ఈ రిపబ్లిక్ డేకి విడుదల కావాల్సిన సూర్య సినిమా యముడు 3 వాయిదా పడింది. తమిళ నాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యముడు 3ని విడుదల చేయడం లేదని ఆ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడదన్నది త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. యముడు 3 ఎప్పుడైతే వెనక్కి వెళ్లిందో.. తెలుగులో చిన్న సినిమాలకు ఊపొచ్చింది. రిపబ్లిక్ డే సెలవుని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని తెలుగు సినిమాలు తొందరపడుతున్నాయి. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన లక్కున్నోడు ఫిబ్రవరి 3న విడుదల కావాల్సివుంది. ఇప్పుడు ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. జనవరి 26నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొంది. విష్ణుకి సోలో రిలీజ్పడి చాలా కాలం అయ్యింది. సంక్రాంతి సినిమాలు తప్ప… బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలేవీ లేని ఈ నేపథ్యం… విష్ణుకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. విష్ణుతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా సూర్య గైర్హాజరుతో రిపబ్లిక్ డేని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. నాని సినిమా… నేను లోకల్ ని కూడా ఈవారమే విడుదల చేస్తే ఎలా ఉంటుందా??? అని దిల్‌రాజు ఆలోచనలో పడ్డాడట. రేపటిలోగా ఇంకెన్ని సినిమాలు రిలీజ్ డేట్‌ని మార్చుకొంటాయో చూడాలి.