కమిటీ సభ్యుల బృందం ఉద్దానంలో పర్యటించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇదే క్రమంలో ఉద్దానం సమస్యలపై అవగాహన కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఈ అలర్ట్ అంతా చూస్తుంటే… ప్రభుత్వం ఈ ఇష్యూకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది.
ఆ సంగతులు అలా ఉంటే… ఉద్దానంలో ఈ సమస్య తీవ్రంగా ఉందనే విషయం ప్రభుత్వానికి ఇప్పుడే తెలిసిందా? ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లిన సమయంలో కూడా అక్కడి సమస్యల గురించి నాటి పెద్దలకు తెలియదా? అయినా కూడా అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినా కూడా ఎందుకు ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు కదల్లేదు? పరిష్కారం చూపగలిగిన సమస్యలపై కూడా ప్రభుత్వం ఎందుకు బద్దకిస్తుంది? ఈ రోజు ఇంతలా రియాక్ట్ అవుతున్న ప్రభుత్వం.. ఇంతకాలం ఎందుకు ఆ సమస్యలపై చూసీ చూడనట్లు ఎందుకు దొంగ నిద్ర నటించింది? ప్రతీ సమస్యపైనా పవన్ ముళ్లకర్ర పట్టుకుని రావాలా?.. ఏమో…!? దీంతో… పవన్ ప్రశ్నిస్తాడనే నమ్మకంతోనే ఆయన బలపరిచిన, మద్దతిచ్చిన చంద్రబాబుకు నాడు ఓటు వేశామని చెబుతున్న చాలా మందికి ఈ తాజా సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి!