ప్రజారాజ్యం అనే ఓ పార్టీని స్థాపించి అన్ని పార్టీల్లో ఉన్న మేనిఫెస్టోల నుంచి విధానాలను కాపీ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి….వాటిని ప్రజలకు వినబడేలా ఊరూవాడా చెప్పి… తాను ముఖ్యమంత్రిని అవడమే పార్టీకి ఉన్న ఏకైక అజెండా అన్న అసలు ఉద్ధేశ్యాన్ని మాత్రం మనసులోనే ఉంచుకుని రాజకీయ తెరంగేట్రం చేశారు. కానీ సమైక్యాంధ్రప్రదేశ్ అన్న విధానాన్ని ముందుగా వినిపించిన నాయకుడు చిరంజీవే. సమైక్యాంధ్ర విధానం ప్రకటించిన ఎక్కువ సీట్టు, ఓట్లు ఉన్న ఏకైక పార్టీ కూడా చిరంజీవిదే. సమైక్యాంధ్ర ఆవశ్యకత ఏంటి? ఎందుకు ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలి అనే విషయాలపైన మెగాస్టార్ చాలా చాలా మాట్లాడేశారు. కట్ చేస్తే అలాంటి చిరంజీవి ఓ శుభ ముహూర్తాన ఉత్తరాది నేత అయిన సోనియాగాంధీని కలిశారు. ఆవిడగారు ఏం మంత్రం వేశారో తెలియదు కానీ బయటికి వచ్చి సోనియా ఏం చెప్తే….ఆ మాటకు నేను తలూపడానికి రెడీ అని చెప్పాడు ది గ్రేట్ హీరో మెగాస్టార్. సోనియా దేవత, త్యాగమూర్తి, మహా నాయకురాలు అని ఇంకో ఎన్నో రొటీన్ భజన కూడా తన యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని చూపిస్తూ చేసేశాడు చిరంజీవి.
ఇక ఆ సోనియమ్మకు కాపలా కుక్కను అని చెప్పుకుని మురిసిపోయిన కాంగ్రెస్ నాయకులు ఎందరో? ఆ సోనియమ్మకు గుడి కట్టించిన నాయకులు కూడా మన తెలుగువాళే. ఇక మహానేత అని చెప్తూ ఊరూ వాడా తిరుగుతున్న వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి అయితే గాంధీ కుటుంబానికి కట్టు బానిసని అనే స్థాయిలో భక్తిని ప్రదర్శించారు. సులభ్ కాంప్లెక్స్‌లకు కూడా ఆ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి అనే రేంజ్లో వాళ్ళ పేర్లను తెలుగు ప్రజల పైన రుద్దాడు వైఎస్. ఇక తెలంగాణా కాంగ్రెస్ నాయకుల సోనియమ్మ భక్తి గురించి గ్రంథాలే రాసెయ్యొచ్చేమో.
