చిత్రసీమలో అన్నీ ప్లాస్టిక్ బంధాలే. ఎవరూ ఎవర్నీ నమ్మరు. కౌగిలింతలు, స్నేహాలూ అన్నీ పైపైనే. అలాగని ఎవ్వరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే ఎవరు ఏ రూపంలో ముంచేస్తారో ఎవ్వరికీ అర్థంకాదు. ఇలా నమ్మే ఓ స్టార్ హీరో మోసపోయిన ఉదంతమిది. మాస్ సినిమాలతో, యేడాదికి కనీసం రెండు సినిమాలు చేసే ఓ స్టార్ హీరో.. భారీగా సంపాదించాడు. అతని డేట్లు చూసుకోవడానికి, ఇతరత్రా వ్యవహారాలు చక్క బెట్టడానికి మేనేజర్‌గా ఓ నటుడు ఉండేవాడు. ప్రతీ సినిమాకీ తనకంటూ కొంత కమీషన్ వస్తుంటుంది. ఆ హీరో చేసే సినిమాలో తనకీ ఓ పాత్ర దక్కుతుంది. అలా.. డబుల్ లాభం పొందేవాడు. ఇంత చేస్తుంటే యజమానిపై విశ్వాసం ఉండాలి కదా? అది పోయింది.
ఓ డమ్మీ ప్రాపర్టీ బలవంతంగా తన హీరోచేత కొనిపించాడు ఈ నటుడు కమ్ మేనేజర్. అదీ… సదరు హీరోకి బాగా తెలిసిన వ్యక్తి నుంచే. అతను కూడా చిన్న స్థాయి నుంచి పైకొచ్చాడు. నటుడిగా సినిమాలు చేసి, ఆ తరవాత లక్ కలసి రావడంతో నిర్మాతగానూ మారాడు. షాద్ నగర్లో దిమ్మతిరిగిపోయే బూమ్ ఉంది.. అక్కడ పెట్టుబడి పెట్టండి.. అంటూ హీరో చేత ఏమాత్రం పనికి రాని భూములు కొనిపించారు ఈ ఇద్దరు మిత్రుల. తద్వారా మేనేజర్ కమ్ నటుడు అనేవాడికి ఏకంగా కోటి రూపాయల కమీషన్ దక్కింది. తీరా చూస్తే… ఈ హీరోగారు ఎప్పుడైతే కొన్నారో.. అప్పటి నుంచీ.. ఆ భూముల రేట్లు అమాంతంగా పడిపోయాయి. నిజానికి షాద్ నగర్ ప్రాంతంలో అంత రేటు లేదని, కావాలని ఎక్కువ రేటుకి కొనిపించారని, తద్వారా తన మేనేజర్ తో పాటు, నిర్మాత కమ్ నటుడు కూడా లాభపడ్డారన్న విషయం ఆలస్యంగా తెలిసింది ఆ హీరో గారికి.
ఇప్పటికీ ఆ భూముల్ని అమ్ముకోలేక, వదులుకోలేక ఆ హీరోగారు బాగా ఇబ్బందిపడుతున్నార్ట. తనని మోసం చేశాడని తెలిసి ఆ మేనేజర్ని తక్షణం పనిలోంచి పీకేశాడు హీరో. ఇదంతా జరిగి.. ఓ రెండు మూడేళ్లు కావొస్తోంది. కానీ… విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ హీరో ఎవరో… మోసం చేసిన ఇద్దరు మిత్రులెవరో మీరేమైనా గెస్ చేయగలరా??