తప్పులు చేసేవాడు ఎవ్వడూ కూడా సమాధానం చెప్పడానికి ఇష్టపడడు. తనన ప్రశ్నించడాన్ని సహించలేడు. ఎంత సేపు ఎదురుదాడి చేయడం, ఎదుటి వాడిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. నీతులు మాత్రం ఘనంగా చెప్తూ ఉంటాడు. తనంతటి వాడు లేడన్న గట్టి భ్రమల్లో కూడా ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నవాళ్ళే మన దగ్గర ఉన్న రాజకీయ మరియు మీడియా మోతుబరులు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పవన్‌లాంటి వ్యక్తులు పాలిటిక్స్‌లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆశగా చూస్తారు. యువరాజ్యం అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పవన్ కూడా అంతే నిజాయితీగా ఉన్నాడు. దేవాలయ భూముల ఆక్రమణ గురించి పరస్పర విమర్శలు చేసుకోవడం తప్ప వక్ష్ బోర్డ్ ఆస్తుల గురించి మాట్లాడలంటేనే భయపడి నాయకుల మధ్య పవన్ ప్రత్యేకంగా కనిపించాడు. షబ్బీర్ అలీని ఉతికి ఆరేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిని, బాధ్యతారాహిత్యాన్ని ఉతికి ఆరేశాడు. మేం చాలా గొప్పోళ్ళం అని భ్రమల్లో ఉండి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను నేలకు దించాడు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్లో రెచ్చిపోయి కాంగ్రెస్ నాయకులను తిట్టింది పవనే. అందుకే కౌంటర్ ఎటాక్ కూడా గట్టిగానే ఎదుర్కున్నాడు పవన్. పాలిటిక్స్‌లో పవన్ చివరి హీరోయిజం అదే.
ఇక రాష్ట్ర విభజన ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ పవన్ మాట్లాడింది లేదు. తెలుగు ప్రజల మధ్య అంతరాలను పెంచే ప్రయత్నాలు చేస్తున్న డర్టీ పాలిటిక్స్‌ని ఎదుర్కొనే ప్రయత్నం పవన్ ఎప్పుడూ చేయలేదు. విభజన అంతా అయిపోయాక మాత్రం ‘నేనూ మీలాగే బాధపడ్డాను’ అని అద్భుతంగా అభినయించి చెప్పి ఈయన తరహాలో ఈయన కూడా సెంటిమెంట్‌ని బాగానే క్యాష్ చేసుకున్నాడు. జనసేన ఆవిర్భావ ప్రసంగంలో కూడా పవన్ అవకాశవాదం కనిపిస్తుంది. 2014 ఎన్నికల ప్రచారంలో కూడా అదే చేశాడు పవన్. కానీ వైఎస్ జగన్ కంటే కూడా చంద్రబాబునాయుడు అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది అన్న ఉద్ధేశ్యంతో ఎక్కువ మంది ప్రజలు ఉండడంతో పవన్‌పైన విమర్శలు రాలేదు.
కానీ చంద్రబాబు, మోడీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ మాత్రం పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేశాడు పవన్. మోడీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదు, చంద్రబాబుకు తెచ్చు ఉద్ధేశ్యం కూడా లేదన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొదటి సంవత్సరంలోనే అర్థమైంది. కానీ ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా…ప్రజల తరపున నిలబడతా అన్న పవన్ మాత్రం చాలా ఆలస్యంగా మేలుకున్నాడు. రెండేళ్ళపాటు నిద్ర నటించాడు. ఇక ఆ తర్వాత నుంచి కూడా వెంకయ్య, సుజనా చౌదరిలాంటి సామంతులను తిడుతూ టైం పాస్ చేస్తున్నాడు పవన్. పోలవరం ప్రాజెక్ట్ అవినీతికి రాయపాటి సాంబశివరావుని బాధ్యుడిని చేస్తాడు. రాయపాటిని తిడతాడు. ప్రత్యేక హోదా రాకపోవడానికి వెంకయ్య, సుజనా చౌదరీలు కారణమని చెప్పి వాళ్ళనూ తిడతాడు పవన్. కానీ కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ని తన చేతుల్లోకి తీసుకుని, తన అనుయాయుడు అయిన రాయపాటికి ఆ కాంట్రాక్ట్‌ని ఇచ్చిన చంద్రబాబుని మాత్రం ఏమీ అనడు.
ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా పవన్ చేసింది అదే. ఆంధ్రప్రదేశ్ యువతకు శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశాన్ని కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి యువతరం ముందుకు వస్తే…..ఆ పోరాటాన్ని కాస్తా జగన్ వర్సెస్ చంద్రబాబు గొడవగా మార్చిన టిడిపి అనుకూల మీడియాను కూడా ఏమీ అనే ధైర్యం లేకపోయింది పవన్‌కి. యువత చేయాలనుకున్న పోరాటాన్ని హైజాక్ చేయాలనుకున్న జగన్‌ని కూడా విమర్శించలేకపోయాడు పవన్. రామ్ గోపాల్ వర్మని మాత్రం విమర్శించాడు. కానీ వర్మ అడిగిన ప్రశ్నకు మాత్రం పవన్ దగ్గర సమాధానం లేదు.
నాయకుడనేవాడు ఎప్పుడూ కూడా జనాలకంటే మరీ ఎక్కువ ముందు నడవకూడదు. అలాగే జనాలతో కలిసి కానీ, జనాల వెనుక కూడా నడవకూడదు. జనాలకు స్ఫూర్తిని ఇచ్చేలా వాళ్ళకంటే ఒక్క అడుగు ముందు తాను ముందడుగేయాలి. అలాంటి నాయకుడు పవన్ అని చెప్పి అప్పుడెప్పుడో పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవేశంగా చెప్పాడు. కానీ నిన్న పవన్ ఏం చేశాడు? అదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పవన్ దగ్గర సమాధానం లేదు. సురేఖ గురించి యండమూరి ప్రస్తావించడంపై పవన్ అన్నయ్య చిరంజీవి స్పందించినట్టుగా…..సంస్కారం లేకుండా రామ్ గోపాల్ వర్మ కూతురుని సీన్లోకి లాగాడు పవన్.
ఆ విషయం పక్కన పెట్టినా ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి పవన్ వ్యూహమేంటి అనే ప్రశ్నకు కూడా పవన్ దగ్గర సమాధానం లేదు. కానీ విమర్శకుల దగ్గర ఉంది. 2019 వరకూ ఇలాంటి రాజకీయాలే చేస్తూ ఉంటాడు పవన్. ఈ ట్విట్టర్ పోరాటాల పేరు చెప్పుకుని 2019 ఎన్నికల్లో కొన్ని సీట్లకు పోటీ చేస్తాడు. చంద్రబాబు, టిడిపి అనుకూల మీడియాతో వ్యూహాత్మక ఒప్పందం ఏర్పరుచుని మరోసారి చంద్రబాబు పవర్లోకి వచ్చేలాగా, పవన్‌కి ప్రతిపక్ష నేత హోదా వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ చెస్తాడు పవన్. అదీ పవన్ కళ్యాణ్ అసలు సిసలు రాజకీయ అవకాశవాదం. ఎన్టీఆర్లానే పార్టీ పెట్టిన నెలల కాలంలోనే పవర్లోకి వచ్చేద్దామని బొక్కా బోర్లాపడ్డ అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం ఫ్లాప్ షో నుంచి పవన్ నేర్చుకున్న పాఠం ఇదే.
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు ముగ్గురూ కూడా అవకాశవాద రాజకీయాలే చేస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికలు అయ్యే వరకూ మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేక హోదానే కాదు….కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత ఏంటి అనేది మాత్రం చూడాలి. లేకపోతే అర్థ శతాబ్ధ కాలానికి పైగానే ‘అభివృద్ధి చెందుతున్న భారతదేశం’ అని చదువుకోవడానికి అలవాటు పడ్డ జనాలు పూర్తిగా రాజీపడి బ్రతకాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిన్నటి శాంతియుత ర్యాలీని చంద్రబాబు ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అణచివేసిందో……పవన్, జగన్‌లు ఎంతటి అవకాశవాద రాజకీయాలు చేశారో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ముందు కనీసం నిరసన తెలియచేయడానికి ముందుకు వస్తారంటారా?