తెలుగు 360 రేటింగ్: 3/5
నాని దగ్గరో మ్యాజిక్ ఉంది. విషయం లేని చోట కూడా.. ఏదో ఓ జిమ్మిక్ చేసి సీన్‌ని పాస్ చేసేస్తాడు. అలాంటి వాడి చేతికి పదునైన కథ దొరికితే ఎలా ఉంటుందో… భలే భలే మగాడివోయ్, జెంటిల్మెన్ సినిమాలు నిరూపించాయి. ఆ సినిమాలతోనే నాని రేంజు కూడా పెరిగిపోయింది. దాంతో పాటు అంచనాల భారం కూడా. ఇవన్నీ మోసుకొంటూ నాని సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్… అంటూ వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది?? నాని మళ్లీ రెచ్చిపోయాడా?? ఈ లోకల్ గాడి కథా కమామిషూ ఏంటో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ అవ్వాల్సిందే.
* కథ
నాని కి అల్లరి, యాటిట్యూడ్ రెండూ ఎక్కువే. దండం పెడితే గానీ నన్ను పాస్ చేయడా.. అని ఈగోకి ఫీలై.. దేవుడికి కూడా దండం పెట్టడు. అలాంటి కుర్రాడు కీర్తి సురేష్‌ని చూసి మనసు పారేసుకొంటాడు. తనని ఫాలో అవ్వడం మొదలెడతాడు. కీర్తి సురేష్కేమో వాళ్ల నాన్నంటే ప్రేమ. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోకూడదు అని గట్టిగా ఫిక్సయిపోతుంది. అందుకే అబ్బాయిలు, ప్రేమలూ…లాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటుంది. ఎంత కాదన్నా… నాని డిస్ట్రబ్ చేస్తూనే ఉంటాడు. డిస్ట్రబ్ అవ్వకూడదు, అవ్వకూడదు అంటూ డిస్ట్రబ్ అయిపోయి.. నాని ప్రేమలో పడిపోతుంది కీర్తి. ఈలోగా నవీన్ చంద్ర ఈ కథలోకి వస్తాడు. కీర్తిని పెళ్లి చేసుకొనేది నేనే అంటాడు. నిజానికి కీర్తిని పెళ్లి చేసుకొనే అర్హత నాని కంటే నవీన్ చంద్రకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేవలం కీర్తి కోసమే నాలుగేళ్లు దూరంగా ఉండి.. ఎస్.ఐ ఉద్యోగం తెచ్చుకొంటాడు నవీన్. కీర్తి తండ్రి కూడా `నవీన్‌నే పెళ్లి చేసుకోవాలి` అనే కండీషన్ పెట్టేస్తాడు. మరి అప్పుడు కీర్తి ఏం చేసింది? నాని ఎలాంటి స్టెప్ తీసుకొన్నాడు? కీర్తి కోసం ఏం చేశాడు? అనేది వెండి తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్ సినిమాలు రెండూ కలిపితే ఎలా ఉంటుందో… నేను లోకల్ కథ అలా ఉంటుంది. ఓ అల్లరి అబ్బాయి ఓ అందమైన అమ్మాయిని ప్రేమించడం, నాన్న కోసం ఆ అమ్మాయి తలొగ్గడం, చివరిని హీరో నాన్నని మార్చి తాను కోరుకొన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఇదీ ఆ రెండు సినిమాల కాన్సెప్టులు. సేమ్ నేను లోకల్ కూడా అంతే. ఇప్పటి వరకూ మనం చూసేసిన చాలా తెలుగు సినిమాలు నేను లోకల్ కథ కి చాలా దగ్గరగా ఉంటాయి. కథ విషయంలో అటు దర్శకుడు గానీ, ఇటు నాని గానీ ఎలాంటి కొత్తదనాలకూ పోలేదు. వాళ్లు నమ్ముకొన్నది సీన్లనీ, ట్రీట్ మెంట్ని. ఆ విషయంలో మాత్రం ఫుల్లుగా మార్కులు పడిపోతాయి. నాని పరీక్షల ఎపిసోడ్, లవ్ ట్రాక్, నాని అమ్మానాన్నల క్యారెక్టరైజేషన్ ఇవన్నీ… ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేవే. