సొంత డబ్బా వేసుకోవడం పరిమితంగా ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ, మరీ శృతిమించినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది! చెప్పేవారికి ఏమీ అనిపించకపోయినా.. వినేవారు అనుభవించే ఆ బాధ వర్ణణాతీతమనే చెప్పాలి. ఇదే క్రమంలో తమ గురించి తాము ఎంత గొప్పగా చెప్పుకున్నా పర్లేదు కానీ.. దానివల్ల ఇతరులను తక్కువ చేసే ప్రక్రియకు మాత్రం తెరతీయకూడదు. అలా జరిగితే ఈ “సెల్ఫ్” మాటలకు ఇబ్బందిపడేవారు, బాధపడేవారి కంటే.. వీరి అజ్ఞానాన్ని చూసి నవ్వుకునేవారే ఎక్కువగా ఉంటారు! ఇంతకూ ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే… ఏపీ సీఎం చంద్రబాబు గురించి.. ఆయన వాయించుకుంటున్న సొంత డబ్బా గురించి!!
ఇటీవల విశాఖలో జరిగిన సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు 120 ఏళ్లుగా దేశ పారిశ్రామిక అభివృద్ధిలో విశేష కృషి చేసిన కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) లాంటి సంస్థపై తనదైన శైలిలో స్పందించారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటికి చిన్న సంస్థగా ఉన్న సీఐఐని తానే తనదైన శైలిలో ప్రమోట్ చేసినట్లుగా బాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను పలువురు తప్పు పడుతున్నారు. చంద్రబాబు స్థాయి మనిషి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
భారతదేశంలో ఏ గొప్ప విషయం జరిగినా, ఆఖరి ఒలింపిక్స్ లో పథకాలు సాధించినా.. అందులో కూడా తనపాత్రే కీలకం అనేస్థాయిలో చంద్రబాబు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఐఐ పై బాబు చేసిన వ్యాఖ్యలపై ఆన్ లైన్ వేదికగా కౌటర్లు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. తనను తాను ఏ రేంజ్ లో పొగుడుకున్నా తప్పులేదు కానీ… ఈ క్రమంలో ఇతరులను తక్కువచేసే పనికి మాత్రం పూనుకోవద్దని బాబుకు పలువురు సూచిస్తున్నారు.
కాగా… 1895లో ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్ గా ఐదు ఇంజనీరింగ్ తయారీ సంస్థలతో సీఐఐ ప్రస్థానం మొదలైంది. అనంతరం 1912లో ఇండియన్ ఇంజనీరింగ్ అసోసియేషన్, 1942లో ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా పేర్లు మార్చుకుంది. పేరు ఏదైనా అప్పటివరకు కేవలం బ్రిటిష్ కంపెనీల కోసమే పనిచేసిన ఈ సంస్థ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఈ సీఐఐ లో 8000 మందికి ప్రత్యక్ష సభ్యత్వం ఉండగా.. సుమారు 2 లక్షల మందికి పరోక్ష సభ్యత్వం ఉంది!