గొప్ప కథా బలమున్న సినిమా, క్రిటిక్స్‌ని కూడా మెప్పించే స్థాయి సినిమా తీయలేకపోయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా మార్కెట్‌ని భారీగా పెంచిన క్రెడిట్ మాత్రం ‘బాహుబలి’ సినిమా డైరెక్టర్ రాజమౌళికి దక్కుతుంది. రెండు మూడేళ్ళపాటు ఒక సినిమా కోసం కష్టపడడాన్ని కూడా మన తెలుగు హీరోలలో, డైరెక్టర్లలో చూడలేం. కథలో గొప్ప విషయం ఉండాలి అన్న విషయంపైన కంటే కూడా ప్రేక్షకులందరి చేతా విజిల్స్ కొట్టించాలి అనే విషయంపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు రాజమౌళి. సినిమా మొత్తం మీద కూడా ఓ నాలుగైదు అద్భుతమైన సీన్స్ ప్లాన్ చేసుకుని…ఆ సీన్స్‌తోనే పైసా వసూల్ అయిపోయింది అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో రాజమౌళి మాస్టర్. అలాగే మార్కెటింగ్ టెక్నిక్ విషయంలో రాజమౌళిని కొట్టేటోడు లేడు. ఇండియా మొత్తం మీద కూడా రాజమౌళి స్థాయిలో సినిమాను పబ్లిసిటీ చేసుకోగల డైరెక్టర్ ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే అందరి దృష్టిలో మంచి అనిపించుకోవడానికి కూడా ఇష్టపడతాడు రాజమౌళి. సింప్లిసిటీ, వినయవిధేయతల విషయంలో కూడా రాజమౌళిని చూసి నేర్చుకోవాలని చాలా మంది చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్…అలాంటి వాళ్ళందరూ కూడా రాజమౌళిని మీడియా కంటితో చూసిన వాళ్ళే అనుకోండి. కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే ఆ మాత్రం లౌక్యం కూడా అవసరమే.
కానీ కొన్ని విషయాల్లో రాజమౌళి ప్లే చేస్తున్న రాజకీయం మాత్రం ఆయన స్థాయిని తగ్గిస్తోంది. డైరెక్టర్‌గా మరీ సూపర్ స్టార్ఢం లేనప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు అభిమానినని మీడియాతో చెప్పాడు జక్కన్న. పవన్ కళ్యాణ్ కోసమైతే పడిచచ్చిపోయాను అనే రేంజ్లో చెప్పాడు. అదే రాజమౌళిని…మీ అభిమాన హీరో ఎవరు? అని కొంతమంది పవన్ ఫ్యాన్స్ అడిగినప్పుడు…ఎన్టీఆర్ అని చెప్పాడు జక్కన్న. ఈ సమాధానం చెప్పే టైంకి రాజమౌళికి సూపర్ స్టార్ఢం వచ్చేసింది. మగధీర టైంలో రాజమౌళికి, మెగా ఫ్యామిలీకి మధ్య కొన్ని ఇష్యూస్ వచ్చాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పి పవన్ ఫ్యాన్స్‌ని హర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదేమో. ఎందుకంటే ‘అభిమాన హీరో పేరు చెప్పి ఫ్యాన్స్ మధ్య గొడవలు క్రియేట్ అయ్యేలా చేసేంత మూర్ఖుడిని కాదు’ అని ఇదే రాజమౌళి ఓ ఇంటర్యూలో చెప్పాడు.
