పదిహేనేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు….అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీల్లానే హోదాను కూడా గోదాట్లో పడేశాడు. ఓటుకు నోటు కేసు మహత్యం అని ఎన్నో విమర్శలు వచ్చినా బాబు తీరు ఏమీ మారలేదు. ప్రత్యేక హోదా ఇవ్వం అని పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం చెప్పేసింది. ప్రత్యేక హోదా తెస్తాం, ఇస్తాం అన్న చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ఈ ఇద్దరు సీనియర్ నాయకులపైన ఉంది. ఎందుకంటే హోదా పేరు చెప్పి ఓట్లు దండుకుని పదవులు అనుభవిస్తున్నది వాళ్ళిద్దరే కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటానికి బాబు, వెంకయ్యలతో పాటు టిడిపి అనుకూల మీడియానే అడ్డుపడుతూ ఉన్నది.
జల్లికట్టు-ప్రత్యేక హోదాకు మధ్య సంబంధం ఏమీ లేదు. జల్లికట్టుతో పోల్చితే హోదా ప్రాధాన్యం చాలా ఎక్కువ. కానీ జల్లికట్టు కోసం తమిళులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పేముంది? ఆ స్ఫూర్తితో మేం కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటే చంద్రబాబుకు వచ్చిన నొప్పేంటి? విశ్వనగరం విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని బాబు చెప్పే మాటలు మరీ కామెడీగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ హైద్రాబాద్ పైన పడిందా? జల్లికట్టు ఉద్యమం ప్రభావం చెన్నై పైన పడుతుందా? అయినా ఉద్యమాలు చోటు చేసుకోని దేశం, నగరం, ప్రాంతం ఏదైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన మాట వాస్తవం. అన్యాయం జరిగినా కూడా స్పందించొద్దు, ఛస్తూ బ్రతకండి అని చెప్పడమేంటి? అలా చెప్తున్న చంద్రబాబుది నిరంకుశ మనస్తత్వం అనిపించుకోదా?
ఇక పొద్దున్నలేచిన దగ్గర నుంచి కాంగ్రెస్ నాయకులను, విభజన తీరును తిడుతూ ఉండడం బాబుకు బాగా అలవాటైంది. కాంగ్రెస్ నాయకులు ఘోరమైన తప్పులు చేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళను ఘోరంగా ఓడించి శిక్షించారు. విభజన పాపంలో బాబుకు కూడా వాటా ఉన్నప్పటికీ ప్రజలకు ఆ విషయం తెలియకుండా తన అనుకూల మీడియాతో మేనేజ్ చేయడం, అలాగే అత్యంత అనుభవజ్ఙుడైన పాలకుడు కొత్త రాష్ట్రానికి అవసరం అని బాబును గెలిపించారు ప్రజలు. మోడీతో కలిసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడన్న ఆశతో గెలిపించారు. కానీ బాబు మాత్రం కాంగ్రెస్ వాళ్ళకంటే దారుణంగా వంచిస్తున్నాడు. హోదా తీసుకురాకపోగా ఆ హోదా కోసం పోరాడుతున్న వాళ్ళను విమర్శిస్తున్నాడు. ఉద్యమాన్ని ఆదిలోనే చంపేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
సర్పంచ్‌గా కూడా గెలవని ఓ నాయకుడు హోదాకు, జల్లికట్టుకు ముడిపెడుతున్నాడని తాజాగా బాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలు డైరెక్ట్‌గా పవన్‌కి తగులుతున్నాయి. జల్లికట్టు స్ఫూర్తితో హోదా కోసం పోరాడదాం అని చెప్పింది పవనే. తన గెలుపులో భాగమైన పవన్‌ని కూడా బాబు టార్గెట్ చేస్తున్నాడా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలెవ్వరూ కూడా ప్రత్యేక హోదా అడగకుండా నేను చూస్కుంటానని చంద్రబాబు ఏమైనా కేంద్రానికి మాట ఇచ్చాడా? ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే బాబుకు వచ్చిన నొప్పేంటి?