చోటా మోటా అని తేడా లేకుండా అందరూ ఆంధ్రాలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. పార్టీలకూ ప్రాంతాలకూ హోదాల స్థాయీ భేదాలు లేకుండా ఆంధ్రా యువతకు సంఘీభావం తెలుపుతున్నారు! అయితే, ఈ తరుణంలో కచ్చితంగా స్పందించాల్సిన కొంతమంది ప్రముఖులు తెరమీదికి ఇంకా రావడం లేదు! వారు వస్తారేమో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. గతంలో ఆంధ్రుల హక్కుల గురించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన వారు, ఇప్పుడు స్పందించడం అనేది కనీస బాధ్యత కదా! అలాంటివారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది… ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు!
రాష్ట్ర విభజనకు ముందు సమైఖ్యాంధ్ర కోసం చాలా సభలు పెట్టి… ఆ ఉద్యమానికి వెన్నుదన్నుగా కొన్నాళ్లు నిలిచే ప్రయత్నం చేశారు! రాష్ట్ర విభజనను అడ్డుకుని, ఆంధ్రుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తానని అప్పట్లో చెప్పారు. ఆంధ్రుల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోం అనేవారు. అదంతా గతం. విభజన తరువాత ఆయన ఏమైపోయారో మరి! సరే, ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు కాబట్టి సైలెంట్ అయిపోయారూ అనుకుందాం. కానీ, ఇప్పుడు స్పందించాలి కదండీ! ఆంధ్రా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే ఆంధ్రుల బాగోగుల పట్ల బాధ్యతగల ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆయన సంఘీభావం తెలపాలి కదండీ..! కానీ, ఆయన “కనబడుట లేదు”!
గడచిన వారం రోజులుగా ప్రత్యేక హోదాకు సంబంధించి రకరకాల పరిణామాలు ఆంధ్రాలో చోటుచేసుకుంటూ ఉన్నా అశోక్ బాబు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు! ఆయన ఎందుకు స్పందించడం లేదంటే… ఏమో, చంద్రబాబు అంటే భయం కావొచ్చనే అభిప్రాయం వినిపిస్తూ ఉండటం విశేషం! కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన ప్రజా నాయకుడు అనే రేంజిలో మాట్లాడేవారు. ఆల్మోస్ట్ రెగ్యులర్ పొలిటీషియన్ అనే స్థాయిలో ప్రసంగించేవారు. అంటే, కిరణ్ కుమార్ అంటే భయం లేకపోవడం వల్లనే నాడు ఉద్యమించినట్టా..? ఆంధ్రుల ఆత్మ గౌరవమనీ, రాష్ట్ర విభజన ఆంధ్రుల మనోభీష్టానికి వ్యతిరేకమనీ… ఇలా చాలా చెప్పేవారు.
అవన్నీ ఇప్పుడు ఏమైనట్టు..? ఆనాటి పౌరుషం, రోషం, పట్టుదల వగైరా ఎమోషన్స్ ఇప్పుడు ఆయనలో లేవా..? ఉన్నపళంగా అశోక్ బాబుని ఉద్యమించమని ఎవ్వరూ కోరడం లేదు. కనీసం సంఘీభావం తెలిపినా చాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఒక గొప్ప సమైఖ్యవాదిగా నాడు కనిపించి… ఇప్పుడు సైలెంట్‌గా ఉంటే ఆయనలోని అవకాశావాదమే ప్రజలకు కనిపిస్తుంది! గతంలో ఆయన్ని అలా నమ్మినవారు ఇప్పుడు దగాపడ్డామని బాధపడాల్సి వస్తుంది. ఆంధ్రుల ప్రయోజనాల పట్ల అశోక్ బాబుకు ఉన్న కమిట్ మెంట్ ఇంతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. గతంలో ఆయన సాగించిన సమైఖ్యాంధ్ర పోరాటాన్నే శంకించాల్సి వస్తుంది.!!