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. తొలిసగంలో ఉన్న వేగం సెకండాఫ్‌లో ఎక్కడా కనిపించదు. కానీ.. ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఢోకా ఉండదు. సినిమా అంతా సాగదీస్తున్నట్టు అనిపించినా.. నాని తనదైన కామెడీ టైమింగ్ తో ఎలాంటి డెప్తూ లేని సీన్‌కి కూడా కాస్త విలువ తీసుకొచ్చాడు. పతాక సన్నివేశాలు మరీ రొటీన్ గా సాగి విసిగిస్తాయి. టోటల్‌గా రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే సీన్లతోనే `నేను లోకల్` తయారైంది. మజ్నులో ఎలాగైతే కథ లేకపోయినా.. కేవలం తన నటనతో నాని నెట్టుకొచ్చేశాడో.. సేమ్ ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు నాని. తనకి మాటల రచయిత నుంచి కావల్సినంత సహకారం లభించింది. అందుకే చాలా సింగిల్ లైనర్లు బాగా పేలాయి. కాలేజీ సీన్లు, లవ్ ట్రాక్.. ఈతరం యువతకు నచ్చేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. `మందా? మందులా` అనే కాన్సెప్ట్‌తో సాగే ఫైట్… మాస్‌కి బాగా నచ్చుతుంది. నాని ఏంటి? అంత మందిని కొట్టేయడం ఏంటి? అనే లాజిక్కుని మర్చిపోయే ‘మందు’ వేశాడు ఈ సినిమాలో!
సెకండాఫ్‌లో పోలీస్ట్ స్టేషన్ సీన్.. లాజిక్ లెస్ గా తయారైంది. నవీన్ చంద్రని ఏదోలా బఫూన్ని చేయాలన్న ఉద్దేశంతో తలా తోకా లేని సీన్ రాసుకొన్నారు. అక్కడ దర్శకుడు కాస్త ఇంటిలిజెన్స్ ఉపయోగిస్తే బాగుండేది. క్లైమాక్స్ కూడా కన్వెన్సింగ్గా లేదు. ఎప్పుడో ఇంట్రవెల్లో చూసిన రావు రమేష్‌ని… క్లైమాక్స్‌లో వాడుకొన్నారు. బలవంతంగా.
* నటీనటుల ప్రతిభ
ఇది నాని సినిమా. నాని ఫ్యాన్స్ కి నచ్చే సినిమా. ఎప్పటిలా అదరొట్టేశాడు. నాని కోసమైనా ఈ సినిమా చూడాలి అనుకొనేలా నటించాడు. కీర్తి అందంగా ఉంది. నానితో జోడీ చాలా బాగుంది. హీరోయిన్ తండ్రి పాత్రకు ఇంకాస్త బెటర్ ఆప్షన్ వెదుక్కొంటే బాగుణ్ణు. పోసాని ఎప్పట్లానే, తనదారిలోనే ఎంటర్టైన్ చేశాడు. నవీన్ చంద్ర కు ఇది కొత్త తరహా పాత్ర. తన క్యారెక్టర్ని ఇంకాస్త బాగా డిజైన్ చేసినా తప్పు లేకపోదును. మిగిలినవాళ్లంతా.. తమ తమ పరిధి మేర నటించారు.
* సాంకేతిక వర్గం
దేవిశ్రీ సంగీతంలో పాటలు ఓకే అనిపిస్తాయి. కానీ దేవి నుంచి ఆశించే ఆల్బమ్ మాత్రం కాదు. పాటలన్నీ ఏవరేజ్. నేపథ్య సంగీతం కూడా అంతే. మాటల రచయిత ప్రసన్న మరోసారి మెరిశాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. దర్శకుడు రొటీన్ కథని ఎంచుకోవడం నిరాశ పరిచింది. కానీ ఉన్నంతలో… బాగానే చేసుకొచ్చాడు. తనకి మిగిలిన సాంకేతిక విభాగం మంచి సహకారం అందించింది.
* ఫైనల్ టచ్ : నాని.. నాని.. నాని…. అంతే!