ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేసినవారిని, నినాదాలు లేకుండా ప్లకార్డులతో ఊరేగిన వారిని చూశారా? ఆ మొహాలతో మనకు పరిచయం లేదని అర్ధమైంది కదా?
కొన్ని నెలల క్రతం ”స్వచ్ఛ భారత్” లో రోడ్లు ఊడ్చిన వారిలో ఈ మొహాలు కొన్ని ఉన్నాయని గుర్తుకొస్తున్నది కదా? అంతకు ముందు చాలా వారాలక్రితం ఆదివారాల్లో గోడలమీద చెత్త పోస్టర్లు పీకేసి రంగులు వేసిన యువతీ యువకుల గుంపులో కొన్ని ఈ మొహాలు వున్నాయని జ్ఞాపకానికి రావడం లేదా? ఇంకొక రోజు నడిరోడ్డుమీదో, కాలేజీ ఫంక్షన్ లోనో జనంమధ్యనుంచి ఆకస్మికంగా విరుచుకు పడినట్టు ఫ్లాష్ మాబ్ డ్యాన్సుతో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ రగిలించిన గుంపులో కొన్ని ఈ మొహాలేనని ఇంకా గుర్తుకి రావడం లేదా?
అవును! ఇవన్నీ కొత్తమొహాలే!! ప్రజలు సరే. రాజకీయ నాయకులు గుర్తించలేని, గుర్తించినా మింగుడు పడని కొత్తమొహాలే! అధికారంలోకి వచ్చినప్పటినుంచి రోజురోజుకీ ప్రజలకు దూరమైపోయే రాజకీయ వ్యవస్ధమీద నిరసన, వ్యతిరేకత, ఆగ్రహం, ఆవేశం ఒక కార్యాచరణగా రూపుదిద్దుకునే క్రమంలో ఈ మొహాలు తయారయ్యాయి. తమిళనాడులో ”జల్లికట్టు” సాధనలో ఈ మొహాలకు ఒక స్పష్టమైన ఆకారం వచ్చింది.
ఈ మొహాలు వాటికవే నడుస్తాయి. అవసరమైన వనరులను అప్పటికప్పుడు తమనుంచే సమకూర్చుకుంటాయి. పూలు దండగా మారడానికి దారం ఆధారంగా వున్నట్టే వీరందరికీ సోషల్ మీడియా కనెక్టివిటీగా వున్నది.
సుప్రీం కోర్టు వొద్దన్న జల్లికట్టు ను ప్రభుత్వంతో ఔననిపించుకున్న మౌనపోరాటానికి తలవొగ్గడం వెనుక కేంద్రప్రభుత్వానికి తమిళనాడుతో వున్న అవసరాలు ఈక్వేషన్లు, ఐదురాష్ట్రాల ఎన్నికలకు ముందు తలనొప్పులు వొద్దన్న ముందు చూపు వుండి వుండవచ్చు. అయితే నాయకత్వమే లేకుండా ఆకస్మికంగా ఉద్యమం పుట్టి, ప్రశాంతంగా విస్తరించి, మూడురోజుల్లోనే విజయం సాధించిన అద్భుతంలో ఏ రాజకీయాలూ లేకపోవడమే ఇక్కడ అసలైన విశేషం.
ఆంధ్రుల ఆలోచనల్లో స్ధబ్ధంగా, నిద్రాణంగా వున్న ప్రత్యేక హోదా డిమాండుని జల్లికట్టు చైతన్యపరచింది. పవన్ కల్యాణ్ విడుదల చేసిన చిన్న వీడియో క్లిప్పింగ్ యువతను కదిలించింది. విశాఖలో ప్రతిపక్షనాయకుడు జగన్ నుకాలుమోపనివ్వనంత నిర్భందకాండకు దారి తీసింది.
పెట్టుబడుల సమ్మేళనానికి ముందురోజే ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని ఇన్వెస్టుమెంట్లు తగ్గవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాను ఆలోచనను, ఆయన ప్రభుత్వం పాటించిన దమననీతిని అర్ధంచేసుకోవచ్చు. అయితే పవన్ నో, జగన్ నో , మరెవరినో అణచిపెడితే ఉద్యమాలు ఆగిపోతాయనుకోవడం కరెక్టుకాదు.
రకరకాల అంశాలవల్ల యువతలో తలఎత్తుతున్న సాంఘిక చైతన్యం ముందు రాజకీయ ఎత్తుగడలు మరుగుజ్జులైపోతాయి. దీన్ని గుర్తించలేకపోతే ప్రతిపక్షాలు కూడా వెనుకబడిపోతాయి. తమిళనాడులో మాదిరిగా విజయ సాధన దశకు ఆంధ్రప్రదేశ్ యువచైతన్యం ఇంకా పెరిగి వుండకపోవచ్చు…అయితే చైతన్యమనేది మొదలైంది. విజయసాధన వైపే అది నడుస్తూ వుంటుంది.
ఇది రాజకీయాలు, సాంప్రదాయిక నాయకత్వాలూ లేని ఒక సోషల్ ఎవల్యూషన్!
కాలమే తన సమస్యల్ని పరిష్కరించుకోవడం ఇదే!! –