గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలూ పన్ను మినహాయింపును ప్రకటించాయి. చరిత్రకు మార్పులు చేర్పులు చేసి, బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో పక్కా కమర్షియల్‌గా తీర్చిదిద్దిన గౌతమీ పుత్ర సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నో విమర్శలు వచ్చాయి. అది కూడా సినిమా రిలీజ్‌కి ముందే పన్ను మినహాయింపు ప్రకటించడం మరీ వివాదాస్పదమైంది. గౌతమీ పుత్ర సినిమాను తీసినవాళ్ళు పన్ను మినహాయింపు నిర్ణయాన్ని పబ్లిసిటీ కింద కూడా బాగానే వాడేసుకోవడంపైన విమర్శలు వచ్చాయి. విమర్శల విషయం అలా ఉంటే గౌతమీ పుత్రుడికి ఇచ్చిన చంద్రబాబు…తన రుద్రమదేవికి ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వలేదన్న గుణశేఖర్ ప్రశ్న మాత్రం చాలా మందిని ఆలోచింపచేసింది. గౌతమీపుత్ర సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఉన్న అర్హతలన్నీ కూడా రుద్రమదేవికి కూడా ఉన్నాయి. కానీ రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి మాత్రం చంద్రబాబుకు మనసు రాలేదు.
రుద్రమదేవి, గౌతమీ పుత్ర సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు 1971లో ఇండియా-పాకిస్తాన్ల మధ్య విశాఖ తీరంలో సముద్రంలో జరిగిన యుద్ధ నేపథ్యంలో ఘాజీ అన్న సినిమా తెరకెక్కుతోంది. పివిపి ప్రొడ్యూసర్‌గా రానా, తాప్సీ హీరోహీరోయిన్స్‌గా సంకల్ప్ అనే ఓ కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మేకింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఓ నాలుగు దశాబ్ధాల క్రితం మనందరికీ తెలిసిన ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కూడా గౌతమీ పుత్రకు ఉన్న అర్హతలన్నీ ఉన్నట్టే లెక్క. మరి ఇప్పుడు ఈ ఘాజీ సినిమాకు పన్ను మినహాయింపు విషయంలో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.