తెలుగు సినిమా స్థాయికి మించిన పెట్టుబడితో బాహుబలి సినిమాను తెరకెక్కించిన రాజమౌళి…అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు. డైరెక్షన్ టాలెంట్‌తో పాటు మార్కెటింగ్ తెలివితేటల విషయంలో కూడా రాజమౌళిది మాస్టర్ మైండే. అందుకే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అనే రేంజ్లో ప్రచారం చేశాడు. బాహుబలి సినిమా సక్సెస్‌తో తెలుగోడి సత్తాని లింక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. బాలకృష్ణతో శాతకర్ణి సినిమా విషయంలో కూడా ఆ సినిమా డైరెక్టర్ క్రిష్ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. బాలకృష్ణ మార్కెట్ రేంజ్ కంటే చాలా ఎక్కువ పెట్టుబడితో ‘శాతకర్ణి’ సినిమాను తెరకెక్కించిన క్రిష్ కూడా తెలుగోడి వీర చరిత్ర, తెలుగోడి పౌరుషం అంటూ సెంటిమెంట్‌ని బాగానే రగిలించాడు. రుద్రమదేవి సినిమాను తీసిన గుణశేఖర్‌కి మాత్రం ఈ రేంజ్ తెలివితేటలు లేకపోయినాయి. కానీ క్రిష్, రాజమౌళిలు మాత్రం వాళ్ళు తీసిన సినిమాల సక్సెస్ తెలుగోడి గొప్పదనానికి ప్రతీక అనే రేంజ్లో ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. తెలుగోడి సత్తా, తెలుగోడి గొప్పదనాన్ని కేవలం ఓ సినిమా హిట్టు స్థాయికి పరిమితం చేశారు. బాహుబలి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడాన్ని కూడా అదే విధంగా ప్రచారం చేసుకున్నారు.
కానీ ఆ విజయాలన్నీ కూడా వెండితెరకే పరిమితం. తమిళ్ సినిమా ఇండస్ట్రీ జనాలందరూ కూడా జల్లికట్టు కోసం ముందుకు వచ్చారు….పోరాటంలో భాగమయ్యారు. సక్సెస్ సాధిచారు. రజినీకాంత్, శంకర్‌లాంటి టాప్ రేంజ్ సెలబ్రిటీస్‌తో పాటు తమిళ సినిమా పరిశ్రమ జనాలందరూ ఆ పోరాటానికి మద్దతు పలికారు. జల్లికట్టు కోసం తమతో కలిసిన తమిళ్ సినిమా వాళ్ళతో పాటు తెలుగు సినిమా వాళ్ళను తమిళులు గుర్తుపెట్టుకుంటారనడంలో సందేహం లేదు. మరి అదే తమిళ్ సినీ జనాలు కానీ తెలుగు సినిమా వాళ్ళు కానీ జల్లికట్టు కంటే ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడిలాంటి ప్రత్యేక హోదా కోసం ముందుకు రాగలరా? ఒక సినిమా హిట్టు కోసం సెంటిమెంట్‌ని అద్భుతంగా రగిలించగలిగిన మన టాప్ డైరెక్టర్స్ ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ని ఉద్యమస్థాయికి తీసుకెళ్ళగలరా? సినిమా వాళ్ళు తల్చుకుంటే ఏమవుతుంది అని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
గతంలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు కూడా ప్రజల కోసం జోలె పట్టిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి, పవన్, మహేష్, రాజమౌళిలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ముందుకు వస్తారనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా అందరినీ కదిలించే శక్తి ఈ సినిమా సెలబ్రిటీస్‌కి కచ్చితంగా ఉంది. పైగా రాజమౌళి, మహేష్‌లతో సహా వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. గల్లా జయదేవ్ గెలుపులో మహేష్‌బాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా? ఇక చిరంజీవి, పవన్‌ల గురించి చెప్పేదేముంది? కేవలం ఎంటర్టైన్మెంట్ తప్ప వేరే ఏదీ లేని సినిమాలనే ఉద్యమ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సినిమావాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యావశ్యకమైన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపించలేరా? ఆ శక్తి సామర్ధ్యాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ భరించాల్సి ఉంటుంది. నిజంగా ప్రజలకు మంచి జరగాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ కాస్త కష్టాలను కూడా భరించాలి మరి. ఒకవేళ మాకేం సంబంధం? సినిమాల బిజినెస్ చేసుకునేవాళ్ళం అని సైలెంట్‌గా ఉండే పనైతే మాత్రం…..ఇక ట్విట్టర్లో ఆ గోల ఎందుకు? ప్రతి సామాజిక విషయంపైనా గొప్ప గొప్ప పదాలతో స్పందించడం ఎందుకు? అంబానీలు, అదానీలు, టాటాల్లాంటి బిజినెస్ పీపుల్ ఎప్పుడైనా ఇలా స్పందిస్తున్నారా? వాళ్ళ బిజినెస్‌లు వాళ్ళు చేసుకుంటున్నారుగా. సినిమా వాళ్ళు కూడా అదే చేస్తే సరిపోతుందిగా? ఊహూ……అదెలా కుదురుతుంది? పక్కా కమర్షియల్ మసాలా సినిమాలు తీసే సినిమావాళ్ళకు వాళ్ళ ఇమేజే ప్రాణం. అందుకే ఆ హీరోచిత ఇమేజ్ కోసం గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. మహాత్మాగాంధీ, సుభాస్ చంద్రబోస్‌ల లక్షణాలు మాలోనూ ఉన్నాయని చెప్పడానికి సినిమా పోస్టర్స్ లాంటి స్టిల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి అభిమానుల ఆలోచనా రహితమైన, ఆవేశపూరిత అభిమానం పీక్స్‌కి వెళుతుంది. అంతకు మించి మన తెలుగు సినిమావాళ్ళు తెలుగు ప్రజలకు చేస్తున్న మంచి ఏమైనా ఉందా?