సినిమా వసూళ్ళ విషయంలో టాలీవుడ్ లో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి కనబడుతోంది. అసలు ఏ రికార్డును నమ్మాలి? ఎవరు చెప్పిన కలెక్షన్స్ పరిశీలలో తీసుకోవాలో అర్ధం కావడం లేదు. ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్, సెకెండ్ కలెక్షన్స్ రికార్డ్.. అంటూ ఏదో ఒక ఫిగర్ బయటికి వస్తుంది. అసలు అది ఎంత వరకు వాస్తవమో నిర్ధారించుకోకుండానే మిగతా వారు కూడా అ కలెక్షన్స్ ను పట్టుకొని వార్తలు రాసేయడం, స్టోరీలు ఇచ్చేయడం కనబడుతుంది. అసలు సినిమా బిజినెస్ పై కనీసం అవగహన లేనివారు కూడా ఇదిగో కలెక్షన్ రిపోర్టు అంటూ ఇచ్చేస్తున్నారు. మరి, ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది అనే దానికికి మాత్రం సమాధానం లేదు. కొందరు పీఆర్వోల ట్విట్టర్ లో కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తుంటారు. అది వారి సినిమా ప్రమోషన్స్ కోసం. వాటిని కూడా పరిగణలోకి తీసుకునే ఇదిగో కలెక్షన్ రికార్డ్ అంటూ బాజా మోగించడం కనబడుతుంది. అసలు ఈ రికార్డులు జనాలు ఎవరైనా నమ్ముతున్నారా ? లేదా అభిమానుల వరకే పరిమితం అవుతున్నాయా ? అనే విషయం కూడా పట్టించుకోకుండా మా సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అంటే మా సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అని ప్రచారం చేసుకోవడం కనిపిస్తుంది.
ఏ రికార్డు కూడా శాస్వతం కాదు. ఈ విషయం వారికీ తెలుసు. అయితే మేమే రికార్డు బద్దలు కొట్టామని ఎందుకు చెప్పుకుంటున్నారో అర్ధంకాదు. దీని వల్ల ఉపయోగం ఏమిటో తెలీదు. కొన్ని సందర్భంల్లో ఇలా భారీ లెక్కలు చెబుతున్న సినిమాల థియేటర్ లోకి అడుగుపెడితే అక్కడ అంతా ఖాళీగా కనిపిస్తుంది. ఆ పరిస్థితి చూస్తే ‘థియేటర్ ఖాళీ రికార్డులు భారీ’ అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అసలు ఏ సినిమాకి ఎంత వచ్చింది,? ఆ వివరాలు ఎవరు ఇవ్వాలి అనే దానిపై టాలీవుడ్ లో ఓ ట్రేడ్ మార్కెట్ లేదనే చెప్పాలి. బాలీవుడ్ లో అయితే ట్రేడ్ పండిట్ తరుణ్ ఆదర్శ లాంటి వారు వున్నారు. ఆ లెక్కలు కాస్త నమ్మబుల్ గా వుంటాయి. అయితే ఆయన కేవలం యుఎస్ లెక్కలే ఇస్తాడు. ఆయన లెక్కలు తీసుకొని కూడా కొందరు స్టోరీలు రాస్తుంటారు.
అయితే ఇక్కడ తరున్ ఆదర్శ్ లా ఎవర్ని నమ్మడానికి లేకుండాపోయింది. తరున్ ఆదర్శ్ లెక్కలు సమతూకంగా వుంటాయి. కాని ఇక్కడ అలాంటి ట్రేడ్ పండిట్ లు కానీ వ్యవస్థలు కాని లేవు. దీంతో ఎవర్ని నమ్మాలో అర్ధం కాదు. ఎవరైనా ఒక్కరు ఎదో ఒక న్యూస్ ను స్ప్రెడ్ చేస్తే దాన్ని పట్టుకుని నచ్చినట్లు గా వండుకుంటున్నారు. దీంతో నిజంగా రికార్డ్ అనుకున్నది కూడా కనుమరుగైపోతుంది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఇపుడు మల్టీ ప్లేక్స్ లు పెరుగుతున్నాయి. దీంతో పాటు అన్ని థియేటర్ లో టికెట్టు బుకింగ్ వ్యవస్థ అంతా ఆన్ లైన్ లో జరిగితే, ఏ థియేటర్ లో ఎంత మంది జనం సినిమా చూస్తున్నారు అనే సంగతి నిజంగా తెలిస్తే, అప్పుడు నిజమైన రికార్డులు బయటికి వస్తాయి. అప్పటివరకూ ఇలా చెబుతున్న రికార్డులన్నీ ఫేక్ అనే అనుకోవాలి.