ఐకమత్యం అంటే ఎలా ఉండాలో తమిళ ప్రజలు జల్లికట్టు విషయంలో చూపించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్లో తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. తమిళ ప్రజల పోరాట స్ఫూర్తిని పవన్ మెచ్చుకున్నారు. జల్లికట్టుపై పార్టీలకు అతీతంగా, కులమతాలతో సంబంధం లేకుండా, ప్రాంత భేదాలకు తావులేకుండా తమిళ ప్రజలు ఉద్యమించిన తీరు ప్రసంశనీయం అన్నారు. లక్షలమంది మెరీనా బీచ్‌కు తరలివచ్చి నిరసన తెలిపారనీ, ద్రవిడ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు వారు చూపిన చొరవ అద్భుతం అన్నారు. ‘తమిళులను చూసి ఆంధ్రా నాయకులు ఏదైనా నేర్చుకుంటారా..? నాయకుల్లో ఈ కలిసి కట్టుతనం ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసేది. కానీ, మన నాయకులకు వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదు. ప్రత్యేక హోదా విషయంలో నాయకులు రాజీపడిపోయారు. కానీ, ప్రజలు మాత్రం కాదు. ఆ ప్రజలకు అండగా జనసేన ఉంది’ – ఇదీ పవన్ కల్యాణ్ ట్వీట్ సారాంశం.
రైట్… పవన్ కల్యాణ్ చెప్పినట్టు తమిళ ప్రజలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సందర్భమే ఇది. చట్ట వ్యతిరేకమైన జల్లికట్టునే తమిళ ప్రజలు సాధించుకున్నప్పుడు.. చట్టబద్ధంగా ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాపై పోరాటం చేయాల్సిందే. కేంద్రం మెడలు వంచాల్సిందే. తమిళుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కానీ, ఆ పోరాట స్ఫూర్తికి నాయకత్వం వహించాల్సింది ఎవరు..? కేంద్రాన్ని నిలదీయాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో చతికిలపడిపోయారు. కేంద్రంతో రాజీపడిపోయారు. ప్రత్యేక హోదా అంటూ కేంద్రం ఊరించి ఊరించి ఒక ప్యాకేజీ ఆంధ్రుల ముఖాన పడేస్తే… దాన్ని కళ్లకద్దుకుని అదే మహాప్రసాదం అని సంతృప్తి పడిపోతున్నారు. కేంద్రాన్ని చంద్రబాబు నిలదీసేదెప్పుడూ.. ప్రశ్నించేదెప్పుడూ… ఆయన భాజపాపై ఉద్యమించేది ఎప్పుడు…? ఇది జరిగే పనికాదని సగటు ఆంధ్రుడుకి ఒక స్థాయి నమ్మకం ఏర్పడిపోయింది.
రైట్… పవన్ కల్యాణ్ చెప్పినట్టు జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే! ఈ కామెంట్స్ చేసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా ‘తాను సాగిస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని’ ఒక్కసారి తరచి చూసుకోవాలి. సింహావలోకనం చేసుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు రాజీపడలేదనీ… ప్రజల వెంట జనసేన ఉందనీ ఇప్పుడూ చెబుతున్నారు.. బానే ఉంది! కానీ, సేనగా ఉన్న జనానికి నాయకత్వం వహించాల్సిన స్థానంలో పవన్ ఉన్నారా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. ఉంటే, ఎక్కడున్నారు….? జన సైన్యానికి ఎంత దూరంలో ఉన్నారో కూడా ఒక్కసారి సరిచూసుకోవాల్సిన తరుణమిది.
పవన్ కల్యాణ్ చేపట్టిన లేదా చేపడుతున్న ప్రత్యేక హోదా సాధన ఉద్యమం కొన్ని సభలకు మాత్రమే పరిమితమైందన్నది వాస్తవం. ఒక తిరుపతి, ఒక కాకినాడ, ఒక అనంతపురం సభలు… కొన్ని ప్రెస్ మీట్లు… ఆ తరువాత జనసేన కార్యాచరణ ఏది..? ఉద్యమ నిర్మాణం ఏది..? క్షేత్రస్థాయి ఉద్యమ కమిటీలు ఏవి..? కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలేవీ…? ఇంతకీ ఈ ఉద్యమంలో పవన్ కల్యాణ్ ఎక్కడ…???