కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చుట్టూ మరోసారి సర్కారు ఉచ్చుబిగిస్తోంది! గతంలో మాదిరిగానే ఈసారీ ఆయన్ని ఇంటి నుంచి కదలనీయకుండా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం నుంచి సత్యాగ్రహ పాదయాత్రను చేపట్టేందుకు ముద్రగడ సిద్ధమౌతున్నట్టు ప్రకటించారు. దీంతో ఏపీ సర్కారు రకరకాల ఆంక్షల్ని హుటాహుటిన అమల్లోకి తెస్తుండటం విశేషం!
నిజానికి, ఈ సత్యగాహ్ర పాదయాత్రను గడచిన ఏడాది నవంబర్లోనే ముద్రగడ తలపెట్టారు. కానీ, ఆ యాత్రకు పోలీసులు అనుమతులు లేవనీ, భద్రతాపరమైన కారణాలను చూపిస్తూ ముద్రగడను గృహనిర్బంధం చేశారు. స్వగ్రామం కిర్లంపూడిలోనే పోలీసులు చుట్టుముట్టారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది! అయితే, ఈసారి ముద్రగడ యాత్రకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.
రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర సాగించాలని ముద్రగడ అనుకుంటున్నారు. ఈ యాత్రకు అనుమతి లేదని ఇప్పుడూ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, ముద్రగడ యాత్రకు సంబంధించిన వార్తల్ని ప్రత్యక్ష ప్రసారం చెయ్యొద్దంటూ మీడియాకు కూడా ఆదేశాలు జారీ చేశారట! అక్కడితో ఆగినా బాగుండేది.. సోషల్ మీడియాలో కూడా ముద్రగడ దీక్షపై ఎక్కడా ఎలాంటి అంశాలూ వైరల్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు! కోనసీమ కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాల్ని ఆపేయాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే కిర్లంపూడి చుట్టూ భారీగా పోలీసులు చేరుకున్నారనీ, యాత్ర ప్రారంభం కంటే ముందుగానే ఆయన్ని అరెస్ట్ చెయ్యొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ముద్రగడకు మద్దతుగా కొంతమంది అభిమానులు కూడా కిర్లంపూడి చేరుకుని సంఘీభావం తెలుపుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా, ముద్రగడ యాత్రను ప్రారంభానికి ముందే అడ్డుకోవాలని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది సర్కారు! జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారట! ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముద్రగడ యాత్ర ఈసారైనా ముందుకు సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.