జల్లికట్టు సాధించుకున్నారు… అదే రీతిలో ప్రత్యేక హోదా సాధించుకోలేమా… ఎక్కడ చూసినా ఇదే మాట! ప్రతిపక్ష పార్టీలదీ ఇదే పాట. జల్లికట్టు స్థాయి ఉద్యమం ఆంధ్రాలో కూడా వచ్చేస్తుందని కొందరు! అబ్బే.. ఇదంతా ముణ్నాళ్ల హంగామా అని ఇంకొందరు. ఎవరికి విశ్లేషణలు వారివి. ఎవరి లెక్కలు వారివి! ఈ రంగుల కళ్లజోళ్లను తీసేసి… పార్టీల దృక్కోణాల దృష్టిని పక్కన పెట్టి… కాసేపు వాస్తవాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ, తమిళులు సాగిస్తున్న జల్లికట్టు ఉద్యమానికీ… ఆంధ్రులు ఆరంభించబోతున్న లేదా ప్రారంభించామనుకున్న ప్రత్యేక హోదా సాధనకీ సాపత్యం కుదురుతుందా అనే ప్రశ్నతో మొదలుపెడదాం!
మొదటి తేడా… తమిళనాడులో జల్లికట్టు అనేది ఒక సంప్రదాయ క్రీడ. ఎన్నో తరాలుగా వస్తున్న ఓ ఆనవాయితీ. కాబట్టి, ప్రజలకు దాంతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉంటుంది. పైగా, ఇది సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశం కాబట్టి… ప్రజల భావోద్వేగాలను ఉవ్వెత్తున ఎగసిపడేలా చేయగలదు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో ప్రజలకు అంత ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉందా..? ఉంటే, ఈపాటికే ఉద్యమం రావాలి కదా..? ఇక్కడే అసలైన తేడా ఉంది. నిజానికి, ప్రత్యేక హోదా విషయంలో మనకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ప్రజల్లో కచ్చితంగా ఉంది. కానీ, అది జల్లికట్టు మాదిరిగా ఒకేసారి పెల్లుబికి బయటపడేది కాదు. ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకుని, దాన్ని ఛానలైజ్ చేసే నాయకుడి అవసరం ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంది. సో… జల్లికట్టుతో పోల్చి చూడలేం.
రెండో తేడా… ప్రజల్లో ఐకమత్యం! జల్లికట్టు అనగానే తమిళ ప్రజలు కుల మత ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా స్పందించారు. అందరూ ఒకటైపోయారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రులందరూ ఇలాంటి గోడల్ని బద్దలుకొట్టి ఒక్కటవ్వగలరా అనేది పేద్ద ప్రశ్న! దేశంలో ఎక్కడా లేని విధంగా కులాల పేరుతో ప్రజలను విడిదీసిన నాయకులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రా మాత్రమే..! తెల్లారి లేచింది మొదలు కులగజ్జిని నూరిపోసి నరాల్లోకి ఎక్కించేందుకు సందుకో నాయకుడు ఉన్నాడు. ప్రతీ అంశంలోనూ కులగజ్జి కుళ్లు కంపు కొడుతోంది. తప్పు ప్రజలది కాదు… యథారాజ తథా ప్రజ! సో… జల్లికట్టుతో పోల్చి చూడలేం.
మూడో తేడా… జల్లికట్టుపై తమిళ యువత తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో విస్తృత చర్చ చేపట్టింది. ఉద్యమించాలీ అనుకోగానే చెన్నైలోని మెరీనా బీచ్‌కి యువతరం తరలి వచ్చింది. కానీ… ప్రత్యేక హోదా విషయంలో యువత ఆ తీరుగా స్పందించే అవకాశం ఉందా..? నిజం చెప్పాలంటే… చాలామందికి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. పైగా, తమిళనాట జరిగింది ఒక క్రీడకు సంబంధించిన పోరాటం కాబట్టి.. యూత్ ఈజీగా కనెక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా అలాంటి ఆట కాదే..! మరి, యూత్ ఎట్రాక్టింగ్ పాయింట్ ఇందులో ఎక్కడుందీ! యువతను ఆ స్థాయిలో ప్రభావితం చేసే అంశం ఏదీ..? పవన్ కల్యాణ్ వస్తే యూత్ వస్తారు. కానీ, వారంతా ప్రత్యేక హోదా కోసం వచ్చారని ఎలా చెప్పగలం..? సో.. జల్లికట్టుతో పోల్చి చూడలేం!
నాలుగో తేడా… జల్లికట్టు లొల్లి అనగానే తమిళ సినీ పరిశ్రమ అంతా ఒకతాటిపైకి వచ్చేసింది. ప్రముఖ హీరోలు నల్లచొక్కాలేసుకుని నిరసన ప్రదర్శనలకు వచ్చేశారు. ప్రజలతో కలిసి గొంతు కలిపారు. తెలుగు హీరోలకు అంత సీన్ ఉందా..? పైగా, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రాకి సంబంధించిన అంశం కాబట్టి.. దాని గురించి స్పందిస్తే తెలంగాణ మార్కెట్ ఎక్కడ పోతుందో అనే లెక్కలేసుకునే వ్యాపారులే బోలెడుమంది! పోనీ.. ప్రజల సమస్యలపై తీవ్రంగా స్పందించే తెలుగు తారల్ని ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చూశామా..? అభిమానుల్లో కలెక్షన్లను చూసుకునేవారికి, ప్రజల్లో సమస్యలు తెలుస్తాయా? సో… జల్లికట్టుతో పోల్చి చూడలేం!
జల్లికట్టు ఒక ఆట.. ప్రత్యేక హోదా ఒక హక్కు! జల్లికట్టు సంస్కృతి.. ప్రత్యేక హోదా రాజకీయం! ఇన్ని రకాలుగా తేడాలున్నాయి. ఎలా చూసుకున్నా జల్లికట్టుతో ప్రత్యేక హోదాని పోల్చలేం. పోనీ, పోరాట స్ఫూర్తినే తీసుకుందాం అనుకున్నా… ఇన్ని స్పీడు బ్రేకర్లు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని ఉద్యమం ముందుకు సాగే పరిస్థితి ఏపీలో ఉంటే మంచిదే.