చేనేత కార్మికుల కష్టాలపై తాను పోరాటం చేస్తానని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కొంతమంది చేనేత కార్మికులు తమ సమస్యల్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇకపై తాను చేనేతల్ని ధరిస్తాననీ, చేనేతకు అంబాసిడర్‌గా ఉంటానని పవన్ ప్రకటించడం విశేషం. నేత కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే నెల 20న మంగళగిరిలో జరిగబోయే చేనేత సత్యాగ్రహం కార్యక్రమంలో తాను ముఖ్యఅతిథిగా పాల్గొంటానన్నారు. కార్మికులకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ వంటి విషయాలపై తాను నిపుణులతో మాట్లాడతాననీ, అన్నిరకాలుగా వారికి తాను చేయదగ్గ సాయం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక హోదా గురించి కూడా పవన్ స్పందించారు.
ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాటను నిలుబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరితే.. మొండి వైఖరి అవలంభిస్తోందని మరోసారి పవన్ విమర్శించారు. తాము చేసిన చట్టాలను ప్రజలు గౌరవించాలని నాయకులు కోరుకుంటారు… మరి, నాయకులు ఇచ్చిన మాటపై నిలబడకపోతే ప్రజలు ఎలా స్పందిస్తారు, ఈ ధోరణి వల్ల ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. కొంతమంది నాయకులు తాను ట్విట్టర్‌కే పరిమితం అవుతున్నారని విమర్శిస్తున్నారనీ, కనీసం తాను ఆమాత్రమైనా తరచూ స్పందిస్తున్నాననీ, వాళ్లు పార్లమెంటులో ఉంటూ కూడా మాట్లాడలేకపోయారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
ప్రత్యేక ప్యాకేజీని కూడా అర్ధరాత్రి పూట ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ మరోసారి ప్రశ్నించారు. ఎన్నికలు ముంచుకొచ్చేయడంతో చాలా స్ట్రాటజిక్ గా ఆరోజున రాష్ట్రాన్ని అర్ధరాత్రి విభజించారని అన్నారు. దాని వెనకున్న రాజకీయ ప్రయోజనాలను అర్థం చేసుకోగలం అని చెప్పారు. కానీ, ప్యాకేజీ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఎందుకు అన్నారు. ప్యాకేజీలో ఎలాంటి లోపాలూ లేవు, దాన్ని ప్రకటించడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవూ అనుకుంటే అలా భయంభయంగా రాత్రిపూట ప్రకటించాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి లోపాలు కనిపిస్తేనే రోడ్డుమీదికి రావాలని అనిపిస్తుందని తెలిపారు.
“హోదా విషయంలో మేము తప్పు చేశాం, అనుకున్నాంగానీ ఇవ్వలేకపోతున్నాం” అంటూ కేంద్రం ప్రజలకు సారీ చెప్పే ప్రయత్నం కూడా కేంద్రం చేయటం లేదన్నారు. గతంలో హిందీని భారతీయులపై రుద్దే ప్రయత్నం జరిగితే, చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరసన తెలిపారనీ, దీంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. హోదా రాదనే విషయం ముందే చెప్పేస్తే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు కదా అని ప్రశ్నించిన పవన్… ఎన్నికలకు వచ్చినప్పుడు ఒకలా, తరువాత మరోలా స్పందిస్తే ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోతుందని సూచించారు.
వామపక్షాలతో కలిసి పనిచేసే విషయమై పవన్ స్పందిస్తూ.. తాను లెఫ్టూ కాదు, రైటూ కాదనీ సమస్యలు ఎక్కడుంటే వాటిపై పోరాడతాననీ, ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని ముందుకు సాగేందుకు సిద్ధమని పవన్ అన్నారు.