ప్రత్యేక హోదాపై ఎలుగెత్తిన యువత గళాన్ని సక్సెస్ ఫుల్ గా అణివేశామని అధికార పక్షం లోలోపల అనుకోవచ్చు. ప్యాకేజీతో ప్రజలు ఖుషీగా ఉన్నారనీ, విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగట్టడం జరిగిందని పైపైకి చెప్పుకోవచ్చు! కానీ, ఆర్కే బీచ్ ఉద్యమ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడో, సామాన్యుడో అడిగితే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి జవాబు వస్తుందని ఎవ్వరూ ఆశించరు. సాక్షాత్తూ చంద్రబాబుకు (ప్రస్తుతానికి) మిత్రుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కల్యాణ్… ముఖ్యమంత్రిపై కొన్ని ప్రశ్నలు స్పందించారు. ఆ ప్రశ్నలకు తనకు జవాబు ఇవ్వకపోయినా, ప్రజలకు చెప్పాలంటూ కోరారు. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు రాజీపడ్డారో వివరించాలని పవన్ అడిగారు. ఈ విషయమై మిమ్మల్ని రాజీపడమని ఎవరైనా ఇబ్బంది పెట్టారా… అలాంటివారు ఎవరున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఉన్నట్టుండి హోదాను పక్కన పెట్టేసి… దాన్ని మించిన ప్యాకేజీ వచ్చిందని ప్రజలపై రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తన సలహా వల్లనే ప్రధాని చేశారని చెప్పుకున్నారనీ… ఆ తరువాత, కాదన్నారనీ, ఇదే తరహాలో ప్రత్యేక హోదా విషయంపై మాట మార్చలేదనడానికి నమ్మకం ఏంటన్నారు..? హోదా విషయంలో ముఖ్యమంత్రి తాను చేస్తున్న తప్పును ఎప్పట్లోగా దిద్దుకుంటారని అడిగారు. రాయపాటి, సుజనా వంటి నాయకుల్ని ఎందుకు పక్కన పెట్టుకున్నారని పవన్ ప్రశ్నించారు.
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటే ఉండే పవన్ ప్రశ్నించేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి ఏంటో తెలియాలన్నదే సామాన్యుడి డిమాండ్ కూడా! పవన్ వేసిన ప్రశ్నల్లో ధ్వనించిందీ అదే. అయితే… ఈ ప్రశ్నలకు చంద్రబాబు స్పందిస్తారా..? బదులు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది అసలు ప్రశ్న..? ఇవే ప్రశ్నల్ని ప్రతిపక్ష నేత హోదా జగన్ అడిగినా ఎలాగూ స్పందించరు! పైగా, పవన్ కల్యాణ్ ఈ మధ్య దేని గురించి ప్రశ్నిస్తున్నా వెంటనే స్పందించేస్తున్నారు కదా! ఉద్దానం కిడ్నీ రోగుల గురించి ప్రశ్నించగానే… చంద్రబాబే స్వయంగా స్పందించారు. సంబంధింత శాఖా మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు, తుందుర్రు ఆక్వా రైతుల సమస్యలపై పవన్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటేనే ప్రభుత్వం స్పందించేసింది. రాజధాని బలవంతపు భూసేకరణ విషయంలోనూ పవన్ ప్రశ్నించగానే సమాధానాలు వచ్చేసిన ట్రాక్ రికార్డు ఉంది కదా.
ఇప్పుడు కూడా… పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పవన్‌కు ఏవైనా అనుమానాలు ఉంటే వివరణ ఇస్తామని కూడా అధికార పార్టీవారే స్వయంగా చెబుతున్నారు. సో… పవన్ ప్రశ్నకు తెలుగుదేశం నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంటూ వస్తోంది. అలాంటప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆయన కూడా అలాంటి స్పందనే ఉంటుందని జనసేన అభిమానులు ఆశిస్తారు కదా! మరి, చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.