2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు ఓ మాట చెప్పాడు. సైమైక్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చేసిన నాకు ఇప్పుడు చిన్న రాష్ట్రమైన కొత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడం వళ్ళ ఒరిగేది ఏం ఉంటుంది? నా స్థాయికి తగ్గది కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడదామన్న ఉద్ధేశ్యంతోనే పదవిని అధిష్టిస్తున్నాను అన్న అర్థంలో మాట్లాడేశాడు. చిన్న రాష్ట్రం, రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో బాబు అంత సంతృప్తిగా లేడు అన్నది వాస్తవం. ఈ రెండున్నరేళ్ళ కాలంలో బాబు మాటలు, చేతలను చూస్తున్న ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది.
దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత బాబు మాట్లాడిన మాటలు కూడా అలానే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నింటి నుంచి భారతదేశానికి పెట్టుబడులు వచ్చేలాగా చేస్తున్నానన్న స్థాయి డప్పు కొట్టుకున్నాడు చంద్రబాబు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబే…బాబు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కి అస్థిత్వమే లేదు అనే స్థాయిలో మాట్లాడేశాడు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమం చేయడానికి రెడీ అవుతుంటే ఆ విషయం గురించి ఆలోచించే తీరిక చంద్రబాబుకు లేదు కానీ భారతదేశంలో క్యాష్‌లెస్ లావాదేవీలను ఎలా పెంచాలన్న విషయంపై మాత్రం తెగ కష్టపడిపోయాడట బాబుగోరు. బాబు చాలా ఫాస్ట్ అని ఢిల్లీలో అభినందనలు కూడా అందుకున్నారని ఆయన పాంప్లెట్ పత్రిక ఒకటి ఘనంగా వార్తలు కూడా రాసేసింది. మోడీ-బాబుది ప్రత్యేక బంధం, జాతీయ స్థాయిలో బాబుకు మంచి పరిచయాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరుంది అని చెప్పి ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. శ్రీలంకలో కూడా దేశ ప్రధాని కంటే ఎక్కువ స్థాయి గౌరవాన్ని పొందారని ఆయన మీడియానే చెప్పుకొచ్చింది. మరి అలాంటి బాబుగోరు రెండున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌కి చేసిందేంటి? ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ మేలు అన్నాడు. మరి ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కోసం నెలల కాలం నుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రైల్వే జోన్ లేదు. జాతీయ ప్రాజెక్టుగా యూపిఎ ప్రకటించిన పోలవరానికి రెండున్నరేళ్ళ తర్వాత ఓ రెండు వేల కోట్ల రూపాయల అప్పు మాత్రం తీసుకొచ్చాడు. రెండున్నరేళ్ళ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16వేల కోట్ల రూపాయల లోటుతో ఉందని బాబు భజన పత్రిక ఆంధ్రజ్యోతినే వార్తలు రాసింది. కానీ బాబు మాత్రం లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. కనీసం వేల కోట్ల ప్రాజెక్టులు కూడా రాలేదన్న మాట వాస్తవం. రాష్ట్ర విభజన జరిగిన రోజే ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు కావాలని చెప్పాడు చంద్రబాబు. మరి ఈ రెండున్నరేళ్ళలో అందులో సగమన్నా తెచ్చాడా? కనీసం ఓ పదివేల కోట్లు అయినా తేగలిగాడా?
ఫైనల్‌గా అర్థమవుతున్న విషయం ఒక్కటే. ఇఫ్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితికి అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలి. ప్రపంచానికి పాఠాలు చెప్పేవాళ్ళో, భారతదేశ ప్రధాని కంటే ఎక్కువగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడేవాళ్ళో అవసరం లేదు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు చంద్రబాబు మొహం చూస్తున్నారని వస్తున్నారని ఆయన ప్రచారం చేసుకోవచ్చు కానీ ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో ప్రయోజనాలు మాత్రం బాబు వళ్ళే రాకుండా పోతున్నాయన్న ఆవేదన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనిపిస్తోంది. ముందు కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబడితే…….ప్రపంచ దేశాల నుంచి కూడా పెట్టుబడులు తెచ్చే సత్తా బాబుకు ఉందని అప్పుడు నమ్మొచ్చు. లేకపోతే ఉట్టికి ఎగరలేనమ్మ….ఇంకేదో చేస్తానందన్న సామెత గుర్తొచ్చి నవ్వుకునేలా ఉంటుంది వ్యవహారం. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలన్న బాబు తాపత్రయం, దేశ రాజకీయాల్లో ఏదో చేయాలన్న బాబు ఆశ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉంటే మాత్రం ….చివరికి ఉన్నది పాయే…..ఉంచుకున్నదీ పాయే అనుకునేలా బాబు పరిస్థితి తయారవుతుందనడంలో సందేహం లేదు.