వైజాగ్… ఇప్పుడు అందరి చూపూ తనవైపు తిప్పుకుంది! అందాల ఆర్కే బీచ్ ఉద్యమానికి వేదికైంది. ప్రత్యేకహోదా సాధన కోసం శాంతియుత నిరసన తెలిపేందుకు యువత కదలి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చానని పవన్ చెబుతూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసి ఉద్యమించగలని జగన్ కూడా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతే లేదని చంద్రబాబు సర్కారు భీష్మించింది! పవన్ కల్యాణ్… చంద్రబాబు నాయుడు… వైయస్ జగన్… ఈ ముగ్గురిలో రాజకీయంగా ఎవరికి ఈ ఉద్యమం పరీక్ష పెడుతోందన్న చర్చ ఇప్పుడు మొదలైంది! విశాఖ నిరసన తదనంత పరిణామాలు ఎలా ఉన్నాసరే… ఎవరిపై ప్రభావం చూపబోతున్నాయనేదే హాట్ టాపిక్.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను విశాఖ బీచ్‌కు వస్తానని, శాంతియుత నిరసనలో పాల్గొంటానని జగన్ ప్రకటించడంతో వ్యవహారంలో అసలు ట్విస్ట్ పడిందని చెప్పాలి! ఎందుకంటే, గడచిన నాలుగైదు రోజులుగా విశాఖ తీరంలో జరగబోతున్న కార్యక్రమం అంతా పవన్ కల్యాణ్ కేంద్రంగా ఉన్నట్టుగా వ్యవహారం నడించింది. వరుస ట్వీట్లు చేస్తూ, నాలుగు పాటలు కూడా విడుదల చేసి తాను వెనక్కి తగ్గేది లేదని పవన్ దూకుడు మీదున్నారు. ప్రత్యక్షంగా పవన్ ఈ ఉద్యమంలోకి రాకపోవచ్చనే విధంగా ఈ తతంగమంతా సాగింది. నిజానికి, రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు రంగంలోకి దించుతారన్న ఓ విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఓ పక్క కాపుల ఉద్యమానికి ముద్రగడ సంసిద్ధమౌతున్న వేళ… ఇంకోపక్క జగన్ కూడా ప్రత్యేక పోరుపై స్వరం పెంచుతున్న వేళ… పవన్ యాక్టివేట్ కావడం, యాక్టివ్ పార్ట్ తీసుకోవడం కూడా బాబు మార్కు వ్యూహమే కావొచ్చన్న అభిప్రాయాలూ కొన్ని వినిపించాయి. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు అటు ముద్రగడ ఉద్యమం, ఇటు జగన్ వ్యూహం… రెండింటిపైనా ఒకే అస్త్రం సంధించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారేమో అనే విశ్లేషణలు కూడా వినిపించాయి.
అయితే, గతంలో మాదిరిగానే పవన్ కల్యాణ్ కొంత హడావుడి సృష్టించి, సైలెంట్ అవలేని పరిస్థితిని ఓరకంగా జగన్ క్రియేట్ చేశారు అనాలి. దీంతో చంద్రబాబు ‘రెండు పిట్టల’ వ్యూహానికి జగన్ చెక్ పెట్టారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. నిరసనకు మద్దతు ప్రకటించిన జగన్… తానే స్వయంగా విశాఖకు వస్తున్నానని ప్రకటించడంతో పవన్ కల్యాణ్ మరింత బలంగా ఇప్పుడు నిలబడాల్సిన అవసరం కనిపిస్తోంది! ఓరకంగా ఇది జనసేనకు పరీక్షే. పవన్ కల్యాణ్ కూడా విశాఖ బీచ్‌కు ప్రత్యేక విమానంలో తరలి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ రాకపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కానీ, ఇప్పుడు పవన్ ఏం చెయ్యబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది.
నిన్నమొన్నటి ఈ విషయంపై కాస్త సేఫ్ సైడ్ ఉన్నట్టుగా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు పూర్తి గందరగోళానికి గురౌతోంది. ఎందుకంటే, పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే నిషేధాజ్ఞలూ సెక్షన్లూ అంటూ అడ్డుకునే పరిస్థితి ఉంటుందా..? పైగా, ఒకవేళ అలాంటి చర్యలకు దిగితే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవడం ఖాయం. కాబట్టి, కిం కర్తవ్యం వచ్చిన యువతకు రక్షణ కల్పించడమే.
అయితే, ఈ విశాఖ ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు వైజాగ్ వెళ్తామంటున్న జగన్ ను ముందుగా అరెస్ట్ చేస్తారేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అలా అయితే, పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తుంది. ఒకవేళ అదే జరిగితే… చంద్రబాబు మార్క్ పవన్ వ్యూహంపై వినిపిస్తున్న కథనాలే నిజమని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మాల్సిన పరిస్థితిని వారే క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో… ప్రత్యేక హోదాపై తరువాత మూవ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.