విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు 21వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటిలానే ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోనూ ఎన్టీఆర్ కి నివాళి కార్యక్రమాలు కనిపించాయి. ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యలు, తెలుగు దేశం నేతలు,అభిమానులు ఇలా అందరూ నివాళి కార్యక్రమంలో కనిపించారు. అయితే ఈసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం కాస్త హెచ్చు స్థాయిలోనే మాట్లాడారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుండో వుందని గుర్తుచేసుకున్న చినబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతకు భారతరత్న ఇవ్వాల్సిందే అన్నారు. సినీ,రాజకీయాల్లో అన్నగారిది అరుదైన ముద్రని చెప్పిన లోకేష్.. అన్నగారు రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లోనే అధికారం చేపట్టి ప్రభంజనం సృష్టించారని గుర్తు చేశారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆయనకు కృతజ్ఞతగా విజయవాడలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలను అందులో అందుబాటులో వుంటాయని, ప్రతీ తెలుగువాడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అన్నగారి మ్యుజియం అవుతుందని చెప్పుకొచ్చారు లోకేష్.
అయితే ఇక్కడ మీడియా ప్రతినిధులు ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది కదా. ఇప్పుడు అన్నగారి జీవితంపై సినిమా తీసే ఆలోచన లేదా? అని. ఈ ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశారు చినబాబు. ఎన్టీఆర్ పై సినిమా తీయడం ఎవరివల్లా కాదని,ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమని, రెండున్నర గంటల్లో ఆ మహా నాయకుడి గురించి ఏం చెబుతారని? అంటూ ఎదురు ప్రశ్నతోనే ముగించేశారు లోకేష్.
అయితే ఇపుడు లోకేష్ సమాధానంపై కొందరు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ”మ్యుజియం అంటే కదలని, మాట్లాడలేని వస్తువులను తమ నచ్చినట్లు పెట్టుకోవచ్చు. అదే ఎన్టీఆర్ పై సినిమా అంటే వాస్తవాలను చూపించాలి. ఎన్టీఆర్ ఎంతటి గొప్ప కధానాయకుడు? ఆయన ప్రజాధరణ ఏమిటి? అధికారం ఎలా సాధించారు? ఆయన్ని నుండి అధికారాన్ని ఎవరు, ఎలా దూరం చేశారు? ఎలాంటి వెన్నుపోటు పొడిచారు? ఇలా చాలా విషయాలను తెరపై చూపించాల్సి వుటుంది. అవి చూపిస్తే ఎవరికి నష్టమో లోకేష్ బాబుకి బాగాతెలుసు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇలా బిత్తరపోయే సమాధానం ఇచ్చారు లోకేష్” అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.