ఢిల్లీలో పార్టీ పెట్టినా దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది ఆం ఆద్మీ పార్టీ. తలకు మఫ్లర్ కట్టి చీపురు పట్టిన ఒక సామాన్యుడిని సీఎం చేసింది. ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు తెలంగాణలో మరో “ఆప్” లాంటి పార్టీ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని తాజాగా ఒక చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పూర్వాశ్రమంలో ఆప్ లో కీలక నేతగా ఉండి ప్రస్తుతం జైకిసాన్ ఆందోళన్ కన్వీనర్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీసాయనే చెప్పాలి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో నిలిచి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం… కేసీఆర్ పాలనపై పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం నడవడం లేదని ఆరోపిస్తూ.. అసలు ప్రజలు కోరుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదనే, ఉద్యమ సమయంలో తామంతా సామాజిక తెలంగాణ కోసం పోరాడితే, అందుకు విరుద్ధమైన పాలన కేసీఆర్ సర్కారు అందిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ రాజకీయం అన్న అంశంపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ప్రత్యేక సదస్సుకు హాజరైన సందర్భంగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు… సమీప భవిష్యత్తులోనే కోదండరాం రాజకీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెబుతున్నాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని ఆయన పేర్కొనడంతో ఈ విషయంపై ఇక కోదండరాం ప్రకటనే ఆలస్యం అనే మాటలూ వినిపిస్తున్నాయి.
ఈ సభలో యాదవ్ మాట్లాడిన అనంతరం మైకందుకున్న కోదండరాం కూడా తన రాజకీయ రంగప్రవేశం తప్పేలా లేదని వ్యాఖ్యానించడంతో ఈ విషయం దాదాపు ఫైనల్ అయినట్లేనని అనుకోవచ్చు. అరవై ఏళ్ల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, పాలనా వ్యవస్థలో అవినీతిని రూపు మాపేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా పోరాడేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పడంతో కొత్తపార్టీపై మరింత క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.
అయితే.. ప్రస్తుతం తెలంగాణలో బలమైన ప్రభావం చూపగలిగే ప్రతిపక్షాల లేకపోవడంతో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విశ్లేషణాత్మక చర్చ జరగడం లేదని కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంఖ్యా పరంగా చూసుకున్నా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షలో భాగంగా “గోపీ” లంతా అధికారపక్షంలో చేరిపోవడంతో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే అనుకోవాలి. ఈ క్రమంలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తి అనేది తెలంగాణలో లేదనే వారే ఎక్కువ! దీంతో కోదండరాం కొత్త పార్టీ పెడితే కచ్చితంగా అది మరో ఆప్ అవుతుందని కొందరంటుంటే… ఈ సమయంలో తెలంగాణలో తెరాసకు ధీటుగా నిలబడే పార్టీ లేదని, ఇప్పట్లో రాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా కోదండరాం పార్టీ పెడితే.. అది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి!!