తెలుగు సినిమాని సాంకేతికంగా పది మెట్లు ఎక్కించిన చిత్రం బాహుబలి. కేవలం కథ. కథనాల పరంగా చూస్తే.. బాహుబలి అంతటి విజయం సాధించి ఉండేది కాదేమో..? రాజమౌళి దాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు కాబట్టే దేశం మొత్తం… శభాష్ బాహుబలి అంటూ మెచ్చుకొంది. ఇప్పుడు బాహుబలి 2 రాబోతోంది. ఈ సినిమా విజువల్ గా ఏ స్థాయిలో ఉండబోతోందో అని సినీ అభిమానులు అప్పుడే ఊహల్లో విహరిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాహుబలి 2ని తీర్చిదిద్దాడు రాజమౌళి. అయితే ఎంత గొప్పగా తీసినా, నాణ్యమైన థియేటర్లు లేకపోతే… ఆ కష్టమంతా వృథా అయిపోవడం ఖాయం. అందుకే బాహుబలి2ని కచ్చితంగా క్వాలిటీ ఉన్న థియేటర్లకే ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు కూడా తమ థియేటర్లని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేసుకొంటున్నాయి. అందులో భాగంగా 4 కె రెజుల్యేషన్ సమార్థ్యం ఉన్న స్క్రీన్లను ఏర్పాటు చేసుకొంటున్నాయి కొన్ని థియేటర్లు. ఈ తెరపై చూస్తే… సీన్ మరింత క్లారిటీగా కనిపిస్తాయి.
అయితే 4కె టెక్నాలజీ కోసం ప్రతీ థియేటర్ కనీసం రూ.కోటి రూపాయలైనా ఖర్చు పెట్టాల్సివస్తుంది. భవిష్యత్తులో 4కె టెక్నాలజీ ఉన్న థియేటర్లకు మరింత డిమాండ్ ఉండడం ఖాయమని భావిస్తున్న థియేటర్ యజమానులు ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకంజ వేయడం లేదని తెలుస్తోంది. ఏసియన్, పీవీఆర్ , సినీ పోలీస్ లాంటి కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే 4కె టెక్నాలజీని దిగుమతి చేసుకొనే పనిలో పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 200 థియేటర్లలో ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులో రానున్నదని తెలుస్తోంది. మరికొన్ని థియేటర్లు 4కె ప్రాజెక్టర్లను అద్దెకు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయట. మొత్తానికి బాహుబలి 2 కోసం థియేటర్లన్నీ కొత్త కొత్తగా సిద్ధమవుతున్నాయన్నమాట.