పవన్ విషయం పక్కన పెడితే కనీసం ఎన్టీఆర్ విషయంలో అయినా చిత్తశుద్ధితో ఉన్నాడా? రాజమౌళి, సుకుమార్‌లు ఎక్కడ కనెక్ట్ అయ్యారో కానీ ఇద్దరి మధ్యా మంచి బంధం ఉంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలను రాజమౌళి ప్రమోట్ చేశాడు. సుకుమార్‌ని ఇంటర్యూ చేస్తూ …ఆయా సినిమాలను తాను ఎంతగా ఇష్టపడింది, తనకు ఎంత బాగా నచ్చింది అని చెప్తూ సుకుమార్ తీసిన సినిమాలను ఆకాశానికెత్తేస్తుంటాడు రాజమౌళి. కానీ ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ అయ్యాడు. ‘నేనొక్కడినే’ సినిమాను సూపర్బ్‌గా ప్రమోట్ చేసిన జక్కన్న…‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ అయ్యాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ లుక్‌లో కనిపించిన, ప్రేక్షకులను కూడా మెప్పించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రాజమౌళికి నచ్చకుండా ఉండే ఛాన్సే లేదు. మరి ఎందుకు అంటారా? ఎన్టీఆర్ సినిమాకు పోటీగా బాలకృష్ణ సినిమా ‘డిక్టేటర్’ రిలీజ్ అయింది కాబట్టి. ఎన్టీఆర్ సినిమాను ప్రమోట్ చేస్తే బాలయ్యకు కోపం వస్తుంది కాబట్టి. బాలయ్యతో పెట్టుకోవడం అంటే అధికారంలో ఉన్నవాళ్ళతో పెట్టుకోవడం, మీడియా బలం, బలగం ఉన్నవాళ్ళతో పెట్టుకోవడం….అదే చేస్తే ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయినప్పుడు …‘బాహుబలి సినిమాను చూడలేదా….? అయితే మీ జన్మ వేస్ట్ ……అనే రేంజ్లో ప్రమోట్ చేసిన మీడియా జక్కన్న దూరం పెట్టేస్తుంది. పొగడ్తల స్థానంలో అదే స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తుంది. అలా తన కెరీర్‌కి ఎంతో హెల్ప్ అయిన ఎన్టీఆర్ విషయంలో రాజకీయం ప్రదర్శించాడు రాజమౌళి.
ఇక చిరంజీవి 150వ సినిమాని డైరెక్ట్ చేయడం ఇష్టం లేని రాజమౌళి….డైరెక్ట్‌గా ఆ మాట చెప్పి ఉన్నా, లేకపోతే సైలెంట్‌గా ఉన్నా ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. కానీ చిరంజీవి అంటే ఉన్న భయభక్తుల వళ్ళ ఆయన సినిమాను నేను డైరెక్ట్ చేయలేనని వెరైటీ ఆన్సర్ చెప్పాడు. అదే రాజమౌళి ‘రజినీకాంత్‌ని డైరెక్ట్ చేయడం నా జీవితాశయం’ అనే రేంజ్లో తమిళ్ మీడియాతో చెప్పాడు. మరి రజినీ అంటే భయభక్తులు లేవనా? అలాగే ఇప్పుడు శాతకర్ణి కోసం క్రిష్‌కి రాసిన లేఖ కూడా మరీ డ్రమెటిక్‌గా ఉంది. రాజమౌళి, క్రిష్లిద్దరూ కూడా రాఘవేంద్రరావుకి సన్నిహితులే. ఇద్దరూ కూడా చేస్తున్న సినిమాల గురించి చర్చించుకుంటారు. శాతకర్ణి సినిమా ప్రమోషన్స్ టైంలో క్రిష్ కూడా అదే విషయం చెప్పాడు. రాజమౌళి సలహాలు, సూచనలు తనకు బాగా కలిసొచ్చాయని చెప్పాడు క్రిష్. కానీ రాజమౌళి మాత్రం…ఆ సినిమాను థియేటర్లో చూసేవరకూ తనకు ఆ సినిమా గురించి ఏమీ తెలియదని…….సగటు ప్రేక్షకుడిలాగే ఏదేదో ఊహించుకున్నానని….థియేటర్లో సినిమా చూసి స్పెల్ బౌండ్ అయ్యానని ….హాశ్ఛర్యపోతూ ప్రేక్షకులకు….సారీ క్రిష్‌కి లెటర్ రాశాడు రాజమౌళి. చిరంజీవి కూడా అధికారంలో ఉండి ఉంటే, ఆయనకు కూడా మీడియా బలం, బలగం ఉండి ఉంటే నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో సైలెంట్ అయినట్టుగానే ఇప్పుడు శాతకర్ణి విషయంలో కూడా కాస్త తగ్గి ఉండేవాడు రాజమౌళి. శాతకర్ణి సినిమాను ప్రమోట్ చేయడం తప్పు అనలేంగానీ అరవ హీరోయిజంలాగా ఉన్న అతి మాత్రం రాజమౌళి స్థాయికి తగ్గట్టుగా లేదు. అలాగే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి, పవన్ పేర్లు చెప్పుకుని, అంతకు ముందు వరకూ వినాయక్ స్థాయి డైరెక్టర్‌గా ఉండి చరణ్ కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికైనా రెడీ అయిన మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో టాప్ రేంజ్‌కి వెళ్ళిపోయిన రాజమౌళి ఇప్పుడు ఆ ఫ్యామిలీ హీరోల విషయంలో రాజకీయం చేయడం మాత్రం భావ్యం అనిపించుకోదు. రాజమౌళి గొప్ప వ్యక్తిత్వానికి ఇలాంటి మరకలు అస్సలు మంచిది కాదు.