2009లో యువరాజ్యం అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్….ఆ తర్వాత మళ్ళీ 2014లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2014 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు. బాబు, మోడీలకు ఓటెయ్యండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ తప్పులు చేస్తే నేను నిలదీస్తా…ప్రశ్నిస్తా అన్నాడు. ఆ తర్వాత షరా మామూలుగానే..అలవాటు ప్రకారమే రెండేళ్ళు నిద్రపోయాడు. ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాడు. హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటున్నాడు. కానీ పవన్ మాటల్లో ఇంతకు ముందు ఉన్న ఫైర్ అస్సలు లేదు. అలాగే తప్పు చేసిన వాళ్ళపైన ఫైరింగ్ చేసే కెపాసిటీ కూడా ఈ పవర్ స్టార్‌కి లేనట్టుంది. లేకపోతే వాళ్ళతో ఆమ్యామ్యా వ్యవహారాలు ఉన్నాయని వినిపిస్తున్న విమర్శలే నిజమేనేమో తెలియదు మరి. తప్పు చేసిన వాళ్ళను అనే దమ్ము లేక వేరెక్కడో ఫైరింగ్ చేస్తున్న విషయంలో మాత్రం పవన్ యాజ్ ఇట్ ఈజ్‌గా జగన్‌ని ఫాలో అవుతున్నాడు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన నరేంద్రమోడీని జగన్ ఒక్కమాట కూడా అనడు. అవసరమైతే 2019 తర్వాత మోడీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా జగన్ రెడీ అని చెప్పడానికి సందేహించక్కర్లేదు. జగన్ టార్గెట్ మొత్తం కూడా చంద్రబాబుపైనే ఉంటుంది. చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. మోడీని మాత్రం ఒక్క మాట కూడా అనడు. ఇప్పుడు పవన్ వ్యవహారం కూడా అలానే ఉంది. ప్రత్యేక హోదా కోసం యువత చేపట్టిన శాంతియుత ర్యాలీని తన పోలీసు బలగంతో దుర్మార్గంగా అణచివేసింది చంద్రబాబు. తనకు నచ్చని మాటలు, పనులు చేసే ఎవ్వరినైనా సరే చంద్రబాబు ఏ రేంజ్లో తొక్కెయ్యగలడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశాడు చంద్రబాబు. మరోసారి అలాంటి ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు అన్నంత పట్టుదల ప్రదర్శించాడు చంద్రబాబు. పోలీసులు కూడా అసాంఘిక శక్తుల స్థాయిలో రెచ్చిపోయారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయాలన్నీ పవన్‌కి కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మొత్తం కూడా మోడీని టార్గెట్ చేస్తూ సాగింది. హోదా ర్యాలీని అణచివేయడంలో మోడీ తప్పు ఏముంది? మోడీకి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు చేసినదానికి సంబంధం ఏంటి? ప్రత్యేక హోదా ర్యాలీ ప్రశాంతంగా జరిగి ఉంటే……అప్పుడు కూడా మోడీ స్పందించకపోతే అది మోడీ తప్పవుతుంది. ఈ ఉత్తర భారతం-దక్షిణ భారతం అన్న కాన్సెప్ట్‌ని పవన్ ఎంత త్వరగా వదిలేస్తే దేశానికి అంత మంచిది. ఫస్ట్ మన ఇళ్ళు కరెక్ట్‌గా ఉంటే…అప్పుడు పక్కింటి వాడిపైన పడి ఏడవొచ్చు. అలాగే జాతీయ మీడియాపైన కూడా విమర్శలు గుప్పించాడు పవన్. మరి తెలుగు మీడియా చేసిందేంటి? ప్రత్యేక హోదా ర్యాలీకి ప్రోత్సహమిచ్చిందా? సాక్షికేమో ఎంతసేపూ జగన్‌ని హీరోని చేయడమే పని అయిపోయింది. ఆంధ్రజ్యోతి, ఈనాడులతో పాటు మిగతా చంద్రబాబు అనుకూల మీడియాకేమో ఆర్కే బీచ్ ఖాళీగా ఉన్న ఫొటోలను హైలైట్ చేయడమే పని అయిపోయింది. హోదా ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు.
జాతీయ మీడియాను, నరేంద్ర మోడీని తిట్టటంలో తప్పు లేదు. కానీ అదే టైంలో చంద్రబాబు చేస్తున్న తప్పులను, తెలుగు మీడియా పక్షపాతాన్ని విమర్శించే దమ్ము లేకపోతే ఎలా పవన్? ప్రత్యేక హోదా పాపం మొత్తం నరేంద్రమోడీ ఖాతాలోనే వేసేద్దామంటే ఎలా కుదురుతుంది? సుజనా చౌదరి, రాయపాటి లాంటి వాళ్ళను తిడితే చంద్రబాబును తిట్టినట్టు ఎలా అవుతుంది? అలాగే మార్చిలో దక్షిణ భారత ఉద్యమం ఏదో చేస్తానన్నాడు పవన్. ఇది మాత్రం చాలా కామెడీగా ఉంది. జగన్ వ్యవహారం కూడా ఇలానే ఉంటుంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా చంద్రబాబుని ఎలా తిట్టాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు పవన్ వ్యవహారం కూడా అలానే ఉంది. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడకపోవడం గురించి పవన్ చెప్పిన ఆన్సర్ కూడా ఫక్తు రాజకీయమే.
సీట్లు అమ్ముకోవడం, డబ్బున్నవాడికే సీట్లు ఇవ్వడం, జంపింగ్ జపాంగ్స్కి పెద్ద పీట వెయ్యడం లాంటి రెగ్యులర్ రాజకీయ పార్టీలు చేసే తప్పులన్నీ చేశాడు కాబట్టే చిరంజీవి పార్టీని ప్రజలు ఓన్ చేసుకోలేదు. వైఎస్, చంద్రబాబులకు చిరంజీవికి తేడా ఏముంది అనుకున్నారు. ఇప్పుడు పవన్ కూడా జగన్ తరహా రాజకీయమే చేస్తానంటే పవన్ రాజకీయ అస్థిత్వం కూడా ప్రమాదంలో పడడం ఖాయమే.