ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి దిశానిర్ధేశం.. టిడీపీ ఆశాజ్యోతి! ఇప్పటికే ప్రభుత్వంలో అనధికారికంగా కీలక భూమిక పోషిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో… ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు ఎప్పటినుంచో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా లోకేశ్ కు చోటు కల్పించబోతున్నారని అనధికారికంగా ఇప్పటికే స్పష్టమైంది. అన్నీ అనుకూలంగా జరిగితే మంత్రివర్గంలో చేరడానికి ముందో, చేరిన ఆరు నెలల లోపో ఆయన ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావలసి ఉంటుంది. దీంతో… విస్తరణకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని, అందులో ఆయన ఎన్నికవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి!
అవును… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ త్వరలో ప్రజా ప్రతినిధి అనిపించుకోనున్నారని తెలుస్తోంది! మార్చి లేదా ఏప్రిల్ లో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఆ 7 సీట్లలో టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి లభించే అవకాశముంది! ఈ క్రమంలో ఎమ్మెల్యేల కోటా నుంచే లోకేశ్ ఎన్నికవుతారని వార్తలొస్తున్నాయి.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ… టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానంలో, అభిమానులు కార్యకర్తలు ఆశలుపెట్టుకున్న వ్యక్తిని ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి అనిపించేలా నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. పైగా.. తమపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీగా లోకేశ్ ప్రత్యక్ష రాజకీయ కెరీర్ ప్రారంభం అవ్వడం ఆయన అభిమానులు కొంతమందికి ఇష్టం లేదని తెలుస్తొంది. నేరుగా ఎమ్మెల్యేగా పోటీచేసి, రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచినప్పుడు కదా మజా అని, అప్పుడే కదా లోకేశ్ రేంజ్ జనాల్లోకి వెల్లేదని వారు అభిప్రాయపడుతున్నారట. అంతేకానీ… ఇలా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి అనిపించుకోవాల్సిన పరిస్థితి లోకేశ్ కు వద్దని వారు వాపోతున్నరట. అయితే… లోకేశ్ ను మంత్రిగా చేయడానికి ఇంతకు మించిన మార్గం ప్రస్తుతం మరొకటి లేదని సీనియర్స్ చెబుతుంటే… మరో రెండేళ్లు ఆగినా పర్లేదు కానీ, ఇలా తమ అభిమాన నాయకుడి స్థాయిని తగ్గించొద్దని లోకేశ్ అభిమానులు పలువురు అభిప్రాయపడుతున్నారట!
ఇలా ఆలోచిస్తే ఇది కూడా ఒకరకంగా కరెక్ట్ అనే భావన పలువురు వ్యక్తపరుస్తున్నారట. భవిష్యత్తులో టీడీపీ తరుపున సీఎం క్యాండిడేట్ అయిన లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా పోటీచేసి, తాను చంద్రబాబు నాయకుడికి కరెక్ట్ రాజకీయ వారసుడినని నిరూపించుకునే అవకాశం ఉన్నప్పుడు, ఈ మార్గంలో ప్రజాప్రతినిధి అనిపించుకోవడం ఎందుకని మరికొంతమంది సీనియర్స్ కూడా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది!