Luckunnodu Movie Review, Machu Vishnu Luckunnodu Telugu Review
తెలుగు 360 రేటింగ్: 2/5
ఆడియన్స్‌కి టచ్‌లో ఉండాలంటే.. ఏదో ఓ సినిమా వదలాల్సిందే. అలాగని కేవలం టచ్‌లో ఉండడానికే సినిమాలు చేస్తానంటే కుదర్దిక్కడ. జమానా మారిపోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా.. సినిమాలో విషయం ఉండాల్సిందే. లేదంటే ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు కుర్ర హీరోలు, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నవాళ్లు, తమపై ఎలాంటి ఇమేజూ… లేనివాళ్లు – ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు లక్ ఏంటంటే…. తనే ఓ నిర్మాత. ఏకంగా 50 సినిమాలు తీసిన నిర్మాత (మోహన్ బాబు) ఇంటి నుంచి వచ్చాడు. తన చుట్టూ ఓ సర్కిల్ కూడా ఉంది. అందుకే సినిమాలకు ఢోకా లేదు. కాకపోతే.. ఓ సరైన కథ పడాలంతే. గతేడాది ‘ఈడోరకం ఆడోరకం’తో గట్టెక్కేశాడు విష్ణు. ఆ సినిమా విజయానికి విష్ణు కెపాసిటీ కంటే… రాజ్ తరుణ్ ఫామ్ నే ఎక్కువ ప్లస్ అయ్యింది. ఈసారి లక్కున్నోడుతో సోలోగా వచ్చాడు. మరి…. విష్ణుకి లక్ కలిసొచ్చిందా? తాను నమ్ముకొన్న ఎంటర్ టైన్మెంట్ జోనర్ తనకు హిట్ ఇచ్చిందా??
* కథ
లక్కీ (విష్ణు) దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్. ఉయ్యాలలో పడ్డాడో లేడో.. నాన్న ఫ్యాక్టరీ మంటల్లో బూడిద అవుతుంది. స్కూల్లోకి వెళ్లాక… పాతిక లక్షలు దాచుకొన్న బ్యాంకు వాడు బోర్డు తిప్పేస్తాడు. అప్పటి నుంచీ… లక్కీని చూసి తండ్రి భయపడిపోతాడు. కనీసం తన బిడ్డని పేరు పెట్టి కూడా పిలవడు. ఎలాగైనా సరే.. నాన్నతో పేరు పెట్టి పిలిపించుకోవాలన్నది లక్కీ జీవితాశయం. ఈలోగా పాజిటీవ్ పద్మ (హన్సిక)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ముందు లక్కీ అంటే ఇష్టం లేకపోయినా.. కాస్త ‘పాజిటీవ్’గా ఆలోచించి… తాను కూడా ప్రేమించడం మొదలెడుతుంది. అంతా హ్యాపీ అనుకొంటున్న తరుణంలో చెల్లాయి పెళ్లికని దాచిన పాతిక లక్షలు లక్కీ పోగొట్టేస్తాడు. దాంతో ‘నీలాంటి బిడ్డ ఉన్నా ఒక్కటే పోయినా ఒక్కటే’ అంటూ తండ్రి అసహ్యించుకొంటాడు. ఈ అవమానం తట్టుకోలేక లక్కీ ఆత్మహత్య చేసుకొందామనుకొంటే.. సరిగ్గా అదే రోజు రాత్రి తన జీవితం మలుపు తిరుగుతుంది. పాతిక కోట్లున్న బ్యాగ్ తన చేతికి చిక్కుతుంది. ఈ పాతిక కోట్లు ఎవరివి? దాని కోసం కాచుకొని కూర్చున్న జీకే ఎవరు? ఈ పాతిక కోట్లతో.. అన్ లక్కీ.. నిజంగానే లక్కీగా ఎలా మారాడు? అనేదే చిత్ర కథ.
* విశ్లేషణ
‘ఎయిటీస్ కాలం నాటి ఐడియాలు చెప్పకు’ – అని ఓ సందర్భంలో విలన్ విసుక్కొంటాడు. రాజ్ కిరణ్ సరైనోడు కథని విష్ణుకి చెప్పినప్పుడు విష్ణు కూడా ఇలానే విసుక్కొంటే.. లక్కున్నోడు కథ అక్కడే ఆగిపోయిది.. ప్రేక్షకులు నిజంగా లక్కీ అయ్యేవారు. నిజం.. ఈ కథ, ఫార్మెట్, దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు నిజంగానే ఎయిటీస్ కాలం నాటివే. హీరో ఆత్మ హత్య చేసుకొందామనుకొన్న సీన్ నుంచి సినిమా మొదలెడితే.. రాజ్ కిరణ్ కొత్తగా ఆలోచించాడేమో అనుకొంటారంతా. కానీ.. క్రమక్రమంగా భ్రమలన్నీ తొలగిపోతాయి. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శీను.. ఈ గ్యాంగ్ తెరపై కనిపించడం వల్ల – ఏమాత్రం అవసరం లేకపోయిన సన్నివేశాలు కూడా ఓకే అనిపించేలా సాగుతాయి. ఏ సీన్ నుంచి కథ మలుపు తిరుగుతుందో అంటూ ఎదురు చూసి, ఎదురుచూసి ఆడియన్స్‌కి విసుగురావడం తప్ప, దర్శకుడు కథలోకి వెళ్లడానికి ఇసుమంత కూడా ప్రయత్నించడు. హన్సిక అయితే ఒక్క మాటలో ఆడియన్స్‌ని టార్చర్ పెట్టింది. ఎంత ‘పాజిటీవ్’గా ఆలోచింనా విష్ణు – హన్సికల లవ్ స్టోరీలో ఒక్క పాజిటీవ్ పాయింట్ కూడా కనిపించదు. విష్ణు ప్రపోజ్ చేసినప్పుడల్లా హన్సిక ఇరిటేట్ అయిపోతుంటుంది. దాన్ని కెమెరామెన్ పిజీవిందా క్లోజప్‌లో పెట్టేసరికి చూస్తోంది కామెడీ సినిమానా, హారర్ కామెడీనా అనే డౌటు వేస్తుంటుంది. విష్ణు – హన్సికల లవ్ ట్రాక్ ఈ కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు. సరికదా.. ‘పాజిటీవ్ కుటుంబం’ అంటూ ఓ ఎపిసోడ్‌ని చూపించారిందులో. అది రేసుగుర్రంలో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీకి డూప్లికేట్లా అనిపించింది. విశ్రాంతి ముందు కథలో కాస్త జర్క్ వస్తుంది. నిజంగానే ఇక్కడేదో జరగబోతోంది అనుకొంటారంతా. ఆ అంచనాలతోనే ఇంట్రవెల్లో సరదాగా టీ తాగి వస్తే.. ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోతుంది.
