నిన్నా మొన్నటి వరకూ సినిమాల విషయంలో నిర్లిప్తంగా ఉన్న రవితేజ… ఇప్పుడు సడన్‌గా గేరు మార్చి జోరు పెంచాడు. నిన్ననే టచ్ చేసి చూడు.. అంటూ ఓ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. 24 గంటలు తిరక్క ముందే… మరో కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అదే… రాజా ది గ్రేట్! అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహరీన్ కథానాయికగా నటించనుంది. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రాజా ది గ్రేట్ లోగోనీ విడుదల చేశారు.
”గతంలో నేను, రవితేజ కలిసి చేసిన భద్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందిరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మా కాంబినేషన్లో `రాజా ది గ్రేట్` సినిమా తెరకెక్కనుంది. తొలి చిత్రం పటాస్‌తో సూపర్‌హిట్ సాధించి, మా బ్యానర్లో సుప్రీమ్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాన్ని అందించిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. హీరోలను సరికొత్తగా ప్రెజెంట్ చేసే అనిల్ ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజను కొత్తగా చూపించబోతున్నాడు. లోగో పోస్టర్‌ను రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉండటమే కాదు మా బ్యానర్లో మరో సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తాం” అన్నారు దిల్ రాజు. మరి ముందుగా టచ్ చేసి చూడు సెట్స్‌కి వెళ్తుందో, లేదంటే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.