నిద్రపోతున్నవాడిని తట్టో, కొట్టో లేపొచ్చు.. కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్నవాడిని ఎలా లేపాలి? ప్రస్తుతం ఏపీ యువతకు అర్ధంకాని విషయం ఇదే. ప్రత్యేక హోదా గురించి తెలియని వారికి చెప్పొచ్చు కానీ… తెలిసి కూడా అదేం గొప్పది కాదని మూర్ఖపు వాదన చేసేవారిని కన్వెన్స్ చేయడం ఏలా? ప్రస్తుతం ఏపీ యువతకు ఎదురవుతున్న ఈ ఇబ్బంది “ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం” అని మాట్లాడేవారు, “రాష్ట్రానికి అన్యాయం జరిగితే నిద్రపోను” అంటూనే… ప్రత్యేక హోదా గురించి అడిగితే గురకపెట్టే మత్తు నిద్రలో ఉన్నవారు. ఇదే క్రమంలో ప్రత్యేక హోదా గొప్పదా, ప్యాకేజీ గొప్పదా అనే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరేవారు.. హోదా గురించి అడిగితే “అభివృద్ధిని ఆపలేరు” అనేవారు!
అవును… ఏపీలో యువత ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే.. “అది ముగిసిన అధ్యాయం” అని తప్పించుకుంటారు ఒకరు. వారిది ముగియబోయే అధ్యాయం అని తెలియక కాబోలు!! “ఏపీలో బీజేపీ” అనేది కూడా 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ముగిసిన అధ్యాయమే అవ్వొచ్చనే విషయం సదరు పెద్ద మనిషి గ్రహించాలని ఏపీ యువత సూచిస్తుంది! ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఏమిటి.. ఇప్పుడు నిస్సిగ్గుగా చెబుతున్న మాట ఏమిటి? వీరిది ముగిసిన అధ్యాయమే!
“ప్రత్యేక హోదావల్ల ఏం వస్తుందో చెప్పాలి?” ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగే ప్రశ్న. ఇన్ని రకాలుగా, ఇంతమంది, ఎన్నో మార్గాల ద్వారా ప్రత్యేక హోదా గొప్పతనం చెబుతూ ఉంటే… మరలా మొదటికొచ్చి.. “హోదావల్ల ఏమి వస్తుంది” అని అడుగుతుంటే ఇంకేమి చెప్పాలి. హోదా గొప్పతనం అంతా ఇంతా కాదు అని మాట్లాడిన నోరే.. ఈ రోజు తిరిగి అదే ప్రశ్న వేస్తుంటే.. ఏమని సమాధానం చెప్పాలి. హక్కుల విషయంలో రాజీ లేదు అంటారు కానీ… ప్రత్యేక హోదా హక్కు విషయంలో మాత్రం కలిసి రారు. “మీరు ముఖ్యమంత్రి అవ్వడంవల్ల ఏపీకి ఏమి వస్తుంది”? అని ఏపీ వాసులు భావించక ముందే మరోసారి ఆలోచించాలని యువత కొరుకుంటుంది.
జల్లికట్టు స్పూర్తితో అన్న ఒక్కమాట పట్టుకుని తమ తమ తెలివితేటల ప్రదర్శన పెడుతున్నారు ఇంకొందరు. జల్లికట్టే స్పూర్తి అయితే అదే ఆడుకోండి, లేకపోతే పందులతో ఆడుకోండి అంటారు! వారికి వచ్చిన ఆటలు, వారు ఆడే ఆటలు ఏపీ యువత ఆడలేరు కదా!! ఆ విషయం మరిచిన పెద్దలు… కనీస బాధ్యత మరిచి, విజ్ఞత మరిచినట్లుగా ఇలా వ్యాఖ్యానిస్తే ఏమనుకోవాలి? సంస్కార హీనులు అని అనలేము.. ఎందుకంటే వారు మన కేంద్రమంత్రి, మనం ఓట్లు వేసి మనకోసమని ఢిల్లీకి పంపబడిన ఎంపీ!! ఈయనతో ఏ ఆటలు ఆడించాలో అని ఏపీ యువత ఆలోచిస్తుంది!
ప్రత్యేక హోదా వస్తే కలిగే ప్రయోజనాల గురించి, ఆ విషయంలో మాట మార్చిన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ వాసులు ప్రయత్నిస్తుంటే… ఏపీ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పొంతనలేని వాదనకు తెరతీస్తారు మరో మేధావి! ప్రత్యేక హోదా వస్తే ఏపీకి మరింత మేలు జరుగుతుంది, మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఒకపక్క మేధావులు, విద్యావేత్తలు, సీనియర్ రాజకీయ నాయకులు గొంతు పోయేలా వివరించి చెబుతుంటే… “ఏపీ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు.. ప్యాకేజీ గొప్పతనం తెలుసుకోండి” అని అంటారు “గాలి” మాటల పెద్దాయన!
ఈ రకంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో “హోదా” గొప్పతనం, ఆ హోదావల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలు తెలిసి కూడా “హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు” అని మాట్లాడుతున్నవారిని ఎవరు లేపాలి.. మరెవరు మేల్కొలపాలి!!