ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారుతున్న క్రమం చూస్తుంటే… తెలంగాణ ఉద్యమంలోని ఒక కీలక ఘట్టం గుర్తొస్తోంది. అక్కడ జరిగిందే… మళ్లీ ఇక్కడా జరుగుతోందన్న భావన కలుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓయూ క్యాంపస్ ఘటన కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే! తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ పై శాంతియుతంగా ఉద్యమించేందుకు నాడు విద్యాలోకం ఏకమైంది. సరిగ్గా ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు దిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ ఆస్కారం లేకుండా చేయాలన్న నెపంతో విద్యార్థి గళాన్ని నొక్కే ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇదే జరుగుతోంది.
ప్రత్యేక హోదాపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విద్యార్థులు విశాఖ చేరుకుంటున్నారు. అయితే, వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖవైపు తరలి వస్తున్న విద్యార్థులను నేటి ఉదయం నుంచే అదుపులోకి తీసుకోవడం మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా ఉండేందుకే ఈ ముందస్తు జాగ్రత్త చర్యలని పోలీసులు అంటున్నారు. విశాఖలో పలు ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలూ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులు చేస్తున్నవారికి విడిచిపెట్టాలంటూ యువత దూసుకు వస్తుండటంతో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ బీచ్ వైపు ఎవ్వరూ వెళ్లేందుకు అవకాశం లేకుండా అన్ని దారుల్నీ పోలీసుల కంట్రోల్లోకి తీసుకున్నారు.
తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైతేనే అధికార పార్టీలేవీ సహించలేవు! ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తాయి. నాడు ఓయూలో జరిగింది అదే… నేడు విశాఖలో జరుగుతున్నదీ అదే. అయితే… ఈ క్రమంలో ‘అణచివేతకు గురౌతున్నాం’ అనే భావన ప్రజలకు కలగకూడదు. ఎప్పుడైతే, పాలకుల తమ గొంతును నొక్కేస్తున్నారని ప్రజలు భావించారో… ముఖ్యంగా యువత భావించారో అక్కడి నుంచే ఏ ఉద్యమమైనా కొత్త మలుపు తీసుకుంటుంది. ఓయూ ఘటన తరువాత జరిగింది అదే! అక్కడి నుంచీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆంధ్రా యువత చేపడుతున్న ప్రత్యేక హోదా ఉద్యమం కూడా ఇలానే కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొసమెరుపు:: పోన్లెండి… ఈ రకంగానైనా ప్రత్యేక హోదాకు చంద్రబాబు నాయుడు మేలు చేస్తున్నట్టే..! ఎందుకంటే, విశాఖ నిరసన కార్యక్రమ నేపథ్యంలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టడం, యువతను అణగదొక్కాలని చూడటంతో… ఆ యువతలోని ఐక్యతను మరింతగా పెంచినవారవుతారు!!