ఎస్.ఎస్.రాజమౌళి… దర్శకుడిగా తానెంత మేధావో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మేధావితనం దర్శకత్వంలోనే కాదు, అన్ని విధాలా, అన్నిరకాలుగానూ ఉంది. తోటి దర్శకుడు ఓ మంచి సినిమా తీస్తే… భేష్ అని మెచ్చుకొని, ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా పొగిడి ఆ సినిమానీ, లేదా ఆ దర్శకుడ్ని అంత ఎత్తున కూర్చోబెట్టడం రాజమౌళికే చెల్లింది. ఈమధ్య.. క్రిష్నీ తెగ పొగిడాడు. గౌతమి పుత్ర శాతకర్ణి అద్భుతంగా ఉంది, నీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి క్రిష్ అంటూ ట్వీట్లు చేశాడు. తానే స్వయంగా రంగంలోకి దిగి.. ఓ పాత్రికేయుడిలా మారి… క్రిష్‌ని ఇంటర్వ్యూ చేశాడు. ఇదంతా చూసి… జనాలు ఆశ్చర్యపోయారు. సాటి దర్శకుడ్ని మరో దర్శకుడు మెచ్చుకోవడం, ఇలా ఇంటర్వ్యూలు చేయడం అద్భుతం, అపూర్వం అంటూ పొగిడేశారు. అందులో భాగంగానే ఓ ప్రధాన పత్రిక ద్వారా క్రిష్‌కి ఓ ఉత్తరం రాశాడు రాజమౌళి. ఆ లేఖ మరింత పాపులర్ అయిపోయింది. తీరా చూస్తే.. ` ఆ ఉత్తరం నేను రాయలేదు` అంటూ ప్లేటు పిరాయించాడు. అదీ.. చాలా ఆలస్యంగా. దాంతో… అటు క్రిష్, ఇటు టాలీవుడ్‌కి షాక్ కొట్టినట్టైంది. ఈ టోటల్ వెనుక ఏం జరిగి ఉంటుంది?? అనేది ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
ఆదివారం ఓ ప్రధాన పత్రికలో ప్రచురితమైన లేఖ అది. ఇంత ఆలస్యంగా.. గురువారం వరకూ రాజమౌళి కామ్‌గా ఉన్నాడంటే కారణం ఏమిటి? ఆ ఉత్తరం తాను రాయకపోతే… ఆదివారమే ఓ ట్వీట్ చేయొచ్చుగా. రాజమౌళి పేపర్ చదవడా, లేదంటే… పేపర్ లో లేఖ ప్రచురితమైన సంగతే తెలీదా?? `విజయం నీదే మిత్రమా` అనే శీర్షికతో ప్రచురితమైన ఆ ఉత్తరంలో రాజమౌళి కొత్తగా చెప్పిందేం లేదు. అంతకు ముందు టీవీ ఛానళ్లకు చేసిన ఇంటర్వ్యూలోని అంశాలే అందులోనూ ఉన్నాయి. అంటే రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ కూడా అబద్ధమేనా?
అసలు జరిగిన విషయం ఏమిటంటే… క్రిష్‌కీ, రాజమౌళికీ మంచి అనుబంధం ఉంది. క్రిష్ తన ప్రతి కథనీ రాజమౌళి కి చెబుతాడు. గౌతమి పుత్ర తీసిన విధానం రాజమౌళికీ నచ్చేసింది. అందుకే తానంతట తాను ముందుకొచ్చి.. ‘ఇంటర్వ్యూ’ ప్రతిపాదన పెట్టాడు. దానికి క్రిష్ ఆనందంగా అంగీకరించాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తరవాత.. ఇందులోని విషయాలే.. ప్రింట్ మీడియాకూ వాడుకొంటాం అని రాజమౌళిని క్రిష్ అడిగాడట. దానికి ‘మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి..’ అంటూ ఆనందంగా ఒప్పుకొన్నాడట. రాజమౌళి అంగీకారం తీసుకొనే… క్రిష్ తన ఆస్థాన రచయిత బుర్రా సాయిమాధవ్‌తో ఆ ఉత్తరం రాయించి ప్రధాన దిన పత్రికకు పంపాడు. క్రిష్ నుంచి వచ్చిన లేఖ కాబట్టి… అన్ని విధాలా నమ్మి ఆ పత్రిక ఆ లేఖని ప్రచురించింది. అయితే లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. రాజమౌళిపై ఒత్తిడి పెరిగింది. ‘సంక్రాంతి పండక్కి రెండు సినిమాలొస్తే… ఒక సినిమానే హైలెట్ చేసి మాట్లాడావేంటి?’ అంటూ కొంతమంది రాజమౌళిని కార్నర్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ ఒత్తిడి భరించలేకే.. ‘ఆ లేఖ నేను రాసింది కాదు.’ అంటూ తాను తప్పుకోవడానికి ప్రయత్నించాడు. అదీ.. ఈ ఉత్తరం వెనుక అసలు కథ.
రాజమౌళి లేఖ వల్ల.. క్రిష్ ప్రతిష్టో, లేదంటే గౌతమి పుత్ర వసూళ్లో పెరిగింది లేదు. ఆల్రెడీ క్రిష్‌కి రావాల్సిన పేరు, ఆ సినిమాకి దక్కాల్సిన గౌరవం వచ్చేశాయి. ఆ లేఖ చదివి.. క్రిష్‌ని కీర్తించడం కంటే.. రాజమౌళి గొప్పదనాన్ని మెచ్చుకొన్నవాళ్లే ఎక్కువ. ‘అరె.. ఎలాంటి ఈగోలూ లేకుండా భలే రాశాడే’ అని. దాన్ని రాజమౌళి అనవసరంగా పాడు చేసుకొన్నాడేమో అనిపిస్తోంది. రాజమౌళి ఆలస్యంగా స్పందించిన తీరు చూస్తుంటే.. ఇది ఒత్తిడి భరించలేక చేసిన ట్వీట్లుగానే అనిపిస్తోంది. ఈ ట్వీట్ల వల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనం గానీ, నష్టం గానీ లేవు. రాజమౌళిపై పెంచుకొన్న గౌరవం కాస్త తగ్గిందంతే. మరో వర్గం.. రాజమౌళిని కార్నర్ చేస్తోందన్న విషయం బయటి జనాలకు స్పష్టమైంది. అంతకు మించి ఉద్ధరించిందేం లేదు.