నిజానికి, తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు ఇబ్బందులు తెప్పించే స్థాయిలో ప్రతిపక్షాలేవీ లేవు! ఫిరాయింపుల పుణ్యమా అని తెరాస బలమైన రాజకీయ శక్తిగా కనిపిస్తోంది. అయితే, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీరు సర్కారుకు నెమ్మదిగా హీట్ పెంచేలానే ఉంది. కేసీఆర్ సర్కారుకు ఆయన అడుగడుగునా పంటి కింద రాయిలా తగులూనే ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ ఉద్ధృతిని పెంచేందుకు మూలకారణమైన అంశాన్నే ఇప్పుడు కోదండరామ్ మళ్లీ తెరమీదికి తెస్తున్నారు. యువతను ఏకం చేస్తూ సర్కారుపై ఉద్యమించేందుకు సిద్ధమౌతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా నిలిచింది. రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయంటూ నాడు యువత ఉద్యమించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన ఉద్యోగాల కోసమనీ, కానీ ఆ దిశగా కేసీఆర్ సర్కారు నియామకాలు చేపట్టడం లేదంటూ ఆగ్రహిస్తున్నారు కోదండరామ్. ఈ నెల 22న నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఙాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకూ ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు.
తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసమనీ, కానీ ఆ దిశగా సర్కారు అడుగులు వేయడం లేదని కోదండరామ్ విమర్శించారు. ఇప్పటివరకూ 15 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారనీ, ఎంతోమంది నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగులు తీసుకుని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని కోదండరామ్ విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులూ రైతుల సమస్యలపై కోదండరామ్ పోరాటాలు అంటూ ఉండేవారు.. వాటికి కేసీఆర్ సర్కారు నుంచి స్పందన కూడా సోసోగానే ఉండేది. కానీ, ఇప్పుడు నిరుద్యోగుల ఇష్యూని తీసుకోవడం.. కేసీఆర్ సర్కారుకు టెన్షన్ పెంచే వ్యవహారమే! గతంలో పనిచేసిన ఈ సెంటిమెంట్ నే మరోసారి ప్రయోగించేందుకు కోదండరామ్ సిద్ధమౌతున్నారు. మరి, కేసీఆర్ వ్యూహం ఏంటో చూడాలి మరి!