దర్శకుడు కథలోకి ఇంకా వెళ్లలేదు… వెళ్లలేదు అని ప్రేక్షకుడు ఫస్టాఫ్‌లో కంగారు పడ్డాడు గానీ.. కథలోకి వెళ్లకపోవడమే మంచిదైంది. ఎందుకంటే.. ఈ సినిమాలో కథే లేదు. విలన్‌కి చేరాల్సిన రూ.25 కోట్ల సూట్‌కేస్ హీరోకి చిక్కుతుంది. దాన్ని చేజిక్కించుకోడానికి విలన్ హీరో వెంట పడతాడు. దాన్ని రెండు గంటల సినిమాగా తీయడం ఎవరికైనా కష్టమే. ఆడియన్స్‌ని కూర్చోబెట్టాలంటే ఫన్నీ ఎపిసోడ్లు నాలుగైదు పడాలి. ప్రతీ సీనూ పండాలి. కానీ అదేం జరగలేదిక్కడ. పాతిక కోట్లు ఖర్చు చేసేందుకు హీరో ఓ డ్రామా ఆడతాడు. అది ఫన్నీగా లేకపోవడం, విలన్ పూర్తిగా డమ్మీ అయిపోవడం, ఎయిటీస్ కాలం నాటి కిడ్నాప్‌లు.. ఫోన్లో వార్నింగులు.. వీటితో సెకండాఫ్ సాగిపోతుంది. ఆ పాతిక కోట్లూ ప్రభుత్వానికి ఇచ్చేసి లక్కీ నిజంగానే హీరో అయిపోతాడు. క్లైమాక్స్ ఏంటన్నది ఇంట్రవెల్ బ్యాంగ్‌లోనే అర్థమైపోతుంది. దాని కోసం మరో గంట కూర్చోవడం ఎందుకు? జస్ట్ ఫన్ కోసం. అది ఇసుమంత కూడా కనిపించకపోవం లక్కున్నోడి పాలిట శాపం. అవసరం లేకున్నా వచ్చిపడిపోయే పాటలు, ఏమాత్రం బలంలేని క్యారెక్టరైజేషన్లు.. ఈ సినిమాని బాగా దెబ్బకొట్టాయి. విష్ఱు మాటి మాటికీ ‘మ్యావ్.. మ్యావ్’ అంటుంటాడు. అదేం మేనరిజమో..?? ఒకటికి పది సార్లు అదే డైలాగ్ వినడంతో… ప్రేక్షకులకు ఇరిటేషన్ వస్తుంది.
* నటీనటుల ప్రతిభ
విష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుంది. దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రయత్నం వరకూ ఓకే. కానీ ఫలితం రాలేదు. మ్యావ్ మ్యావ్ అనే మేనరిజంతో చాలా చాలా ఇబ్బంది పెట్టాడు. నాన్నలా డైలాగులు చెప్పడానికి పదే పదే ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. హన్సిక ఎంత ముదిరిపోయిందో.. ఫస్ట్ ఫ్రేమ్‌లోనే అర్థమైపోతుంది. తన పాత్ర శుద్ద వేస్ట్. `నాకు నీ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు` అనేది విలన్ ఊతపదం. అసలు విలన్‌కి ఈ సినిమాలో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా లేదు. భరణి, జయ ప్రకాష్ వీళ్లని సరిగా వాడుకోలేదు. సత్యం రాజేష్, ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్ కాస్తలో కాస్త బెటర్.
* సాంకేతిక వర్గం
ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. తాను కష్టపడి పనిచేస్తే క్రెడిట్ ఇంకెవరికి వెళ్లిపోతుందో అని ఎవ్వరూ పాటలపై, సంగీతంపై శ్రద్ద పెట్టలేదేమో అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగానే ఉంది. సినిమారిచ్గా చూపించారు. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్లు ఓకే అనిపించాయంటే అదంతా మాటల రచయిత డైమండ్ రత్నబాబు చలవ. కొన్ని డైలాగులు ఆకట్టుకొన్నాయి. కానీ సన్నివేశాన్ని బతికించలేకపోయాయి. రాజ్ కిరణ్ కథ, కథనాలపై శ్రద్ద పెట్టలేదనిపిస్తోంది. విష్ణు డేట్లు ఇచ్చాడు, నిర్మాత రెడీగా ఉన్నాడు.. టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని.. ఈ సినిమాతో ప్రొసీడ్ అయిపోయాడేమో.
* ఫైనల్ టచ్ : లక్కున్నోడు.. మీ లక్ లాగేస్తాడు