వైజయంతీ మూవీస్… ఒకప్పుడు తెలుగు చిత్రసీమకు సూపర్ డూపర్ సక్సెస్‌లను అందించిన సంస్థ. వైజయంతీ సినిమా అంటే… హిట్టు గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. పెద్ద హీరోల కాల్షీట్లు చిటికెలో సంపాదించగలిగే సామర్థ్యం దత్తు సొంతం కావడంతో… ఆ సంస్థ నుంచీ ఎప్పుడూ భారీ సినిమాలే వస్తుండేవి. అయితే వరుస ఫ్లాపులు వైజయంతీ మూవీస్ ని వెనుకడుగు వేసేలా చేశాయి. ఎన్టీఆర్‌తో తీసిన శక్తి.. అయితే వైజయంతీ శక్తి సామర్థ్యాలపై పెద్ద దెబ్బ కొట్టింది. కొన్నాళ్ల నుంచీ… నిర్మాణ రంగంలో యాక్టీవ్‌గా లేరు అశ్వనీదత్. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ నుంచి వరుసగా సినిమాలు వస్తాయని చెప్పేశారాయన. ఈ రెండేళ్లలో ఏకంగా 9 చిత్రాల్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని దత్ ప్రకటించేశారు.
ఎవడే సుబ్రమణ్యం తరవాత దత్ బ్యానర్ నుంచి సినిమా రాలేదు. అయితే ఇప్పుడు సావిత్రి జీవిత కథని ‘మహానటి’ పేరుతో తెరకెక్కించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్లందరితోనూ సినిమాలు చేయడానికి దత్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకదాని తరవాత మరో సినిమాని పట్టాలెక్కించేయడానికి దత్ వ్యూహాలు కూడా సిద్దం చేసేశాడట. ”మా సంస్థ నుంచి ఇక వరుగా సినిమాలొస్తాయి. ఈ రెండేళ్లలో 9 సినిమాలు చేయాలన్న ప్లాన్ ఉంది. హీరోలంతా డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్లకు తగిన కథల్ని కూడా సిద్దం చేస్తున్నాం” అంటున్నాడు అశ్వనీదత్. ఆయనకు మెగా ఫ్యామిలీతోనే కాదు, అందరి హీరోలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. దత్ తో సినిమా అంటే.. ఇప్పటికీ వాళ్లంతా రెడీనే. మహేష్ బాబు ఎప్పుడో… దత్‌కి కాల్షీట్లు ఇచ్చాడు. కానీ.. సరైన కథ సిద్దం చేయకపోడం వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈసారి ఎలాగైనా మహేష్‌తో సినిమా చేయాలని కంకణం కట్టుకొన్నాడు దత్. అంతేకాదు.. జగదేక వీరుడు – అతిలోక సుందరి సీక్వెల్ చేయాలన్నది దత్ ఆలోచన. ఈ రెండేళ్ల ప్లాన్‌లో ఆ సినిమా కూడా ఉండే ఉంటుంది.