ఏపీ యువత ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా నిరసన.. మౌన నిరసన తెలియజేయడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం తమదైన శైలిలో ఆ మౌన నిరసనను సైతం ఆపగలిగింది. విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది, జనసేన కార్యకర్తలను, వైకాపా నేతలను ముందస్తు అరెస్టులు చేసింది. ఈ క్రమంలో ఏపీ అంతా అట్టుడికిపోయింది, యువత అసహనంతో ఉన్నారు.. రాత్రి గడిచింది.. ఉదయన్ని పవన్ ప్రెస్ మీట్ పెట్టారు! ఈ ప్రెస్ మీట్ లో సామాన్యుడు, పవన్ అభిమాని, జనసేన కార్యకర్త, ఏపీ యువత ఏమి ఆశించారో అది పవన్ మాట్లాడారా? లేక ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వంపై.. “కర్రా ఇరగదు, పాము చావదు” అన్న పద్దతిలో ప్రసంగించారా? ఇప్పుడు చూద్దాం…
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పవన్ అనర్గళంగా మాట్లాడారు. వెంకయ్యపై విమర్శలు, ఉత్తరాధి ఆధిపత్య ధోరణిపై తనదైన వాణి వినిపించారు… జాతీయ పత్రికల్లో బేనర్ ఐటంస్ గురించి వ్యాఖ్యానించారు. ఇంతవరకూ బాగానే ఉంది. నిన్నటి ప్రభుత్వ చర్యలపై కూడా పవన్… పాలసీలతో పరిపాలించండి, పోలీసులతో కాదు అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇది కూడా బాగానే ఉంది.. కానీ పవన్ నుంచి ఏపీ యువత ఆశించింది ఇదేనా? ఇంతకు మించి పోరాటంతో కూడిన మాటలు, ప్రభుత్వం మెడలు వంచే చర్యలు పవన్ తీసుకోలేరా? “మీరు మాటతప్పితే నేను ఎందుకు పోరాడకూడదో చెప్పండి” అని బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్న పవన్ ను “ఎవరు పోరాడొద్దంటున్నారు” అనే ప్రశ్నలు యువత నుంచి ఎదురవుతుండటం గమనార్హం!`
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు, అవలంభిస్తున్న వైఖరి అందరికీ తప్పనే తెలుసు! కానీ… అది ఏమాత్రం తప్పు కాదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, ప్రత్యేక ప్యాకేజీ ఎంతో గొప్పది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఏపీ టీడీపీ నేతలపైనా.. నిన్న విశాఖలో యువత విషయంలో ప్రభుత్వం ప్రవర్తించిన విధానంపైనా పవన్ స్పందన సరిపోలేదనే చెప్పుకోవాలి! దీనిపై భవిష్యత్ కార్యచరణ పవన్ ప్రకటించి ఉంటే బాగుండేది. ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుంది అని చెబుతున్న పవన్… ప్రజలకు ఏమి సంకేతం ఇవ్వాలని ఆశిస్తున్నారు?
పవన్ ప్రెస్ మీట్ అంటే… టీడీపీ – బీజేపీలకు అల్టిమేటం జారీ చేస్తారని అంతా ఆశించారనడంలో సందేహం లేదు! నేడు పవన్ చెప్పిన ప్రతీ విషయం దాదాపుగా నిన్న ట్విట్టర్ లో స్పందించిందే! ట్విట్టర్ చూడని వారికి నేడు తన ప్రెస్ మీట్ ద్వారా పవన్ అదే స్థాయిలో స్పందించారు తప్ప… ఒక పోరాట యోధిడిగా మాట్లాడలేదనేవారే ఎక్కువ! ఇప్పటివరకూ పవన్ పెట్టిన ప్రెస్ మీట్ లు, ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు, ఆయన ప్రకటనలు విన్న వారికి “పవన్ నుంచి ఇంతకు మించి ఆశించలేమా?” అనే ప్రశ్న వస్తుంది! ఇది పవన్, జనసేన గ్రహించాలని ఆశిద్ధాం!!