యజ్ఞానికి ఏంటి యత్నమయ్యా అంటే… కట్టెలు కొట్టుకొస్తే చాలు కదా అన్నాడట! ఆ యజ్ఞమేంటో… ఆ కట్టెలు తెచ్చిందెవరో తరువాత తెలుసుకుందాం. ముందుగా… పవన్ కల్యాణ్ తాజా ట్వీట్స్ గురించి మాట్లాడుకుందాం. “దేశ్ బచావో” అంటూ పవన్ కల్యాణ్ తాజాగా కొన్ని పాటల్ని యూట్యూబ్లో విడుదల చేశారు. గతంలో పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని పాటలకి డీజే మిక్స్ చేసి ఇలా వదిలారు. “జానీ” చిత్రంలోని “నారాజుగాకుర మా అన్నయ్య.. నజీరు అన్నయ్య” అంటూ ఓ పాట ఉంది కదా..
దానికే డీజే దరువులు జోడించారు. గోద్రా దమనకాండ సందర్భంలో తాను చాలా ఫీల్ అయ్యాననీ, అప్పటి రాజకీయ పరిస్థితులపై తన ఆవేదన ఆ పాటలో ప్రతిబింబించేలా రాయించానని పవన్ అన్నారు. తెలంగాణ విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్బంలో పార్లమెంటులో పలువురు నాయకులు మాట్లాడిన ఆడియో క్లిప్స్ కొన్ని ఈ పాటకి అతికించారు. బీజీఎమ్స్ లో పవన్ కల్యాణ్ ఉద్వేగభరిత పదోచ్చారణలు చిలకరించారు. ఒకటో సాంగ్ ఇదే.
ఇక, రెండో సాంగ్…
ట్రావెలింగ్ సోల్జర్! తమ్ముడు సినిమాలోని ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్’ పాట ఉంది కదా! దానికి భాంగ్రా మిక్స్ ఇచ్చారు. మధ్యమధ్యలో పవన్ ఉద్వేగపూరిత అరుపులు! ప్రత్యేక హోదాను ఉద్దేశించి ‘లడ్డూ’ అంటూ కొన్ని చోట్ల అన్నారు.
మూడోదేమో…
ఏ మేరా జహా! ఖుషీ చిత్రంలోనిది. దీన్లో కూడా అవే అరుపులూ కేకలూ! ఓ మూడు మెతుకులు చాలు… అన్నం ఎలా ఉడికిందో చెప్పడానికి! ఈ విధంగా దేశ్ బచావో ఆల్బమ్ నుంచి పాటలు వినిపించారు.
రైట్.. ఇప్పుడు యజ్ఙం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రాలో మరోసారి ప్రత్యేక హోదా కాకరేగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు జల్లికట్టు ఉద్యమ నేపథ్యంలో ఈ హీట్ పెంచింది కూడా జనసేన అధినేతే! ఈ తరుణంలో దేశ్ బచావో అంటూ పాటలు విడుదల చేస్తా అని నిన్న పవన్ ట్వీట్ చేస్తే… జనాల్ని ఊపేసే రేంజిలో ఉంటాయని అందరూ ఆశించారు. ఆలోపించజేసే సాహిత్యం ఉంటుందని అనుకున్నారు. ఆంధ్రుల ఆక్రందన ప్రతిధ్వనిస్తుందనీ, కేంద్రం చేసిన మోసం పొలికేక పెడుతుందనీ, ఉత్తరాది అహంకారంపై ఉరుముతుందనీ, దక్షిణాది దయనీయత అర్థమౌతుందనీ… ఇలా చాలాచాలా అనుకున్నారు. కానీ, పాత సినిమా పాటల్ని తీసుకుని, పబ్బుల్లో ఊగేందుకు అనువుగా రీమిక్స్ చేసి, పవన్ కల్యాణ్ కేకలూ అరుపులూ జోడించిన చౌకబారు ఆల్బం విడుదల చేస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. దేశాన్ని బచాయించే పాటలా ఇవీ..?
మాటకంటే పాటకి పదును ఎక్కువ. ఆ సంగతి పవన్ కల్యాణ్ కి తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం పోషించిన పాత్ర పవన్ కు తెలుసు. జనం బాధల్లోంచి పుట్టే జానపదాలు… ప్రజల ఆవేదనకు అద్దం పట్టే అక్షరాలకు ఉన్న సత్తా ఏంటో పవన్ కి పరిచయం లేని కాన్సెప్ట్ కాదు కదా! ఇవన్నీ తెలిసిన పవన్ కల్యాణ్… ఓ మూడు పాటలు రాయించుకోలేరా..? పవన్ కోరితే రాయని రైటర్లు ఉంటారా..? ఎక్కడో గోద్రాలో ఊచకోత జరిగితే, దానికే స్పందించి పాట రాయించుకున్న పవన్… ఇప్పుడు ఆంధ్రాలో సమస్యలపై కొత్త పాటలు రాయించుకోవాలని ఎందుకు అనిపించలేదో..!
ఈ పాటల్లో సామాన్యుడి గళమేదీ..? ఆంధ్రుడి ఆవేదన ఎక్కడ..? అవకాశవాద, వేర్పాటువాద, నేర రాజకీయాలకు నిలదీత ఎక్కడుందీ..? ఒక సినిమా హీరోగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన రీమిక్స్ లు నచ్చొచ్చు. పదేపదే ప్లే చేసుకోవచ్చు. కానీ, జనసేన అధినేతగా ఒక ఉద్యమనేతగా పవన్ ను ప్రతిపక్షేపించుకుని ఎదురుచూస్తున్న సగటు తెలుగువాడికి ఈ పాటలు రుచించవు అనడంలో ఎలాంటి సందేహం లేదు! మహాయజ్ఞానికి కట్టెలు తెస్తే చాలు అని ఎవరు అనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాలా..?