ఈ సంక్రాంతికి ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణిల మధ్య పోటీగానే చూసింది టాలీవుడ్. ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పేరులో, వసూళ్లలో దేనికి ఎక్కువ ఓట్లు పడతాయనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఖైదీ నెం.150 వసూళ్లు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది చిత్రబృందం. అల్లు అరవింద్ రెండో రోజే ప్రెస్ మీట్‌పెట్టి ‘తొలిరోజు టాలీవుడ్ రికార్డు మాదే’ అంటూ ప్రకటించేశారు. మరోవైపు ఖైదీ పీఆర్, చిరు కాంపౌండ్ వర్గాలు ఎప్పటికప్పుడు ఖైదీ వసూళ్లని వెల్లడిస్తూనే ఉన్నారు. ఏ రోజుకారోజు లెక్కలు బయటకు వచ్చేశాయి. తొలి వారం ముగిశాక చిత్రబృందం మరోసారి ప్రెస్ మీట్ పెట్టి వంద కోట్లు వసూలు చేసిన లెక్కల్ని అంకెలతో సహా అప్పగించింది. అయితే గౌతమిపుత్రకు సంబంధించి లెక్కలేవీ బయటకు రాలేదు. పీఆర్ వసూళ్ల ప్రస్తావన ఎక్కడా రిలీజ్ చేయలేదు. అటు దర్శక నిర్మాతలూ ఈ విషయంలో మౌనంగానే ఉన్నాయి. ఎట్టకేలకు ఈరోజున గౌతమి పుత్ర రూ.50 కోట్ల మైలు రాయిని చేరుకొందని, తొలి వారంలోనే బయ్యర్లకు లాభాల్ని తెచ్చి పెట్టిందని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది.
వసూళ్ల వివరాలు మరీ ఇంత ఆలస్యంగా ప్రకటించడం పై నందమూరి అభిమానులు కుసింత ఆగ్రహంగానే ఉన్నారు. మరోవైపు చిరు బృందం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటే.. శాతకర్ణి మాత్రం వారం రోజుల వరకూ నోరు మెదపకపోవడం ఏమిటన్నది వారి ప్రశ్న. ఖైదీ వసూళ్లు గౌతమి కంటే ఎక్కువగానేఉన్నాయి. ఉంటాయి కూడా. తొలి రోజున టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసింది ఖైదీ. అయితే గౌతమిపుత్రకు ఆ అవకాశం రాలేదు. తొలి రోజు మంచి వసూళ్లే దక్కినా ఖైదీ కంటే వెనుకబడే ఉంది. అలాంటప్పుడు వసూళ్ల గురించిన వివరాలు బయటపెట్టడంలో ఉపయోగం ఉండదు. అందుకే రూ.50 కోట్ల మైలు రాయి అందుకొన్న తరవాతే వసూళ్లు చెప్పాలని చిత్రబృందం భావించిందట. పైగా ఈమధ్య ఐటీ శాఖ భయం పట్టుకొంది టాలీవుడ్‌కి. వసూళ్ల వివరాలు ఇలా చెప్పడమే తరువాయి.. అలా ఐటీ శాఖ దాడులు మొదలెట్టేస్తోంది. అందుకే ఆ టెన్షన్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇంత కాలం ఓపిక పట్టినట్టు తెలుస్తోంది.