ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా నమ్మకాలే..! ముహూర్తం చూడనిదే ఏపనీ చేయరని అంటారు..! ఎప్పటికప్పుడూ పూజలూ గ్రహశాంతులు వంటివి చేస్తూ ఉంటారనీ చెప్పుకుంటారు. ఆ మధ్య అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఎన్నిరకాల సెంటిమెంట్లు ఫాలో అయ్యారో అందరికీ తెలిసిందే. ఎక్కడి నదుల నుంచీ నీళ్లు తెప్పించారు. ఊళ్ల నుంచీ మట్టి తెప్పించారు! అవన్నీ ఇప్పుడు అమరావతిలో ఉన్నాయా లేదా అనేది వేరే విషయం అనుకోండీ..! ఆ మధ్య… తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం పూర్తి కాకముందే గృహప్రవేశం చేశారు. ఆయనకు సెంటిమెంట్లు ఏ రేంజిలో ఉంటాయో చెప్పడానికి ఇవి చాలవూ! అయితే, అసలే ఆయనకి నమ్మకాలు జాస్తీ అనుకుంటే.. తాజాగా ఓ కొత్త సెంటిమెంట్ తెరమీదికి వచ్చింది. ఇది కాస్త టెన్షన్ పెంచే అంశమే అనాలి!
చంద్రబాబు నాయుడుకి 9 నంబర్‌తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్ అవుతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ఆయన తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది కూడా 1999 ఎన్నికల్లో..! ఆ తరువాత అధికారం కోల్పోయారు! ఆ తరువాత, ఏకంగా 9 ఏళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 2009లో చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం రూపంలో తెలుగుదేశం గెలుపునకు చిరంజీవి అడ్డుపడ్డట్టయింది. సో… 9వ నంబర్‌తో చంద్రబాబు ఏదో బలమైన సెంటిమెంట్ ఉందని కొంతమంది ఇప్పుడు అంటున్నారు. సంవత్సరంలో 9 అంకె చివర్లో వచ్చిన ప్రతీసారీ తెలుగుదేశంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఆ లెక్కన.. వచ్చే ఎన్నికలు 2019లో జరగబోతున్నాయి! చిత్రంగా.. ఈసారి ఎన్నికల్లో చిరంజీవి లేకపోయినా, ఆయన తమ్ముడు… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కీలకంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. గడచిన ఎన్నికల్లో మాదిరిగా తెలుగుదేశానికి జనసేన సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేట్టు ప్రస్తుతానికి కనిపించడంలేదు. రానురానూ తెలుగుదేశం నుంచి దూరం జరగాల్సిన పరిస్థితి పవన్ ఏర్పడుతోంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే… చంద్రబాబుతో దోస్తానా పూర్తిస్థాయిలో కటీఫ్ అనే నమ్మకం ప్రజలకు కలిగించాల్సిన చారిత్రక అవసరం జనసేనకు ఉంది! సో… సెంటిమెంట్ ప్రకారం 2019… అంటే, చివర 9 అంకె వచ్చిన సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి. మరి, ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అనుభవం ఎదురౌతుందో అనే సెంటిమెంట్ వినిపిస్తోంది. ఈ విషయం తెలియగానే పరిహార హోమాలూ, దోష నివారణ చర్యలూ లాంటివి తమ్ముళ్లు మొదలుపెట్టేస్తారేమో!