ఏపీ యువత విశాఖలో తలపెట్టిన ప్రత్యేక హోదా మౌన దీక్ష ఫలితం ఏమైంది? ఏమి జరిగింది? ప్రభుత్వం గెలిచిందా.. పోరాటం నిలిచిందా.. జగన్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను ఏమనుకోవాలి.. యువత, విధ్యార్థుల అరెస్టులను ఎలా చూడాలి.. పవన్ మాత్రం ట్విట్టర్ లో ఉండి, యువతను పోరాడమని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.. ఈ ప్రశ్నలన్నీ ఒకవైపు వినిపిస్తుంటే… జగన్ పై తన అక్కసును వెల్లగక్కే పనికి పూనుకున్నారు జనసేన పేరున ట్విట్టర్ లో ఒక బ్యాచ్!!
వారి అభిప్రాయం ఏమిటంటే… “జనానికి స్పెషల్ స్టేటస్ కావాలి, జగన్ కు సీఎం స్టేటస్ కావాలి, మా ఎఫర్ట్ ని జగన్ పాడుచేశారు” అని. ఇక్కడ ఎవరి ఎఫర్ట్ ఏమిటి, ఎవరు ఏ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష పరోక్ష మద్దతు తెలిపారనే విషయం సుస్పష్టం. అయితే… ఆన్ లైన్ లో ఎంత ప్రోత్సహించినా, ఏస్థాయి ఎంకరేజ్ మెంట్ ఇచ్చినా, లైవ్ లో కనిపించిన ఎఫెక్ట్ అయితే రాదు అనేది పలువురి అభిప్రాయం. ఈ లాజిక్ పవన్ మిస్సయ్యారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. వర్మ లాంటి వారైతే… “యోధుడు కథన రంగంలోకి దిగాలి కానీ, సురక్షిత ప్రదేశంలో ఫోన్ పట్టుకుని ఉండకూడదు” అని నేరుగానే విమర్శించారు. ఈ క్రమంలో జగన్ వల్ల విశాఖ కార్యక్రమం స్పాయిల్ అయ్యిందా, పవన్ వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ కాలేకపోయిందా.. అనేది పెద్ద ప్రశ్నే!
ట్విట్టర్ లో జనసేన పేరున స్పందించిన యువత ఉద్దేశ్యం ఏమిటై ఉండొచ్చంటే… జగన్ విశాఖకు రాకపోయి ఉంటే, ప్రభుత్వం నుంచి అనుమతి లభించి ఉండేది. యువత సైలంట్ గా విశాఖ బీచ్ లో నిరసన తెలియజేసి, సాయంత్రం ఇల్లకు వెల్లిపోయేవారు.. అంతా అనుకున్నట్లుగా దీక్ష జరిగేది అని! అయితే… రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కారణంగా జగన్ వచ్చినా, రాకున్నా అనుమతైతే పోలీసులనుంచి వచ్చేది కాదు! పైగా యువత ఉద్యమించినా, జగన్ పోరాడినా ఇరుకున పడేది ప్రభుత్వమే అన్న విషయం పెద్దలకు తెలుసు. కాబట్టి… జనసేన లో ఉన్న టీడీపీ సానుభూతిపరులో లేక, తమ ట్వీట్లకు ప్రతిఫలం జగన్ పొందేస్తున్నారనే వైకాపా విరోధులో ఇలా స్పందించే అవకాశం లేకపోలేదు.
ఇక్కడ సమస్య అంతా ఏమిటంటే… క్రెడిట్ గేం!! విశాఖలో తలపెట్టిన నిరసన, కొవ్వొత్తుల ర్యాలీ వల్ల ఎవరికి క్రెడిట్ వచ్చింది అనే విషయం కంటే ఎక్కువగా చూడాల్సింది మరొకటి ఉంది. అదేమిటంటే… ప్రత్యేక హోదా మీద పోరాడటం మొదలుపెడితే బీజేపీ కంటే ముందు టీడీపీ నేతలు బలంగా వ్యతిరేకిస్తారనే విషయం స్పష్టమవడం. వెంకయ్య కంటే ఎక్కువగా, బీజేపీ నేతలకంటే ఎక్కువగా టీడీపీ మంత్రులు గొంతు చించుకోవడం. కాబట్టి విషయాన్ని ఆ కోణంలో చూడకుండా… జగన్ స్పాయిల్ చేశారని జనసేన కార్యకర్తలు, పవన్ రాకపోవడం వల్ల నీరుగారిపోయిందని మరికొందరు వ్యాఖ్యానించడం అనవసరం. కాకపోతే… ఏపీ యువత స్పందించిన తీరుపట్ల మాత్రం అంతా హర్షం వ్యక్తం చేయాలి. హోదా గొప్పతనం తెలిసిన యువత స్వచ్చందంగా రోడ్లపైకి రావడం, హోదా విషయంలో వారి ఆశను తెలియజేస్తుంది.
నిరసన బలంగా మొదలైన మొదటిరోజునే హిట్ అయ్యిందని, ఫ్లాప్ అయ్యిందని విశ్లేషించడం పోరాట యోధుడి లక్షణం కాదు! ఒక దశ మొదలైంది.. దీన్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తాం, చివరి వరకూ ఏ స్థాయిలో పోరాడగలుగుతాం అనేది ఆలోచించడం, ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవడం ముఖ్యం. ఈ విషయం ఏపీ వాసులు, హోదా కోరుకునేవారంతా గుర్తించాలని ఆశిద్ధాం!!