ఎలాగైతేనేం… చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి వచ్చేశారు! రాజకీయాల నుంచీ దూరంగా వచ్చేశారు. ప్రజాసేవ నుంచీ పక్కకు వచ్చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, సామాన్యుడికే సర్వాధికారాలు అంటూ నాడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ, తనదైన ముద్రను రాజకీయాల్లో చూపలేకపోయారు. కేంద్రమంత్రిగా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారన్నడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే… కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా మెగా ప్రభావం అంతంత మాత్రమే. నిజానికి, ఆంధ్రాలో కాంగ్రెస్ కష్టాల్లో ఉంది. చిరంజీవి లాంటి స్టార్ క్యాంపెయినర్ ఉండి కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అది పార్టీ వైఫల్యమో… చిరంజీవి నిరుత్సాహమో అనేది వేరే చర్చ. ఏదేమైనా రాజకీయాల్లో మెగాస్టార్ ఇమడలేకపోయారన్నది సుస్పష్టం. ఇప్పుడు ఆయన మాటల్లో అదే ధ్వనిస్తోంది.
గతంలో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చెప్పారు. తన 150 చిత్రం విడుదలకు ముందు ఎంతో ఆందోళనగా ఉండేవాణ్ననీ, పదేళ్ల విరామం తరువాత ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ తనకు ఉండేదని తాజాగా చిరంజీవి అన్నారు. అయితే, సినిమా విడుదల అయ్యాక ఎప్పుడూ లేనంత ఆనందం అనిపించిందన్నారు. గత పదేళ్లలో లేని ఉత్సాహం ఇప్పుడు ఇంట్లోవారిలోనూ కనిపిస్తోందని చిరంజీవి చెప్పారు. రోజంతా సినిమా షూటింగ్‌కి వెళ్లిరావడంలో ఉన్న సంతోషమే వేరని అన్నారు. ఈ కిక్ లో వరుసగా మరో రెండు సినిమాలు చేసేయాలని ఉందన్నారు.
సో… ఇదీ చిరంజీవి స్పందన! ఆయన మాటల్లో ధ్వనిస్తున్న అంతరార్థం ఏంటంటే… గడచిన పదేళ్లూ రాజకీయాల్లో తాను ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోయానో అని చెప్పడం. మరి, రాజకీయాల్లో ఇలాంటి ఒత్తిడి ఉంటుందని ముందుగా చిరంజీవికి తెలీదా..? లేదా, తెలిసినా కూడా వేరే ఎవరైనా బాగా ఒత్తిడి చేయడం వల్లనే రాజకీయాల్లోకి వచ్చారా..? ఇంతకీ ఏం సాధిద్దామన్న ఉద్దేశంతో నాడు ప్రజారాజ్యం స్థాపించినట్టు..? తాజా వ్యాఖ్యలు వింటుంటే… ప్రజాసేవపై ఏమాత్రం కమిట్మెంట్ లేకుండానే ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారా అనే భావన కలగడం సహజం. ఎలాంటి సిద్ధాంతం లేకుండా పార్టీ పెట్టేసినట్టు అనిపించడం!
పదేళ్లలో ఎన్నడూ లేని సంతోషం ఇప్పుడు కలుగుతోందంటే… ప్రజాసేవపై చిరంజీవి ఉన్న అభిప్రాయం ఏ స్థాయిలో ఉండేదో చెప్పకనే చెప్పినట్టు కదా! ఏదైతేనేం, ఇప్పటికైనా నటనకీ నాయకత్వానికీ ఉన్న తేడాను గుర్తించగలిగారు. కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడింది. సినిమావాళ్లు రాజకీయాలకు పనికొస్తారు… కానీ, అందరూ కాదు! క్రేజ్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి దిగితే సరిపోదు. ప్రజాసేవ పట్ల వ్యక్తిగత నిబద్ధత ఉండాలి… ఏమంటారు?