ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది! అది అలా ఉంటేనే తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్టున్నారు! ఇలానే ఉంటే బాగుంటుందని ప్రతిపక్ష నేత జగన్ కూడా కోరుకుంటున్నట్టున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ‘ప్రజా రాజధానిని నిర్మిద్దాం’ అని ఆయన ఈ మధ్య చెబుతూ వస్తున్నారు. అంటే, చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి కాదు అనే ఒకస్థాయి నమ్మకం జగన్‌కు బలంగా ఉంది. వాస్తవ పరిస్థితుల కూడా అలానే ఉన్నాయనుకోండి! ఇంకా డిజైన్లే పూర్తి కాలేదు. తాత్కాలిక సచివాలయంతోనే సరిపెట్టుకుంటున్నట్టుగా ఉంది. అయితే, అమరావతి నిర్మాణం అసంపూర్ణంగా ఉండటం వెనక చంద్రబాబు ఆశలు ఒకలా ఉంటే… జగన్ అంచనాలు మరోలా ఉన్నాయని చెప్పొచ్చు!
వచ్చే ఎన్నికలలోపు రాజధాని నిర్మాణ పనుల్లో అనూహ్యమైన మార్పులేవీ చోటు చేసుకోవు! ఎందుకంటే, నిధుల కొరత సుస్పష్టం. కేంద్రం చూపిస్తున్న సవతితల్లి ప్రేమా సుపరిచితం! కాబట్టి, ఎన్నికల్లో రాజధాని నిర్మాణమే ప్రధాన ప్రచారాస్త్రం అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు కాబట్టి… తెలుగుదేశం పార్టీని ఓడించాలని జగన్ పిలుపునిస్తున్నారు. టీడీపీ ఫెయిల్యూర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడొచ్చన్నది ప్రస్తుతం వైకాపాకు ఉన్న అంచనాగా తెలుస్తోంది. సో.. వైకాపా అధికారంలోకి రావడానికి ఇదో బలమైన అంశంగా ఉపయోగపడుతుంది అనేది వారి విశ్లేషణ. అయితే, ఈ అసంపూర్ణ అమరావతిపై తెలుగుదేశం అంచనాలు కూడా తక్కువేం లేవనే చెప్పుకోవాలి!
మరోసారి అధికారంలోకి రావడానికి రాజధాని నిర్మాణ అంశమే పనికొస్తుందన్నది వీరి ఆలోచన! ఎలా అంటే… చంద్రబాబు నాయుడు ఎంతో విజన్‌తో రాజధాని నిర్మిస్తున్నారూ… ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పునాదులు వేశారూ… మరికొంత సమయం ఇచ్చీ, ఇంకోసారి అధికారం ఇస్తే ఆయనే పూర్తి చేయగలరూ… ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికే దశాబ్దకాలం పట్టినప్పుడు, అమరావతికి ఆమాత్రం సమయం ఇవ్వరా… అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో… వచ్చే ఎన్నికల్లో ఇది వర్కౌట్ అవుతుందన్నది వీరి విశ్లేషణ.
ఇలా ఈ అసంపూర్ణ అమరావతి నిర్మాణంపై ఎవరికివారు పొలిటికల్ మైలేజ్ చూసుకుంటున్నట్టుగా ఉన్నారు! రాజకీయ పార్టీల మనుగడ కోసం పోరాటంలో ఆంధ్రుల రాజధాని నిర్మాణం ఆలస్యం అవుతుంటే.. ఈ చోద్యాన్ని చూస్తూ మౌనంగా ఉండటం తప్ప, సామాన్యుడు చేసేదేముంది..?