విశాఖపట్నంలో భారీ ఎత్తున భాగస్వామ్య సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఎమ్.ఒ.యు.లు కుదుర్చుకున్నాయి. రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేస్తే… రూ. 10.54 లక్షల కోట్ల విలువైన ఎమ్.ఒ.యు.లు జరిగాయి. అనుకున్నదానికంటే అధికంగానే పెట్టుబడులను ఆకర్షించామని చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఈ లెక్కలపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎలా వచ్చాయా అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
హోదా వస్తేనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయన్న బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాని కోసం ఓ పక్క ఉద్యమం కూడా జరుగుతోంది. అయితే, హోదాతో సంబంధం లేకుండానే చంద్రబాబు సర్కారు భారీ ఎత్తున పరిశమ్రలు తీసుకొచ్చిందని అభిప్రాయం కలిగించడం తెలుగుదేశం వ్యూహం కావొచ్చు! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో అదే పదేపదే ధ్వనిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రా నంబర్ వన్ గా నిలుస్తోందని చంద్రబాబు అంటున్నారు. అలాగే, విశాఖ జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అక్కడ జరిగిన ఎమ్.ఒ.యు.లలో 90 శాతం అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు!
అంటే, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రూ.10.5 లక్షల కోట్లలో పదిశాతం తగ్గించుకోవాలా..? పరిశ్రమలు పెడతాం అని ముందుకొచ్చినవారిలో ఒప్పందాలకే పరిమితమైన ఉంటారని ఒప్పుకుంటున్నట్టా..? వస్తాయన్న కంపెనీల్లో కొన్ని కాగితాల మీదనే ఉండిపోతాయా..? ఈ విషయాలు ముందే తెలిస్తే… రూ. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ గొప్పగా ఎలా చెప్పుకుంటున్నట్టు..?
ఇలాంటి సదస్సుల్లో అత్యుత్సాహం చూపే సంస్థల్లో పరిశ్రమల ఏర్పాటు వరకూ వచ్చేసరికి చేతులు ఎత్తేసేవి చాలా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. ఎడాపెడా సంతకాలు పెట్టేసినంత మాత్రాన పరిశ్రమలు వచ్చేసినట్టు కాదు కదా! ఆ లెక్కన గత ఏడాది జరిగిన ఎమ్.ఒ.యు.లన్నీ ఈపాటికి పరిశ్రమలుగా కనిపించాలి కదా! ఈ వాస్తవం చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే, పెట్టుబడులకు సంబంధించి ఎంత పెద్ద నంబర్ చెబితే అంత గొప్ప అనుకున్నట్టున్నారు. అందుకే, రూ. 10.5 లక్షల కోట్లని చెప్పుకున్నారు. ఇప్పుడేమో.. వాటితో 90 శాతం వచ్చేట్టు కృషి చేస్తాం అంటున్నారు. ఇంకొద్ది రోజులుపోతే.. ఆ శాతంలో ఇంకొంత మార్పు రావొచ్చు. సో… రూ. 10.5 లక్షల కోట్ల పెట్టబడులు అనేది ప్రచారానికి పనికొచ్చే నంబర్ మాత్రమే. ఆ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకుంటున్నట్టుగా ఉంది.