అదేంటో… ఆంధ్రాలో చాలామంది భాజపా నాయకులు చంద్రబాబు కోసమే ఎక్కువగా తపన పడుతుంటారు! సొంత పార్టీ భాజపా కంటే.. మిత్రపక్షం తెలుగుదేశానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు! ఇలాంటి చర్యలు నాయకుల స్థాయిలో ఎలా ఉన్నా.. కార్యకర్తల దగ్గరకి వచ్చేసరికే, అసలు అసంతృప్తి బయట పడుతుంది. భాజపాలో బాబు భక్తిపరాయణుల్లో మంత్రి కామినేని ఒకరు. ఆయన భాజపా నుంచి గెలిచినా, తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రినే అనుకుంటూ ఉంటారు. భాజపా ప్రయోజనాలను పక్కబెట్టి, తెలుగుదేశం ప్రయోజనాల కోసం తనదైన శైలిలో విశేష కృషి చేస్తూంటారు! తాజాగా ఆయన చేసిన అలాంటి కృషి ఫలితమే భాజపా కార్యకర్తలకు మంటపుట్టిస్తోంది! మంత్రిగారిపై ఢిల్లీ వరకూ ఫిర్యాదు చేసే స్థాయికి తీసుకొచ్చింది..!
నామినేటెడ్ పదవుల విషయంలో భాజపా పెద్దలు చంద్రబాబుతో రాజీపడిపోతున్నారన్న విమర్శ చాలారోజుల నుంచీ ఉంది! పొత్తు ప్రకారం నామినేటెడ్ పదవుల్లో భాజపా వారికి చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదన వింటున్నదే. అయితే, తమ పార్టీ వారికి అన్యాయం జరుగుతున్నా ఆంధ్రా భాజపా నేతలు పట్టించుకోవడం లేదని కిందిస్థాయి నాయకత్వం నుంచి అసంతృప్తి తీవ్రంగా వ్యక్తమౌతోంది! ఈ మధ్యనే ఓ మండలాధ్యక్షురాలి పదవి విషయంలో కామినేని చాలా చురుగ్గా స్పందించేశారు! ఆ చురుకుదనం ఇతర అంశాల్లో ఎందుకు ఉండటం లేదన్నది ప్రశ్న..?
ఒప్పందం ప్రకారం కైకలూరు మండలాధ్యక్షురాలిగా సత్యవతి రెండున్నరేళ్లు మాత్రమే కుర్చీలో ఉండాలి. ఆ తరువాత, తెలుగుదేశం పార్టీ వారికి ఆ పీఠం దక్కుతుంది. రెండున్నరేళ్లు పూర్తయినా కూడా సత్యవతి సీటు ఖాళీ చేసేందుకు పట్టుబట్టారు! దీంతో టీడీపీ నేతలు భాజపా నాయకుడైన కామినేనికి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించేసి… భాజపా నాయకురాలిని సీటు మీద నుంచి దించేసి, తెలుగుదేశం పార్టీకి ఆ స్థానాన్ని అప్పగించే వరకూ చాలా కృషి చేశారు! ఈ వ్యవహారంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిని కూడా సస్పెండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంలో మంత్రిగారి చొరవ చాలా ఎక్కువగా ఉంటోందని కొంతమంది భాజపా నేతలకు కోపం వచ్చింది! భాజపాకి రావాల్సిన నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రిగారు ఇంత చొరవ ఎందుకు తీసుకోవడం లేదన్నది వారి తీవ్ర అసంతృప్తి! ఇదే విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి కూడా ఏపీ నుంచి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. మంత్రి కామినేని, పూర్తిస్థాయి టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారనీ, ఈ క్రమంలో సొంత పార్టీకి నష్టం కలిగేలా చేస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులకు స్పందించే పరిస్థితి అక్కడ ఉందంటారా..? పైగా, ఢిల్లీలో వెంకయ్య నాయుడు ఉన్నారాయే! ఆయనా చంద్రబాబు అవిభక్త కవలలు అనే విమర్శలు తక్కువ ఉన్నాయా..?