పదేళ్ళ పాటు తెలుగు నాట వినిపించిన ఉత్తరాది నేత సోనియా భక్తి పాటలకు శుభం కార్డు పడే టైం వచ్చేసరికి మరో ఉత్తరాది నేత నమో జపంతో చిడతలు పట్టుకుని రెడీ అయ్యారు చంద్రబాబు, పవన్‌లు. ఈ సారి తెలుగు మీడియాకు కూడా పూనకం వచ్చేసింది. వెంకయ్య నాయుడు అయితే నరేంద్రమోడీని ఎలా పొగడాలి అనే సబ్జెక్ట్ పైన రీసెర్చ్ ఏమైనా చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చేలా పొగిడారు. ప్రజారాజ్యం పార్టీ నేతగా అన్నయ్య చిరంజీవి కోసం చేసిన ప్రచారం కంటే కూడా నరేంద్రమోడీ భజనను ఇంకాస్త ఎక్కువ స్థాయిలో చేస్తూ ప్రచారం సాగించాడు పవన్. ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు టిడిపి అనుకూల మీడియాకు గంటల తరబడి ఇంటర్యూలు ఇచ్చాడు. వేరే టాపిక్కే లేదు. అంతా భజనే. ఇక ఏ విషయంలోనైనా ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనే రేంజ్లో రెచ్చిపోయే ఆంధ్రజ్యోతి ఎం.డి రాధాకృష్ణ భజనని మాటల్లో వర్ణించడం కష్టం. నిఖార్సైన జర్నలిజం మాది అని చెప్పుకునే ఈనాడువారు కూడా మోడీ భజనలో అందరినీ బీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీకి ఓటేసే వరకూ, వాళ్ళ చెవుల్లో నమో జపం మార్మోగేలా చేశారు. అందరూ బానిస మనస్తత్వం ఉన్న నాయకులే కదా….వాళ్ళే పడి ఉంటారు అన్న ఆలోచన మోడీకి వచ్చిందో ఏమో తెలియదు కానీ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ అవమానించని స్థాయిలో చంద్రబాబును అవమానిస్తున్నాడు మోడీ. ఆ విషయం అర్థమైన వెంటనే ఆంధ్రజ్యోతి వారి టోన్ మారిపోయింది. ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ కూడా బిజెపికి బద్ధ శతృవు అయిపోయాడు. ఇప్పుడు నరేంద్రమోడీ వారు పవన్ కళ్యాణ్‌కి ఉత్తరాది నాయకుడిలా కనిపిస్తున్నారు.
ఉత్తరాది నాయకత్వాన్ని తెలుగు ప్రజల నెత్తిన రుద్దిన వారే ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళను ఏదో చేస్తున్నారని కొత్త జపం మొదలెట్టారు. అయ్యా పవన్ వారు…..ఉత్తరాది నాయకులు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారంటే ఆ తప్పు ముమ్మాటికీ దక్షిణాది నాయకులదే. అలాగే ఉత్తరాది నాయకులు తప్పు చేస్తే …దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విడగొట్టమనడం కెసీఆర్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మీ పార్టీ ఆవిర్భావ సభలో ఏకి పడేశారు. మీకు గుర్తుందో లేదో మరి. తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలెవ్వరూ అన్యాయం చేయ లేదు. ఆంధ్రప్రదేశ్ నాయకులు చేశారు. తెలంగాణా నాయకులు చేశారు. వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు చేశారు. కానీ రాజకీయ స్వార్థం కోసం రెండు ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు. ఇప్పుడు కూడా ఆంద్రప్రదేశ్‌లో ఉన్న కొంత మందికి మోడీ శతృవు అవడం ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి కెసీఆర్ చేసిన రాజకీయానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రజాస్వామ్యయుతంగా డిమాండ్ చేసి సాధించుకోవడంలో తప్పు లేదు. అలాగే అన్యాయం చేస్తున్న నాయకులను తిట్టడంలో కూడా తప్పులేదు. కానీ ఆ నాయకులను డిఫెన్స్‌లో పడేయాలన్న ఉద్ధేశ్యంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దారుణమైన రాజకీయాన్ని మాత్రం ఈ దేశంలో ఉన్న ప్రజలెవ్వరూ క్షమించరు. రాజకీయ శతృత్వాన్ని ప్రజల మధ్య శతృత్వంగా మార్చే కుతంత్రపు రాజకీయం పవన్ ఎప్పుడూ చెప్పే దేశ సమగ్రతకు కూడా భంగకరమే. మోడీ దిగివచ్చేలా చేయడానికి వేరే మార్గాలు ఏవైనా ఆలోచించు పవన్. మోడీపైన కోపంతో దేశ సమగ్రతకు భంగం కలిగించే రాజకీయం క్షమార్హం కాదు. గుప్పెడు మంది ఆవేశపరులకు దగ్గరవుతావేమో కానీ కోట్లాది మంది ఆలోచనాపరులను దూరం చేసుకునే రాజకీయం వద్దు.