చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్… ఓ సన్సేషన్లా మారిందిప్పుడు. వీళ్లిద్దరూ కలసి సినిమా చేయడం ఏంటి? ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సే లేదు… అంటూ ఇప్పటికీ నెగిటీవ్‌గానే మాట్లాడుకొంటున్నారంతా. ఈ కాంబినేషన్ కేవలం పేపర్లకే పరిమితమని, సెట్స్‌పైకి వెళ్లడం అసాధ్యమని లైట్ తీసుకొంటున్నవాళ్లూ కనిపిస్తూనే ఉన్నారు. కానీ తెర వెనుక సుబ్బరామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. సుబ్బరామిరెడ్డి అసలే కాస్త జగమొండి. ఆయన అనుకొంటే.. చేసి తీరతాడు. ఆ మొండితనమే అసాధ్యమనుకొన్న కాంబోని.. సుసాధ్యం చేయిస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్మకం. ఈ కాంబోని సెట్ చేయడంలో సుబ్బరామిరెడ్డి ఎంత కష్టపడ్డాడో ఏంటో గానీ.. ఇప్పుడు అసలు తలనొప్పంతా త్రివిక్రమ్‌కే. ఇద్దరు మెగా హీరోలను కలపడంతోనే సరిపోదు.. వాళ్లకు సరిపడా కథని రాసుకోవడంలోనే గొప్పదనం దాగుంది. చిరు, పవన్‌లు కలసి నటిస్తే బాగుణ్ణు అని, వాళ్లని ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని ఆశపడిన దర్శకులు చాలా మందే ఉన్నారు. వాళ్లవి కలలు కేవలం కలలుగానే మిగిలిపోయాయంటే దానికి గల కారణం కథే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ చేతికి వచ్చింది. ఆ కలని నిజం చేసే బాధ్యత తన భుజాలపై వేసుకొన్నాడు. ఇప్పుడు చిరు, పవన్‌ల ఇమేజ్‌కి తగ్గట్టు, వాళ్ల అభిమానుల అంచనాలకు తగ్గట్టు కథ సెట్ చేయడం త్రివిక్రమ్ తలకు మించిన భారమే.
అయితే త్రివిక్రమ్ స్వతహాగా ఓ మంచి రచయిత. తన దగ్గర కథలకు కొరత ఉండదు. అఆ లా పాత కథనో, పుస్తకాన్నో కమర్షియల్ విలువలు ఉన్న సినిమాగా మార్చుకోవడం త్రివిక్రమ్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఓ సాధారణమైన అంశాన్ని కూడా అసాధారమైన సినిమాగా మలచడంలో దిట్ట. ఇప్పటికే చిరు, పవన్‌ల సినిమాకు ఓ లైన్ సిద్ధం చేశాడట. అది నచ్చే… చిరు, పవన్‌లు ఈ సినిమాకి ఓకే చెప్పారని టాక్. చిరు, పవన్ లు ఈ సినిమాలో అన్నదమ్ములుగానే కనిపించే ఛాన్స్ ఉందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరు సీరియస్ గా తీసుకొన్నా తీసుకోకపోయినా.. త్రివిక్రమ్ మాత్రం ఈ కాంబోని సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఓ గొప్ప కథే.. సినిమాని నడిపిస్తుంది. కథే తన కథానాయకుల్ని వెదుక్కొంటుంది. అయితే ఇక్కడ మాత్రం కథానాయకులు సెట్ అయ్యారు.. కథ కావాలి. అలాంటి గొప్ప కథ రాసే సమర్థత త్రివిక్రమ్‌కి ఉంది కాబట్టి… ఈ కాంబినేషన్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనే తీసుకోవాలిక.