సంపత్ నంది తెలివైన వాడే. వవన్‌కల్యాణ్ పేర్లు భలే వాడేసుకొంటుంటాడు. బెంగాల్ టైగర్ అంటూ.. పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రాసుకొన్నాడు సంపత్. ఆ సినిమా ఛాన్స్ సంపత్ నుంచి చేజారడంతో.. ఆ టైటిల్‌ని రవితేజకు ఇచ్చేశాడు. ఆ సినిమా హిట్టయ్యింది. ఇప్పుడు గోపీచంద్ సినిమా విషయంలోనూ పవన్ పేరే వాడుకొంటున్నాడు. అత్తారింటికి దారేదిలో పవన్ పేరేంటో గుర్తుంది కదా? `గౌతమ్ నందా`. ఇప్పుడు ఈ పేరుని టైటిల్‌గా ఫిక్స్చేశాడు. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘గౌతమ్ నందా’ అనే పేరు ఖాయం చేసినట్టు టాక్. రేపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా టైటిల్‌ని ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయి. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. వేసవికి ఈచిత్రాన్ని బరిలో దించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.