ప్రత్యేక హోదా ఉద్యమం… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరోసారి టెన్షన్ పెడుతున్న అంశం. హోదాకు బదులు ప్యాకేజీ సాధించామనీ, ప్రజలు హ్యాపీగా ఉన్నారనీ, అందుకే విశాఖ ఉద్యమానికి యువత స్పందన సోసోగా ఉందని అధికార పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. కానీ, వాస్తవం ఏంటో వారికీ తెలుసు! యువతను ఎక్కడిక్కడ ఎలా అడ్డుకున్నారో… మీడియాను మేనేజ్ చేసుకుంటూ ప్రజలను ఎలా డైవర్ట్ చేశారో వారికి తెలియంది కాదు! ఇంకో ముఖ్యమైన విషయంపై కూడా వారికి చాలా స్పష్టత ఉందనే చెప్పాలి. అదేంటంటే… విశాఖతో మొదలైన హోదా ఉద్యమం ఇక్కడితో ఆగేట్టు లేదనీ, విపక్ష నేత జగన్ కూడా ఇకపై మరింత దూకుడుగా ముందుకెళ్తారని!
నిజానికి, ప్రత్యేక హోదా రాలేదన్న అసంతృప్తి ఆంధ్రుల్లో మొదట్నుంచీ ఉందన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే, ఈ అసంతృప్తికి జగన్ నాయకత్వం వహించడం వారికి సుతారమూ ఇష్టం లేదన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జనసేన భుజాన వేశారనే అభిప్రాయం చాలామందిలో బలంగా ఉంది! ఆ ముద్ర నుంచి బయటపడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా… ఆ బాధ్యత నుంచి పవన్‌ను తప్పించేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరనే ఇప్పటికీ అనిపిస్తోంది. విశాఖ ఉద్యమం ముందుకు వరకూ ప్రత్యేక హోదా వాదన అంతా వారు ఆశించినట్టే పవన్ పరిధిలోనే ఉంటూ వచ్చింది. కానీ, విశాఖ తరువాత సీన్ మారుతోంది!
వైజాగ్ ఉద్యమానికి జగన్ మద్దతు ప్రకటించడం, ఆయనే స్వయంగా తరలి రావడంతో సీన్ మారింది. మొదట్నుంచీ ప్రత్యేక హోదాపై విపక్షమూ ఉద్యమిస్తున్నా.. ఇప్పుడు దానికి మరింత ప్రజా మద్దతు పెరిగిందన భావన ఏర్పడింది. దీన్ని మొగ్గలోనే తుంచడం తెలుగుదేశం కిం కర్తవ్యం కదా! అందుకే, ఇప్పుడు జగన్‌పై కక్ష సాధింపులకు దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలో ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులను జగన్ బెదిరించారనీ, దురుసుగా ప్రవర్తించారనీ, రన్ వే బైఠాయించి విమాన సర్వీసులను అడ్డుకున్నారనే కోణంలో కేసులు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే వ్యూహంతో తెలుగుదేశం ముందుకు వెళ్తే… సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్టే అవుతుంది! ఇదే వ్యూహంతో సర్కారు ముందుకు వస్తే… సమర్థవంతంగా తట్టుకునేందుకు కూడా వైకాపా కూడా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని కూడా సమాచారం!